జననాడి: పవన్‌ అడుగులు పడేదెటో?

జననాడి: పవన్‌ అడుగులు పడేదెటో?.... what is the political planning of Janasena Pawan Kalyan in Andhra Pradesh and Telangana

Update: 2023-02-20 19:15 GMT

తెలుగునాట ఎన్నికల గడువు సమీపిస్తుంటే.... జనసేనానిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనుసరించబోయే పంథా రాజకీయ సమీకరణాలపై చూపే ప్రభావం దృష్ట్యా రాజకీయ, రాజకీయేతర ఒత్తిళ్లు అధికమౌతున్నాయి. ఒంటరిపోరుకు సిద్దంగా లేని పవన్‌ కల్యాణ్‌ బీజేపీతోనే వెళతారా తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుంటారా అన్నది ఒక చర్చ అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఆరంగేట్రం చేయాలనుకుంటున్న భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అక్కడ పొత్తులతో పోటీకి పవన్‌ని మచ్చిక చేసుకుంటున్నారా అన్నది మరో చర్చ! 'ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ సారి చీలనివ్వను' అన్న పవన్‌ మాటల ఆధారంగా పలు ఎత్తులు, విలక్షణమైన పొత్తులు తెలుగునాట తరచూ చర్చకు వస్తున్నాయి. ఇదివరకటిలా తొందరపాటు చర్యలకు వెళ్లకుండా, ఆచితూచి అడుగేయాలనే యోచనలో ఉన్నందున... ఓ పట్టాన ఏదీ తేల్చక సరైన సమయం కోసం పవన్‌ నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఏపీలో ఎన్నికలకు పదిహేను మాసాల గడువుంది. 175లో 151 గెలిచి, సర్కారు నడిపిస్తున్న పాలక వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈసారి 'వైనాట్‌ 175' అంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తుంటే, 'ప్రజలు మార్పు కోరుతున్నారు, ఈ సారి మా ప్రభుత్వం ఖాయం'అని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తొడగొడుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు నామమాత్రంగా ఉన్న ఏపీలో జనసేన వైఖరేంటి? రాష్ట్రంలో ముక్కోణపు పోటీనా? దాన్ని పరిహరించి ముఖాముఖి పోటీని జనసేన రచిస్తుందా... ఇవీ ప్రశ్నలు! కాలం మహాదొడ్డది, ఈ లోపు... ఏమైనా జరగొచ్చు! అన్నది పరిశీలకుల మాట!

రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం తామే పొందాలని ఏపీలో ఆయా పార్టీల వాళ్లు ఎవరికి వారు 'మైండ్‌గేమ్‌' ఆడుతున్నారు. కాంగ్రెస్‌ ఒక శక్తిగా లేనందున, ఇతర విపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేయాలని పాలకపక్షమైన వైసీపీ కోరుకుంటోంది. ముఖ్యంగా జనసేన-టీడీపీ పొత్తు కుదరొద్దనేది వారి అభిలాష. ఆ ఇద్దరు కలిస్తే రాష్ట్రంలో ఇక ముఖాముఖి పోటీలు తప్పవని, అలా కాక జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే జరిగే ముక్కోణపు పోటీ తనకు మేలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటంటూ ఉంటే, గింటే అది చీలిపోతుందన్నది వారి ఆశ. ఆ దిశలో జనసేనను రెచ్చగొడుతోంది. అధికారపక్షమైన వైసీపీ తమతో సఖ్యంగా ఉన్నందున, బీజేపీ ఏపీలో ప్రభుత్వ మార్పును కోరుకోవడమో, అంచనా వేయడమో చేయట్లేదు. వీలయితే సంస్థాగతంగా తామే వృద్ది చెందాలని కోరుకుంటోంది.

అందుకే, తనకు మిత్రపక్షంగా ఉన్న జనసేనను తనతోనే ఉండమని, తెలుగుదేశం వైపు వెళ్లద్దని నయానా, భయానా చెప్పి చూస్తోంది. ఇదీ జనసేనపై ఓ రకమైన ఒత్తిడే! ఈ సారి ఎన్నికల్లోనూ ఓడి, తెలుగుదేశం రాజకీయంగా పతనమైతే ఆ శూన్యతలోకి విస్తరించేది తామే అనే ఓ బలమైన భావన బీజేపీకి ఉన్నట్టు నాయకుల మాటల్ని బట్టి తెలుస్తోంది. మరో ప్రాంతీయ పార్టీగా ఆ అవకాశం తమకుంటుందని జనసేన తలపోస్తోంది. పెద్దగా ఉనికే లేని ఏపీ బీజేపీలోనూ రాజకీయ వైఖరి పరమైన విభేదాలున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్‌ నాయకుడు పార్టీని వీడి వెళుతూ, బీజేపీ రాష్ట్రనేత సోము వీర్రాజుపై నిశిత విమర్శలు చేశారు. ఒకరకంగా బీజేపీలో ఇది జగన్‌ అనుకూల, ప్రతికూల వాదుల పంచాయితీ వంటిదే!

వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా...

తెలుగుదేశంతో జనసేన పొత్తుపెట్టుకొని బరిలోకి దిగితే వైసీపీకి గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం ఏపీలో బలంగా సాగుతోంది. వారు దాదాపు కలిసి పనిచేసే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కూడా అదే కోరుకుంటున్నట్టు ఇటీవలి వారి కదలికలు, మాటలు, స్పందనల్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వారు రెండు కీలక సందర్భాల్లో భేటీ అయి చర్చించారు. ఇద్దరు నాయకులకు సర్కారు వేర్వేరు సందర్భాల్లో కల్పించిన అడ్డంకుల్ని నిరసిస్తూ, పరస్పరం మద్దతుగా ఒకసారి చంద్రబాబు పవన్‌వద్దకు వెళ్లి కలిస్తే, మరో మారు పవన్‌ చంద్రబాబు వద్దకు వెళ్లి కలిశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సభకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న సందర్బాన్ని పురస్కరించుకొని, తాజాగా పవన్‌ కల్యాణ్‌ బాబుకు మద్దతుగా మాట్లాడారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని, 'సందట్లో సడేమియా..' అన్నట్టు కొందరు బాబు అనుకూల సమీకరణాల కోసం వ్యూహ రచనతో గొంతెత్తుతున్నారు.

రాజకీయ, సామాజిక పరిణామం ఏదైనా... నూజివీడు నుంచి న్యూయార్క్‌ వరకు ఒకే మాట, ఒకే బాటన స్పందించే ఓ సామాజిక వర్గప్రయోజనాలే లక్ష్యంగా కొంతమంది ఈ పొత్తు ఏకపక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీడియా సంస్థలతో సహా వివిధ విభాగాలు, రంగాల్లో తిష్టవేసిన వర్గపెద్దలు, ఇదే విషయాన్ని అటు టీడీపీ నాయక శ్రేణులకు నూరిపోయడమే కాకుండా ప్రజాక్షేత్రంలో సదరు భావనలు నాటే యత్నం చేస్తున్నారు. పొత్తు కుదరాలని, జనసేన మైనర్‌ పార్టనర్‌గానే ఉండాలని, ముఖ్యమంత్రి సీటు బేషరతుగా చంద్రబాబుకు అప్పగించాలని, మంత్రివర్గ భాగస్వామ్యం విషయంలోనూ.. ఇచ్చింది తీసుకోవాలి తప్ప పెద్దగా పేచీలు పెట్టొద్దని.... ఇలాంటివి కొన్ని మదిలో ఉన్నట్టు వారి మాటలు, ప్రస్తావనల్ని బట్టి తెలుస్తోంది. 'వాడుకొని వదిలించుకో..' పంథానే అనుసరించేలా కుదిరే ఒప్పందం కోసం సదరు వర్గ పెద్దలు కొందరు యత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌కూ ఓ ఎజెండా!

తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ స్థాయి రాజకీయ విస్తరణ కోసం బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ మరో తెలుగురాష్ట్రమైన ఏపీలో బోణీ కొట్టాలని చూస్తున్నారు. తీరని చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవి కాపులకు దక్కాలంటే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, తనతో చేతులు కలిపితే అది సాధ్యమయ్యే 'వ్యూహం' ఉందని పవన్‌ కల్యాణ్‌పై బీఆర్‌ఎస్‌ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 30 నుంచి 40 స్థానాలు గెలిచినా.... వ్యూహాత్మకంగా సీఎం సీటు దక్కించుకోవచ్చన్న సూచన చేస్తున్నట్టు చెబుతున్నారు. తమ వైపు నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలుంటాయని నేరుగా సంకేతాలివ్వడమే కాకుండా ఆ మాట ఇతరత్రా కొందరి వద్దా వ్యక్తం చేసినట్టు జనసైనికుల్లో ఓ ప్రచారం ఉంది. అసెంబ్లీ స్థానాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా జనసేనకు సహకరించి, పొత్తుల్లో ఒకటో, రెండో పార్లమెంటు స్థానాలతో పొరుగు రాష్ట్రంలో బోణీ కొట్టచ్చన్నది కేసీఆర్‌ వ్యూహంగా పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ఏ వైఖరి అనుసరిస్తారన్నది వేచి చూడాల్సిందే! ఎందుకంటే, ఇటీవల కొండగట్టులో 'వారాహి' పూజ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలోనూ కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. నిజానికి తెలంగాణలో జనసేనకే కాకుండా టీడీపీకి కూడా పెద్దగా మద్దతు, వ్యవస్థ లేదు.

