పెండింగ్ బిల్లులకు మోక్షమెప్పుడు..?
రాష్ట్రంలో పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, పిఆర్సీ, హెల్త్ కార్డులు..ఇలా అనేక సమస్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు
రాష్ట్రంలో పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, పిఆర్సీ, హెల్త్ కార్డులు..ఇలా అనేక సమస్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అంతేకాదు కాంట్రాక్టర్లు సైతం వారు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు చూశాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు వస్తున్న బిల్లులకు సొమ్ము విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పలు రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన వాటితో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన డబ్బులు విడుదల కావడం లేదు. ఉద్యోగులు పెట్టుకునే సరెండర్ లీవ్, వైద్య ఖర్చులు, జిపిఎఫ్ రుణాలు, పొదుపు నిధులు తదితర బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అంతేకాదు వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులను కూడా వారి అత్యవసరాలకు పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, ఆపత్కాలంలో వైద్య ఖర్చులకు ఉపయోగపడాల్సిన పొదుపు బిల్లులు కూడా విడుదల కావడం లేదు. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తూ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు, ప్రధానంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డిఏలు, పీఆర్సిని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సి వుంది. ఇదే మెరుగైన ప్రజాపాలనకు ప్రతీకగా నిలుస్తోంది.
ఈ నిబంధన కారణంగా పోగైన బిల్లులు..
గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పెండిం గ్ బిల్లులు రూ. 40 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు శాసనసభకు తెలిపింది. వీటిలో రూ. 10 లక్షల లోపు ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కనీసం రూ. లక్ష కూడా చాలాకాలంగా మంజూరు కావడం లేదని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఒక శాఖ నుంచి బిల్లులకు ఆమోదం తెలిపి తర్వాత "టోకెన్ నెంబర్" ఇచ్చి ఆన్‌లైన్‌లో ఆర్థిక శాఖకు పంపుతున్నారు. అక్కడ వాటిని పరిశీలించి సదరు టోకెన్ల నిధులు విడుదల కోసం ఖజానా శాఖకు అనుమతివ్వాలి. గతంలో ఉద్యోగుల చిన్నపాటి బిల్లుల టోకెన్లకు నేరుగా ఖజానా శాఖనే నిధులు విడుదల చేసేది. గత ప్రభుత్వ కాలం నుంచి నిధుల కొరత వల్ల ప్రతి టోకెన్ సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఉండాలని నిబంధన పెట్టింది. దీంతో లక్షల సంఖ్యల్లో బిల్లులు పోగ య్యాయి. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ నిధులు విడుదల చేయాలని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఆర్థిక శాఖకు వచ్చి విన్నవిస్తున్నారు. వీరికి సమా ధానం చెప్పలేక అక్కడి ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఆదాయం, వ్యయాల మధ్య అంతరం, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది వారి పాలిట శాపంగా మారింది. చిన్న చిన్న బిల్లులు సైతం ఏడాది నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఎందుకింత జాప్యం?
ఆశించిన ఆదాయం రాకనే...
రాష్ట్ర ప్రభుత్వానికి నెలనెలా వస్తున్న ఆదాయంలో తప్పనిసరిగా చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, పాత బకాయిలకు అసలు వడ్డీల చెల్లింపులు, సంక్షేమ పథకాల రాయితీల వంటి వాటికి తొలుత విడుదల చేస్తుంది. ఇంకా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతా క్రమంలో ఇస్తుంది. ఇవన్నీ దాటుకొని పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలంటే నిధుల కొరత ఏర్పడుతుంది. అంచనాలకు తగ్గట్టుగా రావడం లేదు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరం 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో పన్నుల ద్వారా రూ.1.52 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తే, రూ.17 వేల కోట్లు తక్కువగా వచ్చింది. కేంద్రం నుంచి ఆర్థిక సాయం కింద గ్రాంట్లుగా రూ.41.209 కోట్లు వస్తాయని భావిస్తే, అందులో 9.729 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ ఆడిట్‌లో తేలింది. ఈ ఏడాది కూడా ఆదాయం అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ క్రమంలో భారీగా పోగుబడిన పెండింగ్ బిల్లు లను వెంటనే మంజూరు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విష యంపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, గుత్తేదారులు విన్నవించారు. అయినా ఇప్పటివరకు చిన్న చిన్న బిల్లులు విడుదల చేయడం ఆచరణలో అమలవడం లేదు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి!
ఉద్యోగుల జిపిఎఫ్, టిఎస్జిఎల్ఐ, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్ వేతనాలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండి నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో నెల గడిచి 15 రోజులైనా కూడా జీతాలు అందక ఉద్యోగులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. సర్పంచులు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలాంటి స్థితి నుండి నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగులకు అటు గుత్తేదారులకు ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, 5 డిఏలను విడుదల చేస్తారని ఎంతో ఆశతో చూస్తున్నారు. నూతన ప్రభుత్వానికి ఇన్నాళ్లుగా విన్నపాలు ఇచ్చి ఇచ్చి నిరాశకు లోనై.. ఈనెల 30 లోపు పెండింగ్ సమస్యలు, బిల్లులపై స్పష్టత రాకుంటే ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని రాష్ట్ర సర్పంచ్, కాంట్రాక్టర్లు కూడా హెచ్చరించడం జరిగింది. నూతన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావించారు. కానీ నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయులు పొదుపు చేసుకున్న బడ్జెట్ కూడా విడుదల చేయకపోవడం అమానవీయం కాదా? ఇప్పటికైనా పాలనలో మానవీయతను చాటి జరిగిన ఆల స్యాన్ని పూడ్చుకోవడానికైనా వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తూ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రధానంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డిఏలు, పీఆర్సీని ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సి వుంది. ఇదే మెరుగైన ప్రజాపాలనకు ప్రతీకగా నిలుస్తుంది.
మేకిరి దామోదర్
95736 66650