మరపురాని మానవీయ చిత్రణ 'ది రైల్వే మెన్'
Unforgettable human film 'The Railway Men'
భోపాల్ గ్యాస్ విషాదం ఈ దేశ ఆధునిక చరిత్రలో ఓ కీలకమైన క్షణం. అమెరికన్ కార్పొరేట్ కంపెనీ యూనియన్ కార్పైడ్స్ దురాశ, రసాయన తయారీ ఫ్యాక్టరీలో కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా కార్మికుల ప్రాణాలను లెక్కచేయని సంపద మదంతో జరిపిన విధ్వంసానికి ప్రతిరూపం భోపాల్ గ్యాస్ లీక్. ముక్కుతో పీల్చితే చాలు నిలువునా మనిషిని చంపేసే ఈ గ్యాస్ లీక్ దుర్ఘటన ప్రపంచ పారిశ్రామిక విపత్తుల చరిత్రలోనే అతి ఘోరమైన ఘటన. 1984 డిసెంబర్ 3 రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్స్ కెమికల్ ప్లాంట్‌లో మెథీల్ ఐసో సైనేట్ (ఎమ్ఐసీ) గ్యాస్ లీక్ అయిన దుర్ఘటనలో 15 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా (3 వేల మృతులు అని 1989 నాటి అధికారిక రిపోర్ట్. కానీ 2010లో కేంద్ర ప్రభుత్వం కోర్టులో నమోదు చేసిన క్యురేటివ్ పిటిషన్ ప్రకారం 5,295 మంది మృతి చెందారు) 5.7 లక్షలమంది గ్యాస్ ప్రభావానికి గురై దశాబ్దాల పాటు బాధలు పడుతూనే ఉన్నారు. అంతవరకు లేక్ సిటీగా పేరొందిన భోపాల్ ఒక్క రాత్రి గ్యాస్ లీక్‌తో పాయిజన్ సిటీగా మారిపోయింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక నగరం నగరమే ఊపిరాడక వెంటిలేటర్ల ఆసరాతో ఊపిరి పీల్చుకోవడం అంతవరకు ప్రపంచం కనీవినీ ఎరుగని ఘటన.
లీక్‌కు ముందూ, వెనక జరిగే కథ
''నిజమేంటంటే ఈ దేశంలో గుప్పెడు ఉప్పూ, ఖద్దరు బట్టల కంటే తక్కువ ధరలో ఇంకొకటి దొరుకుతుంది. అదేంటంటే.. సామాన్యుడి జీవితం. అహింసా పరమోధర్మ అని అంటుంటాము. కానీ ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారికి ఏ శిక్ష లభిస్తుంది 15 వేల ప్రాణాలను తీసిన వారికి ఏం శిక్షగా లభిస్తుందంటే ఒక గవర్నమెంట్ ప్లేన్. వీఐపీ సర్వీసుతో సహా...షాంపెయిన్, ఇంకా కేవియర్‌తో పాటు మీ ఇంటి తిరుగు ప్రయాణానికి రాజ లాంఛనాలు.. మరి మనం. ఇక్కడే ఉండేవాళ్లం. ఇక్కడే ఉన్నాం... ఇక్కడే ఉంటాం. గాంధీ గారి ఆదర్శాల అద్దాన్ని వెతుక్కుంటూ ఉంటాం. మనది ఎలాంటి దేశం అంటే, ఇక్కడ ప్రాణాలు తీసే వారికి శిక్షా లభించదు. ప్రాణాలు కాపాడిన వారికి పొగడ్తలూ లభించవు.''