నింద తొలగి... నిలకడ లభిస్తేనే!

'కాపులు పవన్‌ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే, వారి సహాయంతో ఆయన చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు' అన్నది ఏపీలో సగటు రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య! పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కారు, పొత్తులతో ఆధిక్య సీట్లు లభించినా సీఎం అయ్యేది చంద్రబాబే అని ముందే కరాకండిగా చెబితే, కాపు సామాజికవర్గపు ఓట్లు కూడా ఈ కూటమికి రావు అని కొందరు సీనియర్‌ నాయకులు విశ్లేషణ. ఈ అభిప్రాయాన్నే సీనియర్‌ నేత చేగొండి హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌కు వెల్లడించారు. కేంద్ర రాజకీయాలకు బాబు పరిమితం కావాలని, పవన్‌ కల్యాణ్‌ సీఎంగా, లోకేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఓ అంగీకారం కుదుర్చుకొని ప్రజాసమక్షంలో సంతకాలతో వెల్లడిస్తే కాపులు మాత్రమే కాక పెద్ద ఎత్తున ప్రజామద్దతు ఖాయమనీ ఆయన సూచించినట్టు పార్టీ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఆయన మరో ప్రత్యామ్నాయాన్నీ సూచించారంటారు.

ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తాను అని బాబు ప్రతిజ్ఞ చేసినందున, తగిన నంబర్లు రాగానే... మొదటి ఏడాది బాబు సీఎం, పవన్‌ డిప్యూటీగా ఉండి తర్వాతి నాలుగేళ్లు పవన్‌ సీఎంగా, లోకేశ్‌ డిప్యూటీగా ఉండేట్టు ప్రజాసమక్షంలో ఉమ్మడి అంగీకారం కుదుర్చుకోవాలి. అప్పుడు.. టీడీపీ సంప్రదాయ ఓటు, పవన్‌ అభిమానులు, కాపు సామాజికవర్గం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు... గంపగుత్తగా కూటమికి పడి గొప్ప విజయం ఖాయమనేది ఈ సూత్రీకరణ! ఇవన్నీ సాధ్యపడాలంటే, ఆపద్దర్మ దర్శనాలు వీడి ముందు జనసేనాని నిలకడైన రాజకీయాలు చేయాలనే సూచన వస్తోంది. వారన్నట్టుగా 'గౌరవప్రదమైన పొత్తు'కు నిలబడాలి తప్ప, 'తెలుగుదేశానికి మేలు చేసేందుకే జనసేన పుట్టింది' అన్నది కేవలం నింద అయితే, అది నిందగానే తేలిపోయేట్టుగా జనసేన నడచుకోవాలని జనసైనికులు, మద్దతుదారులు కోరుతున్నారు.

స్పష్టత పెంచుకుంటున్న పవన్‌

జనసేన గమనం ఎటు అన్న ప్రశ్న తరచూ తెరపైకి వస్తున్నా సేనాని పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఈసారి స్పష్టతతోనే ఉన్నట్టు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. రణస్థలం 'యువశక్తి' సభలో గాని, గణతంత్య్ర దినోత్సవాన మంగళగిరిలో పార్టీ శ్రేణులతో మాట్లాడినప్పుడు గాని ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. తగిన ప్రజామద్దతు లేకుండా ఒంటరి పోరుకు వెళ్లి, ఆత్మహత్యా సదృశమైన పనికి సిద్ధంగా లేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా నడచి, వైసీపీకి మేలు కలిగించే పని చేయబోననీ స్పష్టం చేశారు. తప్పుచేయడానికి సిద్ధంగా లేనంటున్న ఆయన... సభ్యత్వాలతో పార్టీని బలోపేతం చేసే పనికీ శ్రీకారం చూట్టారు. తనకు తానుగా కాకుండా, బీజేపీతో సఖ్యతో ఎడబాటో వారి వైఖరిని బట్టే ఉండాలనీ ఆయన నిరీక్షిస్తున్నట్టుంది. పొత్తులతోనే ఇక ఆయన ఎత్తులు బయటపడేది!

ఆర్‌.దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

Mail dileepreddy.ic@gmail.com 

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News