మేనిఫెస్టోల్లో వేతన జీవుల ప్రస్తావనేది?

Why are the problems of government employees and teachers ignored in the manifestos of political parties?

Update: 2023-11-03 00:30 GMT
మేనిఫెస్టోల్లో వేతన జీవుల ప్రస్తావనేది?
  • whatsapp icon

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల చివరన ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. అయితే, ఏ మేనిఫెస్టో పరిశీలించి చూసిన రైతులకు, వృద్ధులకు సంబంధించిన పథకాలు, ఆరోగ్యశ్రీ స్కీమ్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు, అక్కడక్కడ నిరుద్యోగ భృతి, మహిళలకు సంబంధించిన స్కీంలు కనిపిస్తున్నాయే తప్ప ఉద్యోగులకు ప్రయోజనకర రీతిలో ఏ ఒక్క అంశం కనిపించక పోవడం విచారించదగ్గ విషయం.

ఉద్యోగుల ప్రధాన సమస్యలు..

ప్రభుత్వం అమలు చేసే పలురకాల పథకాలను ప్రజలకు చేరవేసే వారధులు ప్రభుత్వోద్యోగులు. అటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలు వారి సమస్యలను తమ తమ మేనిఫెస్టోలో చేర్చకపోవడం విడ్డూరం. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రధాన సమస్య నూతన పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దీనికోసం గత 20 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. కానీ నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొన్ని పార్టీలు సీపీఎస్ రద్దుకై కమిటీ వేస్తాం అని తమ మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ, కచ్చితంగా రద్దు చేస్తాం అని ప్రకటించక పోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరాశలో ఉన్నారన్నది నిర్వివాదాంశం. అలాగే ఇంకో అతి ప్రధాన సమస్య వైద్యం. మెరుగైన వైద్యం కోసం ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వేతన జీవులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఆ దిశగా ప్రధాన పార్టీలు హామీ ఇవ్వకపోవడం శోచనీయం.

టీచర్ల సమస్యలు..

ఇక ఉపాధ్యాయుల విషయానికొస్తే ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య సుమారు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండి కొరకరాని కొయ్యగా తయారయ్యింది. పండిట్, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ ప్రహసనంగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రమోషన్‌లు, ఐదేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారనేది అక్షరసత్యం. ఇవేకాక నెల మొదటి రోజు వేతనాలు అందక, బిల్లుల మొత్తం సకాలంలో జమకాక తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఓ వైపు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో వారి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించారే తప్ప, ఎక్కడ ఉద్యోగాల భర్తీకి హామీలు ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. ముఖ్యంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వేతన జీవుల సమస్యల పరిష్కారం దిశగా ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో అంశాలను పొందుపరిచే దిశగా అడుగులు వేయాలని సగటు ఉద్యోగి ఆకాంక్ష. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లకు ఆరునెలల కొకసారి మంజూరు చేయాల్సిన డీఏ, ఐదేళ్లకొకసారి వేతన సవరణ ప్రకటించాలి. ఉపాధ్యాయులు 35 సంవత్సరాల సర్వీసు‌లో ఒక్క ప్రమోషన్ పొందకుండానే ఉద్యోగ విరమణ పొందాల్సిన దుస్థితి నేడు నెలకొన్నది. అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ వైపుగా ప్రధాన పార్టీలు దృష్టి సారించాలి.

- సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు STUTS

90006 74747

Tags:    

Similar News