సామాజికం:ఎస్టీ రిజర్వేషన్లకు అడ్డేమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించిందని
ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్ల పెంపుదల అంశం రాష్ట్ర పరిధిలోనిదే. 50 శాతానికి మించకూడదనేది రాజ్యాంగ పరిమితి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వర్తించవు. గిరిజన జనాభాకనుగుణంగా రిజర్వేషన్ల పెంపుదల అంశంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఇంద్ర సహానీ కేసులో ఉన్న 50 శాతం నిబంధన వెనుకబడిన తరగతులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా ఇస్తున్న బీసీ-ఇ రిజర్వేషన్లకు అనుమతి అవసరం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చిందా? అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు.
తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి విశ్వేశ్వర్ తుడు సమాధానం చెప్పడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి మరోసారి స్పష్టం అయింది. గత ఏడున్నర సంవత్సరాలుగా దాదాపు 30 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. అన్ని సమావేశాలలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఒక్కసారి కూడా గిరిజన రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు.
ప్రభుత్వ నియామకాలలో నష్టం
గిరిజనులకు రాజ్యాంగం ప్రకారం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలంటూనే ప్రతీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడుగుతున్నది. గిరిజనులు విద్యాసంస్థలలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్‌లకు అర్హులు. ఎలాంటి అడ్డంకులు లేకుండా గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన పది శాతం రిజర్వేషన్లు వారికి దక్కకుండా, లేనిపోని సాకులతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడున్నర సంవత్సరాలు నాన్చుతున్నది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో 32 గిరిజన తెగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.
రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో వారికి రిజర్వు కావలసిన 9,114 ఉద్యోగాలకు బదులు 5,468 మాత్రమే దక్కే అవకాశం వుంది. 3,646 ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ప్రభుత్వం భర్తీ చేసిన 1,35,000 ఉద్యోగాలలో పది శాతం దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందక 5,400 ఉద్యోగాలను నష్టపోయారు. విద్యా కోర్సులలో అనేక సీట్లను కూడా కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిలో రాబోయే నియామకాలలోనైనా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే మరింత అన్యాయం జరుగుతుంది.
ఒకే తీర్మానంగా పంపడంతో
ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్ల పెంపుదల అంశం రాష్ట్ర పరిధిలోనిదే. 50 శాతానికి మించకూడదనేది రాజ్యాంగ పరిమితి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వర్తించవు. గిరిజన జనాభాకనుగుణంగా రిజర్వేషన్ల పెంపుదల అంశంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఇంద్ర సహానీ కేసులో ఉన్న 50 శాతం నిబంధన వెనుకబడిన తరగతులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా ఇస్తున్న బీసీ-ఇ రిజర్వేషన్లకు అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా గిరిజన రిజర్వేషన్లను బీసీ-ఇ రిజర్వేషన్లతో ముడిపెట్టి ఒకే తీర్మానంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఇదే ఈ సమస్య జటిలం కావడానికి కారణభూతమైంది. ఎందుకంటే, నాలుగు శాతం ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్లను 2005లోనే హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ సమీక్ష బెంచ్ ముందు ఇది పెండింగులో ఉంది. తుది తీర్పు వెలువడే వరకు దీనిని పరిశీలించడం కుదరదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. తెలంగాణలో ఎస్‌టీలకు 9.08 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే Executive Order లేదా Ordinance జారీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేస్తున్న తరుణంలో రిజర్వేషన్లను పెంచకుంటే గిరిజనులకు అన్యాయం కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వం బీసీ-ఇ, గిరిజన రిజర్వేషన్ తీర్మానాలను వేరువేరుగా పెట్టాలి.
గుగులోతు వెంకన్న నాయక్
జాతీయ అధ్యక్షులు, అఖిల భారత గిరిజన సమాఖ్య
95735 55700