అకాల వర్షం.. అన్నదాతలను ఆదుకోండి
ప్రకృతి కన్నెర్ర చేసినా, పాలకులు ఉదాసీనత ప్రదర్శించినా నేల తల్లిని, శ్రమను నమ్ముకొని అన్నదాతలు కుటుంబ సమేతంగా రాత్రింబవళ్లు ఆరుగాలం కష్టపడి పంట పండించి భారత జాతికి పట్టెడు అన్నం పెడుతున్నారు.
ప్రకృతి కన్నెర్ర చేసినా, పాలకులు ఉదాసీనత ప్రదర్శించినా నేల తల్లిని, శ్రమను నమ్ముకొని అన్నదాతలు కుటుంబ సమేతంగా రాత్రింబవళ్లు ఆరుగాలం కష్టపడి పంట పండించి భారత జాతికి పట్టెడు అన్నం పెడుతున్నారు. నేడు పంట చేతికి వచ్చే వేళ.. అకాల వర్షాలు, వడగండ్ల బీభత్సం మూలంగా రెక్కల కష్టం కళ్ళముందే చూస్తుండగానే కొట్టుకుపోతుందని కన్నీరు మున్నీరై రోదిస్తున్నారు. ఇలా రైతుల పరిస్థితి హృదయవిదారకంగా మారడంతో వీరు దయనీయ స్థితిని అనుభవిస్తున్నారు. దీనికి తోడు గత మార్చి నెలలో 16 నుంచి 21వ తేదీ వరకు వడగళ్ల వానలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఆ వేళ ఆయా జిల్లాల్లో మన ముఖ్యమంత్రి పర్యటించి, ఎకరానికి పదివేల రూపాయల సాయం ప్రకటించారు. వారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నాడు 1,30,968 మంది రైతులు,1,51,645 ఎకరాల విస్తీర్ణంలో పంటను కోల్పోయినట్లు నివేదించారు. రూ.151 కోట్ల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సాయం బాధితులకు పంపిణీ చేయక ముందే, మళ్లీ భారీగా వడగళ్లు బీభత్సం సృష్టించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇలా అకాల వర్షాలు వరుసగా కురుస్తూ ప్రకృతి సృష్టించే బీభత్సం అన్నదాతల బతుకులపై దెబ్బ మీద దెబ్బ తీయడంతో మూలిగే నక్కపై తాటి పండులా ఏ ఏడాదికి ఆ ఏడాది దుర్భరంగా మారడం బాధాకరం. ఈ బీభత్సం వల్ల విరిగిన చెట్ల వలన దారి పొడవునా ఇబ్బందులు, విద్యుత్ స్తంభాలు విరిగి పడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాదు భారీ వర్షం వలన కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో అరకొర వసతుల మూలంగా నీటి ప్రవాహంలో పండించిన ధాన్యం కొట్టుకపోయింది. పిడుగులు పడటంతో మనుషులు, పశువులు చనిపోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో విడవకుండా నాలుగు రోజులు ఊహించని రీతిలో అకాల భారీ వర్షాల విపత్తు నుండి రైతుల పంట ఉత్పత్తులకు రక్షణ కల్పించడం కష్టంగా మారింది. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో సుమారు 2,36,184 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. అందులో అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి పైర్లకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ అకాల వడగళ్ల వరుస వర్ష బీభత్సంతో దెబ్బతిన్న పంటలు.. వరి, మిరప, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పెసలు, జొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, నిమ్మ, బొప్పాయి తదితర పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. ఇదే క్రమంలో పంట నష్టం అత్యధికంగా జరిగిన జిల్లాల వివరాలు.. జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, హనుమకొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అత్యధికంగా, మిగతా జిల్లాల్లో కూడా ఇదే మేర పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ప్రాథమికంగా తేలడంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ యాసంగి సీజన్‌లోనే అకాల వర్షాలతో రైతులు పంట నష్టం పోవడం రెండోసారి కావడంతో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం అందించాలి. కమిటీలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలి. పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలి.
ఈ నష్టపరిహారం చెల్లింపుతో అన్నదాతల కష్టానికి, నష్టానికి పూర్తిస్థాయి లబ్ధి చేకూర్చనప్పటికీ, వారికి కష్టకాలంలో కొంతమేరకు అండగా మేమున్నామనే ధైర్యం ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వాలు భావించాలి. రైతులు నష్టపోయారు అంటే ఆ ప్రభావం అన్ని వ్యవస్థలపై, అన్ని వర్గాలపై పడుతుందనేది కాదనలేని నిజం. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రతి ఏటా ఇలా అన్నదాతలు శ్రమకోర్చి పండించిన పంటను అకాల వర్షాలు నట్టేట ముంచడంతో అప్పులు తీర్చుకోలేక, ఆర్థిక భారం మోయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ రైతు ఆత్మహత్యలను ఇన్నాళ్ళ స్వాతంత్ర్య పాలనలో కూడా ఆపలేమా! దీనికి పాలకుల విధానాల లోపం లేదా! ఏది ఏమైనా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యలతో వీరిని ఆదుకోవాల్సిన విధానాలను ప్రభుత్వాలు మెరుగు పరుచుకోవాలి. వారికి భరోసా కల్పించాలి. ఇలా ప్రకృతి విపత్తుల నుండి అన్నదాతలను ఆదుకోవడానికి ఉద్దేశించిన పంటల బీమా పథకం ఏ దశలోనూ రైతాంగానికి బీమా ఇవ్వలేని పరిస్థితులను ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ దేశాల్లో ప్రకృతి బీభత్సాల మూలంగా పంట నష్టపోయిన వారికి బీమా రూపంలో తక్షణ సాయం అందిస్తున్న విధానాలను మన దగ్గర అమలు చేయాలి. మన దగ్గర పంటల బీమా, మద్దతు ధర లాంటి కీలక అంశాలపై స్వామినాథన్ కమిటీ గతంలో చేసిన మేలిమి సిఫారసులు ఇకనైనా కార్యరూపం దాల్చాలి. అన్నదాతలు ఏ దశలోనూ నష్టపోకుండా జాతీయ రక్షణ చట్టాన్ని కేంద్రం రూపొందించాలి. పంట నష్టం అంచనాలకు ఉండే పరిమితులైన 33శాతం దెబ్బతింటేనే పరిహారం, నెలల వ్యవధిలో రెండుసార్లు పంట నష్టానికి గురైతే ఒక్కసారి మాత్రమే పరిహారమిచ్చేలా ఉన్న నిబంధనలు సవరించాలి. అన్నదాత భద్రతే - ఈ దేశ ఆహార భద్రత అనేలా పాలన సాగాలి. ప్రభుత్వం అండగా ఉంటుందనే ప్రకటనలతో ఓదార్చడం కాకుండా! వెంటనే క్షేత్రస్థాయిలో నష్టం జరిగిన వడగండ్ల వరుస బీభత్సాలను అంచనా వేసి అన్నదాతలు అందరికీ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల వైఫల్యం లేకుండా పారదర్శకంగా నష్టపోయిన ప్రతి అన్నదాతకు నష్టపరిహారం అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అన్నదాతలకు భరోసా కల్పించి పాలకులు వారి రుణం తీర్చుకోవాలి. అన్నదాతల భద్రత అంటే అది మన భద్రత అని భావించాలి.
మేకిరి దామోదర్
వరంగల్ - 95736 66650