పింఛన్ల పంపిణీకి ఏ మార్గం మేలు..

సామాజిక తనిఖీ పథకాలను రూపొందించేటప్పుడు ప్రధానంగా ప్రభుత్వాలు ‘అనర్హులు ఎవరూ పథకాలను పొందకూడదు’ అనే అంశం పైనే దృష్టి

Update: 2024-04-12 01:00 GMT

సామాజిక తనిఖీ పథకాలను రూపొందించేటప్పుడు ప్రధానంగా ప్రభుత్వాలు ‘అనర్హులు ఎవరూ పథకాలను పొందకూడదు’ అనే అంశం పైనే దృష్టి పెడుతున్నారు తప్ప ‘పథకాల ప్రయోజనాల డెలివరీలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఆలోచించడం లేదు. ఈ స్థితిలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గడప దగ్గరే పింఛన్ల పద్ధతి ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగించాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇదే ఆచరణీయ పద్ధతి కావాలి.

ప్రభుత్వాలు తమ పరిపాలన సౌలభ్యానికి అనుకూలమైన నగదు బదిలీ పద్ధతులను ప్రజలపై రుద్దకుండా, ప్రయోజనాలు ఎలా పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం లబ్దిదారులకు వదిలిపెట్టాలి. సామాజిక పింఛన్ల చెల్లింపులు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశిక సూత్రాల నెరవేర్పు దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ప్రభుత్వాలు గుర్తించాలి. అపుడు మాత్రమే పేదలు పథకం అమలులో సమాన భాగస్వాములు ఔతారు.

నీతి అయోగ్ ఏం చెప్పిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి గ్రామ వాలంటీర్లను వినియోగించకూడదని ఎన్నికల కమిషన్ నిర్ణయం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దారి తీసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయానికి కారణం వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులని ఆరోపణ రావడమే. ఈసీ ఆదేశంతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 66 లక్షల మంది పింఛనుదారుల అవస్థలకు టీడీపీనే బాధ్యత వహించాలని అధికార పార్టీ ఆరోపిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ మాత్రం పెన్షన్ల విషయంలో ప్రజల ఇబ్బందులతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చుకుంది. రాజకీయ పార్టీల పోరాటాలు ఎలా ఉన్నా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఎలా జరగాలి? పింఛను నగదు చేతికి ఇవ్వడం మంచిదా లేక బ్యాంకు ఖాతాలో జమ చేయడం మంచిదా? అనే ప్రశ్నలు ఈ గొడవ పుణ్యాన తెరపైకి వచ్చాయి. ఆ ప్రశ్నలను చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.

దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాలు కేవలం బ్యాంకు ఖాతాలలో మాత్రమే నగదు జమ చేయాలని, చేతికి నగదు ఇచ్చే పద్ధతికి మంగళం పాడాలని గత కొన్నాళ్లుగా నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తుంది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత, ప్రయోజనాలు అందించే బాధ్యత ఒకరి చేతులోనే ఉంటే అవినీతి జరిగే ఆస్కారం ఉంటుందని వారి భావన. దానితో బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీలు సుపరిపాలనకు గీటురాయిగా, పర్యాయపదంగా మారిపోయాయి. ఐతే ముందుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీలో సమస్యలు గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

1. సాంకేతిక సమస్యలు:

ప్రభుత్వాలు ప్రజల ఖాతాలలోకి నగదు బదిలీ చేసేటపుడు కనీసం 5% లావాదేవీలు సాంకేతిక కారణాల వలన తిరస్కరణకు గురిఔతున్నాయని ‘లిబ్టెక్ ఇండియా’ సంస్థ తన పరిశోధనలో తేల్చింది. ఇది చిన్న సంఖ్యలాగ కనిపిస్తున్నప్పటికీ దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 కోట్ల లబ్దిదారులకు నగదు బదిలీ లావాదేవీలు జరిగితే నెలకు కనీసం 2.5 లక్షల మంది తమకు రావాల్సిన నగదుని అందుకోలేరు. అది మాత్రమే కాదు సాంకేతిక సమస్యను పరిష్కరించుకోవడానికి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానివలన వారి సమయం, పైసలు వృధా ఔతాయి. ఈ పరిస్థితులు ఇప్పటికే పలు నగదు బదిలీ కార్యక్రమాలలో ఉన్నాయి. ఈ సమస్య గురించి గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన తాజా వార్షిక నివేదికలో సైతం ప్రస్తావించడం గమనార్హం.

