సార్ల కష్టాలు తీరేదెపుడు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కువగా ఉద్యమాలలో పాలుపంచుకుంది ఉపాధ్యాయులే. దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో వారు ఎదుర్కొన్న కష్టాలు. స్వరాష్ట్రంలో ఆ కష్టాలు తీరుతాయనే ఆశతో తమ ఉద్యోగాన్ని కూడా లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయులు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కువగా ఉద్యమాలలో పాలుపంచుకుంది ఉపాధ్యాయులే. దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో వారు ఎదుర్కొన్న కష్టాలు. స్వరాష్ట్రంలో ఆ కష్టాలు తీరుతాయనే ఆశతో తమ ఉద్యోగాన్ని కూడా లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయులు. కానీ, స్వరాష్ట్రం సాధించాక కూడా వారికి తిప్పలు తప్పడం లేదు. కొత్త జిల్లాలు, జోన్ల విభజన పేరుతో ఏళ్లకు ఏళ్లు పదోన్నతులను ఆపేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వాటికి దారులు తెరిచింది. తీరా ఆమోదం లభించాక మాత్రం కొన్ని జీఓలు వారికి తీరని శాపంగా పరిణమించాయి. ప్రభుత్వ పాఠశాలలలో పర్యవేక్షణాధికారుల పోస్టులు వందలాదిగా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యా విభాగం కునారిల్లింది.
కరోనా కారణంగా మరింత కుదేలు అయింది. పీఆర్సీ పేరిట కాలయాపన, నెల నెల జీతాల ఆలస్యంతో ఉపాధ్యాయ లోకం మొత్తం నిస్తేజంగా, నిరుత్సాహంగా ఉంది. ఇప్పటికే బదిలీ పేరుతో తెచ్చిన జీఓ 317 ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులు జూనియర్ అయి పరాయిలు కాగా, భార్యభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వారితో పాటు వితంతువులు, ఇంకా కొన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. 13 జిల్లాలను బ్లాక్ చేసి ఇచ్చిన స్పౌజ్ రిపేర్‌లో న్యాయం అందరికీ అందలేదు. రోస్టర్ ఇష్టారాజ్యంగా పంపిణీ కావడంతో ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు తీరని నష్టం వాటిల్లింది. ఇందులో ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన సంఘాలు తూతూ మంత్రంగా రూల్స్ తయారు చేయించి ప్రభుత్వానికి చేయూతనిస్తున్నాయి.
కొందరి స్వార్థం కోసం
317 జీఓ ద్వారా బదిలీ అయినా భార్యభర్తలకు వర్తించని కొత్త సర్వీస్ ప్రొటెక్షన్ సాకు ఇప్పుడు పరస్పర బదిలీలకు చుట్టుకొని వ్యవస్థను చట్టు బండలా తయారు చేసింది. బదీలలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి ఇప్పటికైనా పదోన్నతులకు నోచుకుంటామని ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ లోకానికి కోర్టు పెద్ద దెబ్బ కొట్టింది. ఆనాడు జీఓ సవరణకు మేం కారణమంటే మేం కారణం అని చెప్పుకున్న సంఘాలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా చోద్యం చూస్తున్నాయి. 'మా జిల్లాకు సీనియర్ వస్తే మా పదోన్నతి పోతుంది, అవకాశం పోతుందని' కేసు వేసిన సార్లు ఉమ్మడి జిల్లాగా ఉంటే ఎక్కడ ఉండేవారం అనే సోయి లేకుండా మొత్తం పక్రియకు విఘాతం కలిగించారు.
కోర్టు కేసులు ఎలా ఉంటాయో మనకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కేసు తెలియపరుస్తూనే ఉన్నా కేవలం కొంత మంది ప్రయోజనం కోసం కేసులు వేసి బదీలీలు, పదోన్నతులు ఆపుకోవడం స్వయంకృతాపరాధమే అవుతుంది. అటు ప్రభుత్వం పకడ్బందీగా ఉత్తర్వులు ఇవ్వకుండా, ఏదో ఒక లోటుతో జీఓలు ఇస్తూ వ్యవస్థను ఇంకా భ్రష్టు పట్టిస్తున్నది. వీటి మీద పెద్దవని చెప్పుకునే సంఘాలు మాట కూడా మాట్లాడడం లేదు. కలిసి పోరాడే తత్వం సంఘాలకు లేదు. అన్నింటికి సీఎం నిర్ణయం అనే తీరుతో దేబురిస్తున్నారు. కొందరు త్యాగం చేస్తేనే ఫలాలు అందరికీ అందుతాయి. అన్ని సంఘాలు కూర్చొని ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి సమస్యలను పరిష్కరించాలి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులకు మోక్షం కలిగేలా చూడాలి. నిధుల లేమిని నివారించాలి. ఆంగ్ల మాధ్యమం రాబోతున్న తరుణంలో ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉంది.
శనిగరపు రవి
ప్రధాన కార్యదర్శి
ఎస్‌టీయూ, కరీంనగర్
99488 39437