వెబ్ సీరీస్ మొదట్లోనే వినిపించే ఈ ఉపోద్ఘాతం నాలుగు గంటల నిడివి ఉండే 'ది రైల్వే మెన్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ భోపాల్' సీరీస్ ఆత్మను సూచనప్రాయంగా చెబుతుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటనను తదనంతర తరాలు బహుశా మర్చిపోయి ఉండవచ్చు. ఆనాటి విషాద ఘటనల స్మృతులను తిరిగి దేశం ముందుకు తేవడానికి చేసిన చిన్న ప్రయత్నమే ది 'రైల్వే మెన్' (The Railway Men) వెబ్ సీరీస్. 1984 డిసెంబర్ 2 రాత్రి భోపాల్ నగరం నిద్రలోకి జారుకోవడానికి ముందు అక్కడి సకల జీవన వ్యాపారాలను ఒక్కటొక్కటిగా మన కళ్లముందు ఉంచుతూ ఆనాటి గ్యాస్ లీక్ కథను ముందుకీ, వెనక్కు జరుపుతూ గ్యాస్ లీక్ కావడానికి ముందూ, ఆ తర్వాతా భోపాల్ నగరానికేమైంది అంటూ కథ సాగుతుంది.
కథేంటంటే..
భోపాల్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇఫ్తికార్ సిద్ధికీ (కేకే మీనన్). మంచితనానికి ప్రతిరూపం. భోపాల్ స్టేషన్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆయన ఒక రోల్ మోడల్. తన పరిధిలో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటాడు. అదే సమయంలో భోపాల్ నడిబొడ్డులో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న ఒక విదేశీ సంస్థ భద్రత విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించదు. ఫ్యాక్టరీలోని భద్రతాపరమైన లోపాలను సీనియర్ వర్కర్లు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తే గత నాలుగేళ్లుగా కంపెనీ ఎదుర్కొంటున్న నష్టాల చిట్టా విప్పుతాడు తప్ప, మరేవీ పరిగణనలోకి తీసుకోడు. ఆ ఫ్యాక్టరీలో కొన్ని రోజుల పాటు పనిచేసిన ఇమద్ (బాబిల్ ఖాన్) అందులో తనతో పాటు పనిచేస్తున్న సోదర సమానుడైన స్నేహితుడు ప్రమాదంలో కన్నుమూయడంతో ఫ్యాక్టరీ పని మానేసి, రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా చేరతాడు. ఇమద్ ద్వారా ఆ ప్యాక్టరీలో లోపాల గురించి తెలుసుకున్న పత్రికా రిపోర్టర్ సన్నీ హిందుజా,. ఆ ఫ్యాక్టరీ భద్రతా లోపాలపై అమెరికన్ నిపుణులు ఇచ్చిన హెచ్చరిక నివేదిక కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఈ పరిస్థితుల్లో ఒక రోజు రాత్రి (డిసెంబర్ 2-3, 1984) ఆ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఫ్యాక్టరీ పరిసరాలను దాటి మెల్లగా భోపాల్ మొత్తం ఆ విషవాయువు వ్యాపిస్తుంది. ఆ క్షణంలో భోపాల్ ప్రజల పరిస్థితి ఏంటి, వందలాది ప్రజలు, ప్రయాణికులు కూర్చున్నవారు, నడుస్తున్న వారు అలాగే విషవాయువు ప్రభావానికి గురై ఎలా నేలకొరిగిపోయారు? రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను కాపాడటానికి స్టేషన్ మాస్టర్ సిద్ధికీ, ఇమద్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? గ్యాస్ లీక్ విషయం తెలిసిన సెంట్రల్ రైల్వేస్ జీఎం రతి పాండే (మాధవన్) చేసిన దుస్సాహసం ఏంటి? భోపాల్‌ని రైల్వే మ్యాప్ నుంచి తొలగించి నరమానవుడిని ఆవైపు పోనీయకుండా చేయాలని రైల్వే మంత్రి చేసిన ప్రయత్నాలను జీఎం స్ఫూర్తితో సెంట్రల్ రైల్వేస్ సిబ్బంది ఎలా వమ్ముచేస్తారు? మన కళ్లముందు ఒకటొకటిగా సాగిపోయే ఈ గొలుసు చర్యల వెనుక ఉన్న గ్రిప్పింగ్ దృశ్యాలు తెలియాలంటే 'ది రైల్వే మెన్' వెబ్ సీరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌ని కన్నార్పకుండా అలా చూస్తూ పోవలిసిందే.
