ఇవి ఆత్మహత్యలు కాదు.. నిరుద్యోగుల బలవన్మరణాలు
గత కొన్నేళ్లలో ప్రజల్లో నిరుద్యోగం, నిరాశా, నిస్పృహలు గణనీయంగా పెరిగాయి. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా
గత కొన్నేళ్లలో ప్రజల్లో నిరుద్యోగం, నిరాశా, నిస్పృహలు గణనీయంగా పెరిగాయి. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చెబుతున్నా లెక్కల మాట అటుంచితే వాస్తవంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. లక్షల్లో యువత ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వేళ వారికి ఉద్యోగాలు దక్కట్లేదు. అదేవిధంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు, తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
2016 -2019 మధ్య కాలంలో దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు 24 శాతం పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ద్వారా వెల్లడైంది. దేశంలో నిరుద్యోగం కారణంగా 2018 నుండి 2020 వరకు 9,140 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని హోంశాఖ సహాయ మంత్రి రాజ్యసభలో తెలిపారు. 2014 తో పోలిస్తే 2020లో నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు 60 శాతం పెరిగాయి. 2020లో ఈ సంఖ్య పెరిగింది.
ఉద్యోగాల హామీ.. ఎన్నికల జిమ్మిక్కే...!
ఐదో అతిపెద్ద ఎకనామీ దేశంగా దూసుకెళ్తున్న భారత్‌ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రికార్డు స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేస్తే మరో అడుగు ముందుకేసి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగిత రేటు 5.44 శాతం ఉండగా 2017 లో 5.44 శాతం వద్ద ఉన్న తర్వాత నాలుగేళ్లపాటు అదేవిధంగా నత్తనడకన కొనసాగింది. 2019లో కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. డిమాండ్ సప్లై గొలుసు దెబ్బతినడం, కార్మికుల వలస ఇతర కారణాల రీత్యా 2020 నాటికి నిరుద్యోగ సమస్య 8 శాతానికి పెరిగింది. 2021లో 2.02 శాతం పుంజుకొని 5.98 శాతానికి క్షీణించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 12.76 శాతం నమోదైంది.
మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 192 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాల్లో ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతున్న భారత్ ర్యాంకు నిరుద్యోగ ఆత్మహత్యల్లో 132 కు పడిపోయింది. ఇక మన దాయాది దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. తాజా మానవాభివృద్ధి నివేదిక 2021 -2023 చూస్తే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఊహించని స్థాయికి చేరింది.
ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ!
నిరుద్యోగ భృతే కాకుండా అప్పులపాలవడం, దివాలా వంటి ఆర్థిక సమస్యల కారణంగా కూడా 2018 -2020 మధ్య ఆత్మహత్యలు పెరిగాయి. ఈ మూడేళ్లలో ఆర్థిక సమస్యల కారణంగా 16,091 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2019 లో అత్యధికంగా 5,908 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో 2016లో 224 ఆత్మహత్యలు నమోదు కాగా 2019 నాటికి 553 కు ఎగబాకింది. 2016లో 2,298, నిరుద్యోగుల బలవన్మరణాలు జరిగితే, 2017లో 2,404 మంది, 2018లో 2,741 మంది, 2019లో 2,851 నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూస్తే దేశంలో అత్యధికంగా హర్యానాలో 37.3 నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ 32.8, రాజస్థాన్ 31.4, జార్ఖండ్ 17.3, త్రిపుర 16.3, గోవా 13.7, బీహార్ 12.8 నిరుద్యోగ రేటు గల రాష్ట్రాలుగా వున్నాయి. ఇక తెలంగాణకు వస్తే నిరుద్యోగిత రేటు 7 శాతం నుండి 4 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 4 శాతం ఉండగా, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గత నెలలో 8.04 శాతం, పట్టణ ప్రాంతాల్లో 7.74 శాతం నిరుద్యోగ రేటు పెరిగింది.
ఇది దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు!
ఇతర దేశాలతో పోల్చితే మన దేశ నిరుద్యోగ రేటు మరీ దారుణమైన స్థితిలో ఉన్నట్లు అనిపించదు. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన భారత్‌కు మాత్రం ఇవి గొడ్డలిపెట్టు వంటిదే. 2020 మార్చి 1 నాటికి ప్రభుత్వ శాఖల్లో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో వెల్లడించారు. ఇన్నీ ఖాళీలున్నా కేవలం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్‌సీల ద్వారా ఇప్పటి వరకు 2,65,468 ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు.
ఉద్యోగం కావాలనే సంకల్పంతో నిరుద్యోగులు కష్టపడి, ఒక ఉద్యోగాన్ని మనసులో ఫిక్స్ చేసుకొని, దాని కోసం కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అది రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, చిన్న పనులు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. అలా కాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని ప్రారంభించాలి తప్ప, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మనసు నుండి తీసివేసి, బతకడానికి బలంగా తయారు కావాలి. అలాంటప్పుడే నిరాశ, నిస్పృహలో ఉన్న యువత కూడా ఒడుదుడుకులొచ్చినా దృఢసంకల్పంతో వారు అనుకున్న గమ్యాలను చేరుతారు.
-మోటె చిరంజీవి
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్.
99491 94327