భక్తుల భద్రతకు..సమిష్టి కృషి అవసరం!
TTD Takes Measures to Secure Devotees
తిరుమల నడకదారిలో శుక్రవారం ఆరేళ్ళ లక్షిత అనే చిన్నారిని చిరుత బలి తీసుకోవడం బాధాకరం. జూన్ 23వ తేదీ కౌశిక్ అనే అయిదు సంవత్సరాల బాలుడు చిరుత దాడిలో గాయపడ్డాడు. ఇలా వరుస ఘటనలతో కాలిబాటన శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు బెంబేలెత్తుతున్నారు. భక్తులలో నెలకొన్న భయాందోళనలు తొలగించి వారిలో ధైర్యం నింపవలసిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. అందులో భాగంగా టీటీడీ పాలకమండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులతో ఇటీవల అత్యవసరంగా టీటీడీ హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించి భక్తుల భద్రతకు టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
భక్తుల భద్రతకు కీలక నిర్ణయాలెన్నో...
ఆ నిర్ణయాలలో కాలినడకన తిరుమల వెళ్ళే ప్రతి భక్తునికి చేతి కర్ర ఇవ్వడం, అలిపిరి నుండి తిరుమల వరకు వన్య ప్రాణుల కదలికలు గుర్తించేందుకు అయిదు వందల కెమరా ట్రూప్లు, డ్రోన్‌ల ఏర్పాటు, కీలక ప్రాంతాలలో ఇరువైపులా ముప్పై అడుగుల వరకు ఫోకస్ లైట్ల ఏర్పాటు, అలిపిరి, గాలిగోపురం, ఏడవ మైలురాయి వద్ద సూచికలు, లఘు చిత్రాలు ప్రదర్శించి స్వీయ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి భక్తులకు తెలియచేయడం, పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలను ఉదయం అయిదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు మాత్రమే నడక దారిలో శేషాచలవాసుని దర్శనానికి అనుమతించడం, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించడం, జంతువుల సంచార పర్యవేక్షణ కొరకు వైల్డ్ లైఫ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దానిలో 24 గంటలు వైద్యులను అందుబాటులో ఉంచడం , తర్ఫీదు పొందిన ఫారెస్ట్ సిబ్బందిని అడుగడుగునా భక్తుల భద్రత కొరకు నియమించడం, నడక మార్గంలో వ్యర్ధ పదార్ధాలు వేసే హోటళ్ళ, దూకాణాదారుల యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంది. నడక దారిలో గుంపులు గుంపులుగా వెళ్ళమని మరియు సాదు జంతువులకు ఆహారపదార్ధాలు పెట్టవద్దని భక్తులకు టీటీడీ సూచించింది.
కంచె ఎందుకు సాధ్యం కాదంటే?
కేంద్ర ఆటవీశాఖాధికారుల సూచనలకు అనుగుణంగా నడక మార్గంలో కంచె ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నడక దారిలో కంచె ఏర్పాటు చేయమని దశాబ్దాల తరబడి భక్తులు ప్రభుత్వాన్ని,టీటీడీ అధికారులను కోరుతున్నారు. ఆ ప్రదేశంలో కంచె నిర్మించాలంటే కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. భక్తుల భద్రతకు టీటీడీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ! అటవీ శాఖ వారు కూడా వన్య ప్రాణుల ప్రాణాలు, భద్రతకు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ పరిణామం వల్లే టీటీడీ అధికారులు, అటవీ శాఖా అధికారుల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలు చాలా కాలంగా ప్రజలలో బలంగా ఉన్నాయి. పర్యవసానంగా భక్తుల భద్రతను గాలికి వదిలేశారనే అపవాదు టీటీడీ, ఫారెస్ట్ అధికారులు మూటగట్టుకోవడం శోచనీయం. అటవీ శాఖ సంపద, వన్య ప్రాణుల భద్రత విషయంలో అటవీశాఖ నియమాలు చాలా కఠినమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత కఠిన నియమాలు ఉన్నా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు వెలసిన తిరుమల, దాని పరిసర ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతంగా పరిగణన లోకి తీసుకుని కంచె నిర్మించే విషయాన్ని ప్రత్యేక అంశంగా అటవీశాఖ చూడాలి.
ప్రజల్లో భయాందోళనలు తొలగించాలి..
సుమారు 1500 సంవత్సరాల క్రితం తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక మనోభావాలకు నిలువుటద్దం అనడంలో ఎటువంటి సంశయం లేదు. ప్రతి రోజు ఎనభై వేల నుంచి లక్ష వరకు భక్తులు ఆపద మొక్కుల వారి దర్శన భాగ్యం కొరకు తిరుమలకు వస్తూ ఉంటారు. వారిలో ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది వరకు అలిపిరి నడక మార్గంలో వస్తూ ఉండడం గమనార్హం. కనుక శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, అలిపిరి నడక మార్గం యొక్క ప్రస్థానం, ప్రాముఖ్యత, పవిత్రతను పరిగణన లోకి తీసుకుని కంచె నిర్మాణం విషయంలో అటవీ శాఖ సానుకూలంగా స్పందించాల్సి ఉంది. భక్తులు, ప్రజల ప్రాణాల పట్ల అటవీ శాఖ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని గత కొద్ది కాలంగా ప్రజలు భావిస్తున్నారు. సోమవారం ఉదయం చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన శ్రీ నరసింహ స్వామి దేవాలయం సమీపాన సోమవారం ఉదయం ఒక చిరుత బోనులో చిక్కింది. అదే సోమవారం రోజు రాత్రి వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ లో చిరుత సంచరించి అక్కడి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసింది. అదేవిధంగా గతంలో కూడా అటవీ ప్రాంతం దాటి జనావాసాలైన తిరుపతిలోని రుయా ఆసుపత్రి, స్విమ్స్, పద్మావతీ ఆసుపత్రి ప్రాంగణాలలో చిరుత సంచరించి కలకలం సృష్టించింది.
ఈ పరిణామాలు అన్నీ అటవీశాఖ వైఫల్యాన్ని బట్టబయలు చేశాయి. పేలవమైన అటవీశాఖ పని తీరుపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి కలిగేటట్లు చేసింది. కనుక ఆటవీశాఖాధికారులు ఇప్పటికైనా మేల్కొని భక్తులు,ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే చర్యలు యుద్ద ప్రాతిపదికన చేపట్టి భక్తులు, ప్రజలలో నెలకొన్న భయాందోళనలు తొలగించాలి. అదే సమయంలో అటవీశాఖకు అన్ని విధాలా సహకారం అందించవలసిన బాధ్యత ఆర్థికంగా అన్ని విధాలుగా బలీయమైన స్థితిలో ఉన్న టీటీడీపై కూడా ఉందనేది నిర్వివాదాంశం. అదేవిధంగా భక్తులు కూడా చిన్న పాటి స్వీయ జాగ్రత్తలతో నడక మార్గంలో క్రూర మృగాల వలన ఎదురయ్యే ప్రమాదాల నుంచి పూర్తిగా బయట పడవచ్చు. భక్తులు ప్రతి ఒక్కరూ భయాన్ని వదిలి సంబంధిత అధికారుల సూచనలు తూచా తప్పక పాటిస్తూ భద్రతా సిబ్బందికి సహకరించాలి. ఈ విపత్కర పరిస్థితి నుండి బయట పడేందుకు టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజలు సమన్వయంతో ఒకరికొకరు సహకారం అందించు కోవాలి. తద్వారానే భక్తుల భద్రతకు భరోసా ఏర్పడుతుందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. కనుక సంబంధిత అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసి భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం.
కైలసాని శివప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
94402 03999