39 ఏళ్ల క్రితం జరిగిన యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ఉదంతాన్ని, భోపాల్ స్టేషన్ పరిసరాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు భారతీయ రైల్వే వ్యవస్థకు చెందిన కొంతమంది అధికారులు, సిబ్బంది చేసిన నిర్విరామ ప్రయత్నాలను గొలుసుకట్టులాగా అత్యంత ఉత్కంఠభరితంగా తీశారు. లక్షలాది మంది ఉద్యోగులను కలిగి ఉన్న రైల్వే వ్యవస్థలో కొంతమంది నిజాయితీపరులైన అధికారులు తల్చుకుంటే అత్యంత సంక్షుభిత పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను ఎలా కాపాడగలరో, ఆ క్రమంలో వారు ఎంత స్ఫూర్తిని తమ చుట్టూ ఉన్నవారికి అందించగలరో స్పష్టంగా చూపింది ఈ వెబ్ సీరీస్. నాలుగు గంటలపాటు సాగే ఈ సీరీస్ తొలిభాగం ఎన్నిసార్లు వీక్షకులను ఉద్వేగంతో ముంచెత్తుతుందో, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుందో ఎవరికి వారు చూసి అనుభూతి చెందాల్సిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ తీసిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది.
పాలకుల నిర్లక్ష్యానికి సమిధులుగా..
అదుపు లేని హింస, సెక్స్, అసభ్య సంభాషణలతో జనం తిట్టిపోస్తున్న వెబ్ సీరీస్‌లలోని చెడ్డనంతటినీ చెరిపివేసి సామాన్య మానవులు సంక్షోభకాలంలో ప్రదర్శించే మానవీయ మహత్వ గుణాలను ది రైల్వే మెన్ సినిమా ఎంతో ఆర్ద్రంగా, కారుణ్య దృష్టితో చూపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా దాడుల నేపథ్యంలో గాజా బాధితులు, పసిపిల్లల ఆర్తనాదాలను డాక్యుమెంటరీల్లో, వీడియోల్లో సినిమాల్లో చూస్తూ చలించిపోతున్న కాలమిది. 39 సంవత్సరాల క్రితం యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ద్వారా మన దేశంలో జరిగిన అతి ఘోర ప్రమాదం వెనుక ఏం జరిగిందో, మనుషుల ప్రాణాలను లెక్కచేయని ఆ రాక్షస సంస్థ ఎంతమందిని బలిగొన్నదో పూస గుచ్చినట్లు చూపిన ది రైల్వే మెన్. ఇది అందరూ చూడాల్సిన సీరీస్. నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సీరీస్ '2018' చిత్రం తర్వాత మరో చక్కటి మానవ విషాద జ్ఞాపికగా చరిత్రలో నిలుస్తుంది. అనుక్షణం మృత్యువు వాసనను తలపింపజేస్తూ, ఒళ్లు జలదరింపచేసే మృత్యు సదృశ సంగీతంతో ఈ వెబ్ సీరీస్ భోపాల్ దుర్ఘటనను మన ముందుంచుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే యూనియన్ కార్బైడ్స్ గ్యాస్ లీక్ ఘటన ఇతివత్తంగా హృదయాలను ద్రవింపజేసేలా ది రైల్వే మెన్‌ని తీర్చి దిద్దడంలో దర్శకుడు శివ్ రావెల్ విజయం సాధించాడు. పాత్రల విషయానికి వస్తే, మంచితనానికి నిలువెత్తురూపంగా నిలిచిన స్టేషన్ మాస్టర్ ఇఫ్తికార్ పాత్రలో కేకే మేనన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తన స్నేహితుడి మాదిరిగా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు పోకూడదని పాకులాడే సగటు యువకుడిగా ఇమద్ పాత్రలో బాబిల్‌ఖాన్ జీవించేశాడనే చెప్పాలి. ఇక భోపాల్ జంక్షన్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, మనసు మార్చుకుని, గ్యాస్ లీక్ బాధితులకు సాయం చేసే వ్యక్తిగా దివ్యేందు శర్మ ఉత్కంఠగా సాగే సిరీస్‌లో కాస్త రిలీఫ్‌నిచ్చిన పాత్ర పోషించాడు. కాగా విలేకరిగా సున్నీ హిందూజా, జీఎంగా మాధవన్, జుహీ చావ్లా, మందిరాబేడీ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. పాలకుల నిర్లక్ష్యానికి సమిధులుగా మారుతున్న సామాన్యుల జీవితానికి ఈ వెబ్ సీరీస్ సరైన నిర్వచనం.
