చట్టం ఏర్పడి పాతికేళ్లయినా వారి బతుకులు మారవా?
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా గిరిజనుల ప్రగతిలో మాత్రం ఆశించినంత మార్పు రాలేదు. వారి అభ్యున్నతి కోసం
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా గిరిజనుల ప్రగతిలో మాత్రం ఆశించినంత మార్పు రాలేదు. వారి అభ్యున్నతి కోసం పాలకులు చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలులోని అలసత్వమే ఇందుకు కారణం. గిరిజనులు పోరాటాల ద్వారానే పెసా (పంచాయత్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) చట్టం సాధించుకున్నారు. ఈ చట్టం 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలులోకి వచ్చింది. దీనిని అందరికీ ఓకే రీతిన అమలు చేయడంతో గిరిజనులలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో వారు ఉద్యమ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం దిలీప్ సింగ్ భూరియా నేతృత్వంలో కమిటీ వేసి, ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1996 డిసెంబర్ 24న షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణాధికారాల చట్టాన్ని (పెసా) రూపొందించింది.
ఆదివాసీల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం కల్పించింది. దీని ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో గ్రామపంచాయతీలకు బదులు గ్రామసభలను ఏర్పాటు చేసి వాటికి విశేషాధికారాలు ఇచ్చారు. ఒకే ప్రాంతంలో ఉండే గిరిజనులు గ్రామసభ పరిధిలోకి వస్తారు. అక్కడ ఉన్న సహజ వనరులు, అటవీ సంపద మీద యాజమాన్య హక్కులు వారివే. అక్కడి వనరులు, పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ మొత్తం ఆ సభలకే ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం పంపిణీ గనుల తవ్వకాల లీజు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన వంటి వాటికి గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాతకు లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారులపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ వంటి విషయాలలో గ్రామసభలకే సర్వాధికారాలు ఉన్నాయి. ఈ చట్టానికి 2021 డిసెంబర్ 24 నాటికి పాతికేళ్లు నిండాయి. కానీ, దాని లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
నిబంధనలు లేకుండానే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్‌లోని షెడ్యూలు ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధుల జమా, ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసుకోవాలి. ప్రభుత్వాల అలక్ష్యంతో ఆలస్యంగా 2011లో నిబంధనలు రూపొందించారు. 2013లో గిరిజన సంక్షేమ శాఖ గ్రామసభలను గుర్తించింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు 'పెసా' ప్రకారం గిరిజన గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.ఒక్క గుజరాత్ తప్ప ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికీ నిబంధనలు రూపొందించుకోలేదు.
షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏదేని ప్రాజెక్టు భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలని, ఆ ప్రాజెక్టుతో నష్టపోయేవారికి పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని చట్టం చెబుతోంది. ఆ నిబంధనలను అనేక రాష్ట్రాలు ఇష్టానుసారం అన్వయించుకుంటున్నాయి. గ్రామసభల తీర్మానాలను లెక్క చేయకుండా గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం ఇలా అనేక అంశాలలో పెసా స్ఫూర్తికి విరుద్ధంగా మార్పులు చేసుకుంటున్నాయి. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022 కూడా పెసా స్ఫూర్తిని, ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. స్థానిక వనరుల మీద ఆదివాసీలకు హక్కులు కల్పించి, గ్రామసభల తీర్మానాలతో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వినియోగం, సంక్షేమ ఫలాల పంపిణీ సరిగా జరిగినప్పుడే గిరిజన ప్రాంతాలలో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి.
ఆ రక్షణలు నిర్వీర్యం
ఆదివాసీ ప్రాంతాలలో సంప్రదాయ పాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాలలో దశాబ్దాలుగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కీలక గ్రామసభలను విస్మరించడం సరి కాదని కొన్ని సర్వేలు కేంద్రానికి నివేదించాయి. గిరిజనుల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సాయంతో 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్' అధ్యయనం చేసింది.పాలనా సంస్కరణల కమిషన్, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య కమిటీ (ఏకే శర్మ), భూ పరాయీకరణ, నిర్వాసితుల అధ్యయన కమిటీ (రాఘవ చంద్ర) పెసాను పటిష్టంగా అమలు చేస్తేనే ఆదివాసీలు స్వయం పాలన సాధ్యమని తేల్చి చెప్పాయి.
భూ బదలాయింపు, పెసా, అటవీ హక్కుల చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదు, ఆరవ షెడ్యూల్‌లోని రాజ్యాంగ రక్షణలు నిర్వీర్యం అవుతున్నాయి. పెసా సహా మరో పది గిరిజన రక్షణ చట్టాలు, వాటి నిబంధనలపై శిక్షణ ఇప్పించి, వాటి అమలు తీరును పర్యవేక్షించే 'గిరిజన సంస్కృతి, పరిశోధన శిక్షణా సంస్థలలో' సరిపడా సిబ్బంది, నిధులు లేక కుంటుపడుతున్నాయి. పెసా ప్రకారం గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. తెలుగు రాష్ట్రాల గిరిజన ఆవాసాలలో గ్రామసభలను ఏర్పాటు చేయాలి. తగినన్ని వనరులను సమకూర్చి ఫెసా అమలుకు కేంద్రం పూనుకుంటేనే ఆదివాసీలకు స్వయం పాలన సాకారమవుతుంది.
గుమ్మడి లక్ష్మీనారాయణ
సామాజిక రచయిత
94913 28409