తేనెటీగల మనుగడ కొనసాగాలి!

Why bees are essential to people and planet

Update: 2023-05-23 23:45 GMT

శతాబ్దాలుగా భూగ్రహంపై మానవుడు బ్రతుకుతూ ఉండడానికి ముఖ్య కారణం తేనెటీగలు అని చాలా మందికి తెలియదు. ఇవి లేకుంటే మానవ జాతి మొత్తం ముప్పై రోజుల్లో అంతరించి పోతుంది. భూమిపై చెట్లు మొలవాలన్నా, పంటలు పెరగాలన్నా తేనెటీగలు, కీటకాలు, పక్షుల అవసరం ఎంతో ఉంది. ప్రతి జీవి వేరొక జీవిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పుప్పొడి, మకరందం ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు తీసుకువెళ్లడం ద్వారా, తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్కాలు సమృద్ధిగా పండ్లు, కాయలు మరియు గింజల ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. పరాగసంపర్కం సాధారణంగా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జీవవైవిధ్యం, వ్యవసాయం ఆధారపడిన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థలు పెరగడానికి సహాయపడుతుంది. మానవ శ్రేయస్సు, జీవనోపాధికి కీలకమైన అనేక రకాల మొక్కలకు పరాగ సంపర్కాలు అవసరం. తేనెటీగలు సాగుకు అడవి మొక్కల పునరుత్పత్తికి పాటుపడుతున్నాయి. నేడు తేనెటీగలు, ఇతర కీటకాలు పక్షులు కాలుష్యం వలన అంతరించి పోతున్నాయి.. తేనెటీగలు, మానవాళికి, పర్యావరణకు ఏ విధంగా దోహదం చేస్తున్నాయో ప్రజలకు తెలియాలి. ఈ కీటకాలు అంతరించిపోకుండా కాపాడటానికి మన వంతు కృషి చేయాలి.

కంటికి రెప్పలా కాపాడుకోవాలి

తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథొని జంసా 1934, మే 20న స్లొవేనియా జన్మించాడు. అందుకే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, మే 20న ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించి మానవాళికి ఎంతో మేలు చేసున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 2018, మే 20న తొలిసారిగా ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపబడింది. తేనెటీగలకు మానవ కార్యకలాపాల నుండి నిరంతర ముప్పును ఎదుర్కొంటున్నాయి, ఇందులో ఇన్వేసివ్ కీటకాలు, పురుగుమందులు, భూ-వినియోగ మార్పు మరియు మోనోక్రాపింగ్ పద్ధతులు ఉన్నాయి, ఇవి కాలక్రమేణా తేనెటీగలను నాశనం చేస్తున్నాయి. ప్రపంచంలో 35% పంటలు తేనెటీగలపై ఆధారపడి ఉన్నాయి. తేనెటీగలు తేనె, రాయల్ జెల్లీ, పుప్పొడి, మైనం, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాలలో ఉపయోగించే ఇతర ఉత్పత్తులను అందిస్తున్నాయి.

వైద్యవిధానాల్లో తేనె వాడకం

ఎన్నో వేల సంవత్సరాలుగా తేనె బాగా రుచికరమైనదని ప్రసిద్ధి. అలాగే అనేక వ్యాధులకు ఒక ముఖ్య వైద్య చికిత్సలా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన పూర్వీకులు తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై బాగా అవగాహన కలిగి ఉన్నారు. ఇంతకు ముందు తేనెను ఒక ఔషధ మూలికగా ‘సుమేరియన్ మట్టి పాత్రలలో’ సుమారు 4000 సంవత్సరాలు క్రితం ఉపయోగించారు. దాదాపు 30% సుమేరియన్ల వైద్య చికిత్సలో తేనె వాడుతున్నారు. భారత దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ధ, ఆయుర్వేదంలో తేనె ప్రధాన మూలికగా ఉపయోగపడుతోంది. తేనెను గోరువెచ్చని నీటితో కలిపి త్రాగితే, అది రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తేనె వాడకం వల్ల కీమోథెరపి రోగులలో తక్కువగా వున్న తెల్ల రక్త కణాల సంఖ్యను నియంత్రిస్తాయని మరికొన్ని ప్రాథమిక ఆధారాల వలన రుజువయ్యింది. చక్కెర, బెల్లంకు, ప్రత్యామ్నాయంగా తేనె వాడటం శరీరానికి సురక్షితం. ఇంతగా ఉపయోగపడుతున్న తేనెటీగలను కాలుష్యం నుండి రక్షిస్తూ, వాటిని అంతరించిపోకుండా చూసే బాధ్యత మానవులందరిది.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Tags:    

Similar News