అవి ఔషధాలు.. మిఠాయిలు కాదు
డాక్టర్ పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా జరిగే యాంటీ బయోటిక్స్ వాడకం భారతదేశంలో అత్యంత ప్రమాదకర ధోరణిగా మారింది.
డాక్టర్ పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా జరిగే యాంటీ బయోటిక్స్ వాడకం భారతదేశంలో అత్యంత ప్రమాదకర ధోరణిగా మారింది. ఎన్నో రకాల అంటువ్యాధులు వస్తున్న ఈ రోజులలో వ్యాధిని బట్టి, పరీక్ష చేసిన తర్వాత మాత్రమే సరైన యాంటీబయోటిక్స్ వాడాలి. ఎన్ని రోజులు వాడాలి, ఏ మోతాదులో వాడాలి, మందులతో పాటు తినకూడని ఆహారాలు ఏమిటి అన్న ముఖ్య విషయాలు డాక్టర్లు చెప్పినట్టు పాటించాలి. మందులకీ, మిఠాయిలకీ తేడా లేకుండా కొనుక్కుని వాడే అలవాటు చాలా ప్రమాదకరమైనదని గుర్తించకపోవడం ఒక కారణమైతే, మందులు స్వస్థత చేకూర్చడంతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా చూపెడతాయని తెలుసుకోకపోవడం ఇంకొక కారణం.
నా చిన్నతనంలో, అంటే మరీ ఇక్ష్వాకుల కాలం నాటి మాట అని చదవడం ఆపేయకండి; అమెరికన్ వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టిన కాలం నాటి మాట చెబుతున్నాను. సూపర్ బజార్లు లేని రోజుల్లో, ఊళ్ళో ఉండే చిన్న కిరాణా దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునే రోజులవి. కొనవలసిన వస్తువుల పట్టికలో సాధారణంగా కందిపప్పు, బెల్లం, నూనె, ఆర డజను అనాసిన్ మాత్రలు లాంటివి ఉండేవి. ఆ రోజుల్లో పల్లెల్లో ఉండే కిరాణా దుకాణాలలో మందులు కూడా దొరికేవన్నమాట. నేను ఉన్నత పాఠశాల విద్య స్థాయికి వచ్చాక జ్వరం వస్తే APC మాత్రలు (Aspirin, phenacetin, and caffeine కలిగిన మాత్రలు), అతిసారానికి Sulfanilamide మాత్రలు ఇచ్చే వారు డాక్టర్లు. ఎప్పుడు వెళ్ళినా డాక్టరు ఇచ్చేవి అవే మందులు కదా అని దుకాణానికి వెళ్ళి తీసుకుని రమ్మని పురమాయించేది మా బామ్మ. పాము కాటుకు, తేలు కుట్టుకీ మంత్రాలు వేయడంతోపాటు అల్లోపతి వైద్యం కూడా చేసేది మా బామ్మ! డాక్టరు దగ్గరకి వెళ్ళక్కర లేకుండానే మందుల షాప్ కి వెళ్ళి జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి సామాన్య అనారోగ్యాలకి సాధారణంగా డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడవలసిన రక్తపోటుకి వాడే మందులు లాంటి మందులు కూడా అడిగి, ఎన్నయినా తీసుకునే అవకాశం ఉండేది;
మందులకీ, మిఠాయిలకీ తేడా లేకుండా..
ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది కదా! రక్తపోటు గానీ మధుమేహం కొంచెం ‘ఎక్కువగా ఉందనిపిస్తే’ ఇంకో మాత్ర పెంచి వేసుకోవడం, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మందుల డబ్బా తీసుకువెళ్ళడం మర్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రక్తపోటు, మధుమేహం మందులు వాడుతూంటే మందుల పేర్లు, మోతాదుల వివరాలతో పనిలేకుండా అప్పు తీసుకుని సేవించడం చేసే వారిని చూస్తూనే ఉంటాం. మందులకీ, మిఠాయిలకీ తేడా లేకుండా కొనుక్కుని వాడే అలవాటు చాలా ప్రమాదకరమైనదని గుర్తించకపోవడం ఒక కారణమైతే, మందులు స్వస్థత చేకూర్చడంతో పాటు ఏవో కొన్ని దుష్ప్రభావాలు కూడా చూపెడతాయని తీసుకోకపోవడం ఇంకొక కారణం. కొన్ని మందులు తీవ్రమైన, మరికొన్ని మందులు అంతగా బాధించని దుష్ప్రభావాలు చూపుతాయి. డాక్టరు పర్యవేక్షణ లేకుండా రక్తపోటు, మధుమేహ వ్యాధి నివారక మందులు దీర్ఘకాలం నియమ విరుద్ధంగా వాడడం వల్ల రోగనిరోధకత నెలకొనడంతో పాటు కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
యాంటీబయోటిక్స్ మితిమీరి వాడితే
డాక్టర్ పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా సాగే యాంటీ బయోటిక్స్ వాడకం భారతదేశంలో అత్యంత ప్రమాదకర ధోరణి. ఎన్నో రకాల అంటువ్యాధులు వస్తున్న ఈ రోజుల్లో వ్యాధిని బట్టి, పరీక్ష చేసిన తర్వాత మాత్రమే సరైన యాంటీబయోటిక్స్ వాడాలి. ఎన్ని రోజులు వాడాలి, ఏ మోతాదులో వాడాలి, మందులతో పాటు తినకూడని ఆహారాలు ఏమిటి అన్న ముఖ్య విషయాలు డాక్టరు చెప్పినట్టు పాటించాలి. కొన్ని మందులు కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారం తో పాటు తీసుకోకూడదు; కొన్ని ఆహారం తోటి, కొన్ని ఆహారం తినకుండాను వేసుకోవాలి. రక్తపోటు, మధుమేహం నిరోధించడానికి వాడే మందులు సొంత వైద్యంతో వాడితే రోగికి మాత్రమే ప్రమాదం; యాంటీబయోటిక్స్ విచక్షణా రహితంగా మిఠాయిల్లా వాడితే రోగికి మాత్రమే కాక సమాజానికి కూడా ప్రమాదం. ఔషధ నియంత్రణ సంస్థలు ఆమోదించని యాంటీబయోటిక్స్ వినియోగం భారతదేశంలో అపాయకరమైన స్థాయిలో ఉంది. సమాజంలో ఔషధ నిరోధక అంటువ్యాధులు ప్రబలితే కట్టడి చేయడం అసాధ్యం కావచ్చు.
వాడిన మందులు వాడి... వాడీ..
దశాబ్దానికి ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి అవే మందులు సంవత్సరాలు తరబడి వాడే వారు కొందరైతే, వారానికి ఒక సారైనా డాక్టరు దగ్గరకి వెళ్ళకపోతే తోచని వారు మరికొందరు. డాక్టరుని చూసిన ప్రతి సారీ అంగాంగ వ్యాధి లక్షణ వర్ణన చేస్తూంటే అసంకల్పితంగా డజను రోగ నిర్ధారణ పరీక్షలు, అరడజను స్కాన్లు రాసి రోగి క్షేమం కోరే ఉత్తమ వైద్యుడిగా రోగి దృష్టిలోనూ, వైద్యశాలకి ఆదాయం చేకూర్చే విశ్వాసపాత్రుడైన ఉద్యోగిగా యాజమాన్యం దృష్టిలోనూ మంచి ముద్ర వేయించుకోవాలనే సగటు వైద్యులకు ఈ రోజుల్లో కొదువ లేదు. రోగికీ పరీక్షలు కావాలి, వైద్యులు పరీక్షలు రాయాలి అన్న చందాన వైద్య విధానం నడుస్తుంది. ముఖ్యంగా, ఆరోగ్య బీమా పద్ధతి వచ్చాక రోగ నిర్ధారణ పరీక్షలు, రోగ నివారణ చర్యలు అవసరానికి మించి జరుగుతున్నాయి అనిపిస్తుంది.
రోగులు అడగరు, వైద్యులు చెప్పరు
డాక్టరుతో గడిపే సమయం, సందేహాల నివారణకు అవకాశాలు భారత దేశంలో చాలా తక్కువ; చాలా సందర్భాల్లో లేవనే చెప్పాలి. వైద్యుడు నారాయణుడితో సమానం కాబట్టి చెప్పినది విని ఆచరించాలి కానీ ప్రశ్నించకూడదన్న సామాజిక నేపథ్యం మనది కావడంతో డాక్టరుని పెద్దగా ప్రశ్నలు అడగరు రోగులు. ఒకవేళ అడిగినా, సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారు డాక్టర్లు. ఈ ధోరణి మారాలి. రోగులకు వ్యాధుల పట్ల కనీస అవగాహన కల్పించే స్వచ్ఛంద సమూహాల అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా, గ్రామీణ, నిరక్షరాస్య ప్రజలకు వైద్య సంబంధిత అవగాహన కల్పించడంతో పాటు మౌలిక హక్కుల పరిరక్షణ కల్పించి, రోగుల తరపున వాదించే సమూహాల అవసరం చాలా ఉంది. విషయ పరిజ్ఞానం ఉన్న పౌరులు సమాజానికి అవసరం.
డా. కొవ్వలి గోపాలకృష్ణ
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక (అమెరికా)
editor@prakasika.org