2. తప్పుగా నిర్దేశించిన చెల్లింపులు:

బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయడంలో ఇదొక ప్రధాన సమస్య. బ్యాంకు అకౌంట్లకు ఆధార్ సీడింగ్ చేయడంలోనూ, బ్యాంకు అకౌంట్ వివరాలు ప్రభుత్వ వెబ్సైటు లలో నమోదు చేయడంలోనూ తప్పులు దొర్లడం వలన ఒకరి బ్యాంకు ఖాతాలో పడాల్సిన నగదు మరొకరి బ్యాంకు ఖాతా లో పడే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించడం తలకుమించిన పని. నిజానికి ఇలాంటి సమస్యలు గతంలో రైతు భరోసా పథకం అమలులో తలెత్తినవి. అసలు లావాదేవీలు మిస్ డైరెక్ట్ ఐనప్పుడు కనిపెట్టే యంత్రాంగం తమ వద్ద లేదని సాక్షాత్తు గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పుకుంది.

3. ఖాతాల నుండి పైసలు తీసుకోవడంలో సమస్యలు:

దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పైసలు బదిలీ చేయడంతో తమ బాధ్యత తీరిపోయినట్లు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ లబ్ధిదారులు తమ సొమ్ము తీసుకోవడానికి పడుతున్న అగచాట్ల గురించి వారికి పట్టడం లేదు. లబ్ధిదారులు నగదు తీసుకోవడానికి తగినన్ని బ్యాంకులు లేవు. ఈ సమస్యకు విరుగుడుగా బ్యాంకు వ్యవస్థలో తీసుకువచ్చిన బిజినెస్ కరస్పాండెంట్/కస్టమర్ సర్వీస్ పాయింట్ వ్యవస్థలు బ్యాంకు సౌకర్యాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చినా, వ్యవస్థలో సరైన జవాబుదారీతనం లేకపోవడం వలన నిరక్షరాస్యులైన పేదలు మోసాలకు గురిఔతున్నారు. ఇక ఆదివాసీ ప్రాంతాల్లో బ్యాంకుల నుండి డబ్బు తీసుకోవడానికి ఒక తడవకు 200/- నుండి 400/- రూపాయల వరకూ ఖర్చు చేయాల్సివస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఐతే దీని అర్థం బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడం వల్ల అస్సలు ఉపయోగం లేదని కాదు. నగదు తమ ఖాతాలోనే ఉంటుంది కాబట్టి కాస్తో కూస్తో బ్యాంకు కార్యకలాపాలపై అవగాహన ఉన్న పింఛనుదారులు మాత్రం తమకు నచ్చినపుడు, నచ్చిన పద్ధతిలో పింఛన్ తీసుకునే అవకాశం ఈ నమూనా కల్పిస్తుంది.

నగదు చేతికి ఇవ్వడమే మంచిది

పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే పేదలకు బ్యాంకు ఖాతాలకు బదిలీ కంటే నగదు చేతికి ఇవ్వడం మంచిదని అనిపించకమానదు. చేతికి నగదు ఇవ్వడం వలన పైన చర్చించిన సమస్యలు లేకపోవడమే కాక, ప్రజలు ఆత్మగౌరవంతో ప్రయోజనాలు తమ గడప దగ్గరే పొందుతారు.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకులు

లిబ్టెక్ ఇండియా

92465 22344

Tags:    

Similar News