ఈ విధానం మారెదేన్నడు?
భారతదేశంలో ఆనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం వలన దళితులు వివక్షకు గురైనారు.


భారతదేశంలో ఆనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం వలన దళితులు వివక్షకు గురైనారు. అనాగరికమైన, హీనమైన పనులకు పరిమితమైనారు. ఇప్పటికీ ఈ జాతుల్లో కొందరు హీన మైన పనుల్లోనే మగ్గుతున్నారు. నేటికీ దళితులకు పట్ట ణాల్లో ఇల్లు అద్దెకు ఇవ్వడం నిరాకరిస్తున్నారు. చేతితో మలం ఎత్తే పనులపై (Manual Scavenging) 10 ఏళ్ల క్రితమే నిషేధం విధించినప్పటికీ నేటికీ ఈ పనులను చాలామంది చేస్తూనే ఉన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే నేపథ్యంలో ప్రతీయేటా చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం పారిశుధ్య కార్మిక వృత్తిలో 68.9 శాతం దళితులు కొనసాగుతున్నారు. అంతేకాకుండా 2019 నుంచి 2023 మధ్య కాలంలో మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో కనీసం 377 మరణించడం ఆందోళనకరం.
చట్టం ఉల్లంఘన...
2013లో చేతులతో మలాన్ని ఎత్తే పనులపై ఎంప్లాయిమెంట్ ప్రొహిబిషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్టును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్ట ప్రకారం 'చేతులతో మురికిని తీసి, శుభ్రం చేయడం, బహిరంగ కాలువలు లేదా గుంతలను శుభ్రం చేయడం, మానవ విసర్జనను సేకరించడం నిషేధం. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో చేతితో మురుగుకాల్వలను శుభ్రం చేయడంపై నిషేధం విధిస్తూ గత నెల 29న జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమ నగరాల్లో మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిలిపివేశామంటూ కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ యంత్రాంగాలు ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిజంగా నిలిపివేస్తే.. ఆయా నగరాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ.. కొందరు ప్రాణాలు ఎలా కోల్పోయారని ప్రశ్నించింది. అలాగే జైల్లో కూడా కుల వివక్ష కొనసాగుతోందని షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగిస్తున్నారని అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుందని పేర్కొన్నది. ఇలాంటి చర్యలు అంటరానితనం కిందకే వస్తాయని కావున జైల్లో ఈ నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
సాంకేతికతను వాడాలి!
దేశంలోమాన్యువల్ స్కావెంజింగ్‌ను పరిష్కరించడంలో సాంకేతికత పాత్ర కీలకం. మానవసహితంగా వ్యర్ధాలను శుభ్రం చేయడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నమస్తే పథకం(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) తీసుకొచ్చారు. ఈ పథకం కింద వ్యర్ధాలను, మురుగును తొలగించడానికి మనుషుల పాత్రను తగ్గించి సాంకేతికతను వాడనున్నారు. నమస్తే పథకం, నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC) సహకారంతో, జెన్ రోబోటిక్స్ ఇప్పటివరకు 3,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చింది. 1,000 మందికి పైగా కార్మికులను రోబోట్ ఆపరేటర్లుగా మార్చింది. అదనంగా, ఈ బృందం దేశమంతటా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తూ కార్మికులకు మాన్యువల్ స్కావెంజింగ్ ప్రమాదాలు, రోబోటిక్స్ ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తుంది. పారిశుద్ధ్య పనులలో నిమగ్నమైన దళితుల సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికి గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు రక్షణ లేదు. కావున వారికి సామాజిక భద్రత కల్పించాలి. గౌరవప్రదమైన వేతనం, పెన్షన్ సదుపాయం కల్పించాలి. అప్పుడే వారు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428