మీ ప్రయాణమే మాకు ఆదర్శం!

కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికీ

Update: 2024-08-09 01:15 GMT

"కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా." అంటూ నిన్న ఉదయాన్నే వినేశ్ ఫొగాట్ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ సందేశం చూసి బరువెక్కిన హృదయంతో బాధ పడుతున్న యావత్ భారతం మరింత భావోద్వేగ సాగరంలో మునిగిపోయింది.

"వినేశ్... మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తుంది. మీరంటే మాకు ఎనలేని గౌరవం. ఏమైనా జరగనీ.. మీకు మేము తోడుంటాం. మీ స్ఫూర్తితో మా జీవిత పోరాటంలో గెలుపోటములకు అతీతంగా ముందడుగే వేస్తాం. మాకు మీ ఫలితాల పతకాల కంటే మీ ప్రయాణపు ప్రకాశం ఆదర్శం." రేపటి నుంచి మీ జీవిత కథ కూడా గెలుపోటములకు అతీతంగా కొన్ని లక్షల మంది "జీవిత ఆటకు, వేటకు"బ్రతుకు బాటై ప్రేరణ ఇస్తుంది. పోరాటానికి మీరు పాట అయ్యారు. భవిష్యత్ భారతానికి పాఠమయ్యారు.

వినేశ్ ఫొగట్... మీకు వినిపిస్తుందా..?

మన దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతలతో మొదలు విభిన్న రంగాల్లోని ప్రముఖులు, సగటు భారతీయులు సహా అందరూ... ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం మొత్తం మీ క్రీడా ప్రతిభా పోరాట స్ఫూర్తిని కీర్తిస్తుంది. మీరు మాకు కోహి నూర్ వజ్రం. విధి మీపై ఇన్ని కత్తులు దూస్తేనేమి? కాలం మరీ ఇంత కఠినంగా మీపై ఇలా వ్య వహరించడమెంటి? రెండు దశాబ్దాల మీ పట్టుదల ప్రకాశం ముందు ఒలింపిక్ పతక ప్రభావం మాకు చాలా చిన్నది. ఈ దేశంలో రెజ్లింగ్ క్రీడలో న్యాయం కోసం నడిరోడ్డుపై, ఈ దేశాన్ని గెలిపించడం కోసం విశ్వ క్రీడా సమరంలో మైదానంపై రెండింటిలో మీ పోరాటం చూసాం. మంగళ వారమే మీ ఆటకు సెల్యూట్ చేసి మా హృదయ సామ్రాజ్యాలలో మిమ్మల్ని రాజును చేశాం. మా అందరికీ సూపర్ హీరో మీరు. వంద గ్రాముల అనర్హత గురించి మాకెందుకు. ఒలింపిక్స్ రూల్స్ ఏమి చెబితే మాకెందుకు? తొలి మ్యాచ్‌లోనే విశ్వ విజేతపై మీరు గెలిచాక పతకాలు, కొన్ని కుతంత్రాల పథకాల గోలలు మాకెందుకు? "మీ కన్నీటి మంటల సెగలకు ఓటమి భయపడి ఏనాడో పారిపోయింది. మిమ్మల్ని ఓడించలేకే ఆటలో ఆడనీయకుండా వంద గ్రాముల అనర్హత పేరు చెబుతుంది..!"

అన్యాయాలపై కుస్తీ పోరాటం..

విభిన్న భాషలు, విభిన్న సిద్ధాంతాలు, విభిన్న రాజకీయ పార్టీలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఒలింపిక్స్ పోటీల్లో కనీసం డబుల్ డిజిట్ పతకాలు సాధించడానికి ఎంతో శ్రమిస్తున్నాం. ఇలాంటి మనదేశం తరఫున ఒక (అ)సాధారణ అమ్మాయి సాధారణంగా పురుషు లు ఆడే ఆట రెజ్లింగ్ తరపున దేశంలోని ఎన్నో అంతర్గత సమస్యలైన అసమానతలు, వివక్షలు, అన్యాయాలపై అలుపెరగని కుస్తీ పోరాటం చేస్తూ ఎన్నో విమర్శలు, ఎన్నో అవాంతరాలు అధిగమిస్తూ, ఎన్నో అనూహ్య రాజకీయ నాటకీయ పరిణామాలకు ప్రతిఘటిస్తూ, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ, మూడు సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడం అంటేనే ఓ అసాధారణ అద్భుత విజయం. టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో ఓడిన, 2016 ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో తీవ్రగాయాలతో నిలబడలేని స్థితిలో దేశానికి తిరిగొచ్చిన దృశ్యాలు ఎన్నో మాకింకా గుర్తే వున్నాయి. ఈ ఒలిం పిక్స్‌లో మన దేశాన్ని గెలిపించడం కోసం సాధారణంగా 57 కేజీలు ఉండే మీరు 50 కేజీల విభాగంలో పోటీ కోసం ఎంత కష్టపడ్డారో మంగళవారం మీ ఆట చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ ఒలింపిక్స్‌లో అడుగేసి తొలి మ్యాచ్‌లోనే ఓటమే ఎరుగని ఒక ఒలింపిక్ చాంపియన్‌పై గెలవడమంటే ఎంత శారీరక, మానసిక ధృడత్వం, సంసిద్ధత, మన దేశం పట్ల ఎంత అంకితభావం ఉండాలి? మీ శ్రమ ఎప్పటికీ వృథా కాదు. కాలం చేసే మాయాజాలంలో ఏమైనా జరగొచ్చు. మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం.

ఏమైనా జరగనీ..మీకు తోడుంటాం!

"వినేశ్.. నీవు ఛాంపియన్లకే ఛాంపియన్‌వి. దేశానికి గర్వకారణం నువ్వు. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి నీవు. ఈరోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో. మేమం దరం నీకు అండగా వున్నాం." ఇది ఒక్క ప్రధాని మాటే కాదు. ప్రతి భారతీయుడి హృదయ స్పందన. నిరాశ, నిస్పృహలను అనంత విశ్వం లోకి విసిరేయగల మీ శక్తి, సామర్థ్యాల సాక్షిగా ఇప్పుడు ఈ దేశం చెబుతుంది. "వినేశ్... మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తుంది. మీరంటే మాకు ఎనలేని గౌరవం. ఏమైనా జరగనీ.. మీకు మేము తోడుంటాం. మీ స్ఫూర్తితో మా జీవిత పోరాటంలో గెలుపోటములకు అతీతంగా ముందడుగే వేస్తాం. మాకు మీ ఫలితాల పతకాల కంటే మీ ప్రయాణపు ప్రకాశం ఆదర్శం."

ఫిజిక్స్ అరుణ్ కుమార్

కవి, రచయిత

93947 49536

Tags:    

Similar News