అవినీతి అంతమే అంతిమ లక్ష్యం
The ultimate goal of governments is to eliminate corruption
బ్యాంకు లోన్‌కెళితే ఎక్కడా అప్పు లేనట్లు ధ్రువీకరణ పత్రం కావాలంటారు. ఎన్నికల్లో నిలబడి వారిని మాత్రం ఆస్తి, అప్పుల వివరాలు తప్ప ఏమి అడగరు. రాజకీయ నాయకుల్లో సక్రమంగా ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు కట్టని వారి లెక్క వేలల్లో ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి వీటన్నిటికీ శాసన సభ్యులందరి నుండి నో డ్యూస్ తెప్పిస్తే బాగుంటుంది. రాష్ట్ర ఆదాయం ఒక్కసారి వందల కోట్లలో పెరిగిపోతుంది.
గత ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆరు గ్యారంటీల హోరుతో తెలంగాణ పాలనను చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడే పుట్టిన పార్టీ కాదు. ఎన్నో ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన చరిత్ర దానికుంది. దాని మెరుపులు, మరకలు దానికున్నాయి. నడుస్తున్న ప్రభుత్వాలతో జనం విసిగి వేసారి ఏదో ఓ రోజు మరో దారిలేక తమకే ఓటేస్తారనే తరగని నమ్మకం వారిది. అదీ వారి కాలం చెల్లని పాలసీ. దానిని జనం రుజువు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో వచ్చిన గెలుపుగానే తెలంగాణాలో కాంగ్రెస్ విజయాన్ని అనుకోక తప్పదు. ఇక ఇందులో ఉన్న కొత్తదనమేమిటంటే ఆరేళ్ళ క్రితమే పార్టీలో చేరిన వ్యక్తి పాత కాపులను తోసేసి ముఖ్యమంత్రి కావడమే. బతుకంతా ఆ పార్టీకే రాసి పెట్టిన అసలు కాంగ్రెసువాదులు రెండో వరుసలోకి వెళ్లిపోయారు. ఎప్పుడైనా పార్టీని గెలిపించేవాడే అందరి కన్నా ఘనుడు. నిజానికి తెలంగాణ ఒక ప్రయోగశాల నుంచి మరో ప్రయోగశాలకు బదిలీ అయింది.
ఇక నీతివంతమైన పాలన విషయానికొస్తే ప్రతి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినవారే. ఎవరిదీ కష్టార్జితం కాదు. ఆస్తి అమ్మి, అప్పు చేసి ఎవరూ ఎన్నికల బరిలో దిగరు. ఆ తర్వాత గెలిచినవారు ఎవరూ పెట్టుబడిని పోతే పోనీ అని వదులుకోరు. పదవి మాటున అవినీతికి, కబ్జాలకు, కమీషన్లకు ఖాతా తెరవాల్సిందే. లేకుంటే కోట్ల నష్టం, మళ్ళీ పోటీకి కష్టం. ఇలా రాజకీయాల్లో పంచాయతీ వార్డు మెంబర్ నుండి రాష్ట్రాన్ని ఏలే మంత్రుల దాకా ప్రతి పనిలో తమ వంతును తీసుకోకుండా ఉండలేరు. రాష్ట్ర ఆదాయం ఒక్కసారి వందల కోట్లలో పెరిగిపోతుంది. కరెంటు శాఖ తీరుతెన్నులను సమీక్షించే ప్రభుత్వం ముందు ప్రభుత్వ ఆఫీసుల, అధికారుల నివాసాల కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు ఎంత బకాయి పడ్డాయో తెలుసుకొని ఆయా శాఖలకు చెల్లిస్తే మంచిది.
అవినీతిని నిరోధిస్తేనే అభివృద్ధి
పాలనలో అవినీతిని కట్టడి చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు, అలాగే కట్టడి చేయడమూ సాధ్యం కానీ పనే. గత ప్రభుత్వంలో మంత్రుల, శాసన సభ్యుల అవినీతికి చెందిన వార్తలు, వీడియోలు బాహాటంగా చక్కర్లు కొట్టినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాటిని ఖండించడం కూడా జరగలేదు. దాంతో పాలకపక్షంలో ఈ చిన్న హోదా ఉన్నా అధికారులను బెదిరించవచ్చు, అవినీతికి పాల్పడవచ్చు అనే భరోసా కండువా జీవులకు లభించింది. పార్టీలో చేరేవారి గుణగణాలు లెక్కించకుండా అందరికి కండువా కప్పడం ఆనవాయితీగా మారిపోయింది. దాంతో పార్టీ లేబుల్ తప్ప లోన సరుకంతా షరా మాములే. ప్రజలు ఏమి గమనించడం లేదు, ఓటు బ్యాంకుకు సరిపడా పథకాల లబ్దిదారులున్నారు, వారిని తృప్తి పరిస్తే చాలు అనే భ్రమలో ప్రభుత్వ పెద్దలు ఉండడంతో అవినీతికి కళ్లెం వేసే అవసరమే లేదనుకుంటున్నారు.
మా ఎమ్మెల్యే మీద కోపంతో ఓటేశాం
బీఆర్ఎస్ మూడోసారి గెలుపును అందుకోకపోవడానికి విశ్లేషకులు పలు కారణాలను వివరిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను చూసి ఓటేశారా, రేవంత్ రెడ్డి మాటలు విని ఓటేశారా అంటే రెండూ కాదు, మా ఎమ్మెల్యే మీద కోపంతో వేశామని అంటున్నారట. అలవికాని వాగ్దానాలను వదిలేస్తే కేసీఆర్ కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన తీరు నచ్చిన వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయినా బీఆర్ఎస్ ఓటమికి పార్టీ పెద్దలే బాధ్యత వహించాలి.ఆ పార్టీ వద్దని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. జనం ఇంకా ఎక్కువ సొమ్ము ఇస్తామన్న నేతల మాటలకు జై కొట్టారు. సామాన్య ఓటరుకు ఏం తెలుసు, రెండువేలకు బదులు మూడు వేలు ఇచ్చే సొమ్ము ఎక్కడి నుండి వస్తుందని. పాత ప్రభుత్వం తమ హామీల కోసం నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పు కుప్పను మరింత పెంచితే తప్ప గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కుదేలవుతోంది. గ్యారెంటీల కోసం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబు లేదు.
ప్రభుత్వం మారినంత మాత్రాన సివిల్ ఇంజనీర్ వచ్చి కాంట్రాక్టర్ వేసిన సిమెంటు రోడ్డును పద్దతిగా తనిఖీ చేస్తాడా, బాగా లేకపోతే బిల్లు ఆపేస్తాడా.. తన కమిషన్ వదిలేసుకుంటాడా.. ఇలా ఎన్నో శాఖలు.. అన్నిట్లో అవినీతి కోరలు. మార్పు, ప్రగతి, అభివృద్ధి అనేవి సంక్షేమ పథకాల పెంపు, వాటిలో ఇచ్చే సొమ్ము పెంచితే జరగదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే మార్గాలు మూసివేయాలి.ప్రతి పైసాకు జవాబుదారీతనం అధికారులపై ఉంచాలి. పాలన మాదేనని బెదిరింపులు, దాదాగిరి చేసే కౌంటర్లు మూసివేయాలి. ఎన్నికల ఖర్చు తిరిగి రాకున్నా పర్వాలేదు, తెలంగాణ బాగుపడాలి అనే పట్టుదల, త్యాగ గుణం గెలిచిన ప్రతి సభ్యుడిలో ఉండాలి.
-బి.నర్సన్,
94401 28169