భావోద్వేగాల పరాకాష్ట
ఉద్వేగాలను తారస్థాయికి తీసుకెళ్లి ప్రేక్షకులను ఊగించడంలో రాజమౌళి తన సినిమాల ద్వారా ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. అవి పూర్తిగా కమర్షియల్ సినీ మార్గంలోనే నడిచాయి. కానీ ఒక వాస్తవ ఘటనకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేసిన రైల్వే మెన్ సీరీస్ మొదటి నుంచి చివరి దాకా ఎమోషన్స్‌తోనే నడిచింది. కార్మికుల భద్రతను కోరుకునే సీనియర్ వర్కర్ గ్యాస్ లీక్‌ను ఆపే క్రమంలో ఉన్నఫళాన ట్యాంకర్ పేలి చనిపోతూ కూడా తోటి కార్మికుల బాగుకోసం ప్రయత్నించడం కన్నీళ్లు తెప్పిస్తాయి. ఒక్కో సీన్ సాగే కొద్ది ఈ భావోద్వేగాలే కథకు ప్రాణం పోశాయి. తమ నగరంలో ఏం జరుగుతోందో తెలీని దుస్థితిలో, ఎందుకు ఊపిరాడటం లేదో తెలీక వేలమంది ప్రాణాలు గాల్లో కలుస్తుండటం, కార్పైడ్ ఫ్యాక్టరీకి చుట్టు పక్కల సజీవంగా ఉన్న ప్రతి ప్రాణీ మృత్యు కుహరంలోకి వెళ్లిపోతుండటం, జనం ప్రాణాలరచేత బట్టుకుని దొరికిన వాహనాన్ని పట్టుకుని పరుగులు పెడుతూ ప్రాణాలు విడిచే ఘటన హృదయాలను బద్దలు చేస్తాయి. కనుచూపు మేర మృత్యు విషాద సంగీతం ఆవరిస్తున్న చోట రైల్వే సిబ్బంది, తదితర పాత్రలు వేలాదిమంది ప్రాణాలు కాపాడటానికి అందించిన సేవలు, ప్రదర్శించిన స్ఫూర్తి నిరుపమానంగా మన కళ్ల ముందు కదులాడుతాయి. విపత్కర పరిస్థితుల్లో ఒక చిన్న కమ్యూనికేషన్ ఎంత మంది ప్రాణాలను కాపాడుతుందో ఈ సీరీస్ అద్భుత రీతిలో చూపిస్తుంది.
సినిమాలో పాత్రలు కథకు జీవం పోయడం ఒకెత్తయితే, సాంకేతిక విలువలు మొత్తం సీరీస్‌ని అమాంతంగా పైకిలేపాయని చెప్పాలి. విషాద సన్నివేశాలకు సంగీత దర్శకుడు సామ్ స్లాటర్ కల్పించిన నేపథ్య సంగీతం చూస్తున్నవారిని చాలాసేపు వెంటాడుతుంది. కాగా రాత్రి సన్నివేశాలను, 1984 నాటి పరిస్థితులను పునసృష్టి చేసి చూపిన లైటింగ్ ఎఫెక్ట్ అద్భుతమనే చెప్పాలి. ప్రతి దృశ్యాన్ని వివరంగా చెప్పాలని చేసిన ప్రయత్నంలో డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలగవచ్చు. ఈ ఒక్క లోపం మినహాయిస్తే ది రైల్వే మెన్ సీరీస్ ఓటీటీలకు విలక్షణతను అద్దిన సీరీస్‌గా చెప్పవచ్చు.
(ఈ వెబ్‌సీరిస్ నెట్‌ప్లిక్స్‌లో అందుబాటులో ఉంది)
కె.రాజశేఖర రాజు
73964 94557