మానవ జీవితాన్ని మధ్య యుగ కాలం నుంచి ఆధునిక కాలం దాకా అత్యంత ప్రభావితం చేసిన కళారూపం నాటకం! నాటకం నట ప్రధానమైన కళా విన్యాసం. వివిధ రకాల పాత్రలను మనుషుల లోని భావోద్వేగాలను ఒక కృత్రిమ వాతావరణంలో పునఃసృష్టి చేయడం నాటకం ప్రధాన ఉద్దేశం! మన చుట్టూ ఉన్న సమాజం లోని విభిన్న ప్రవృత్తులు, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల ప్రతీకలుగా నాటకంలో పాత్రలు మన ముందు ప్రత్యక్షమై, ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణలు, కథా గమనాన్ని అనుసరించి ప్రేక్షకులకు, ప్రజలకు ఒకానొక నీతిని, ఒక సందేశాన్ని, ఒక ఆదర్శాన్ని, ఒక ఆలోచనని కలిగిస్తాయి.
One of the best product from human evolution is THEATRE! మానవ జీవితాన్ని జంతు జీవనం నుంచి, ఆదిమ జాతుల జీవశైలుల నుంచి వేరు చేసిన అంశాలు జ్ఞానం, సృజనాత్మకత. వీటిలో జీవితాన్ని జీవించడాన్ని, కళాత్మకంగా, రసాత్మకంగా, సౌందర్యాత్మకంగా మలచింది మాత్రం సృజనాత్మకతే అని చెప్పవచ్చు. అలాంటి సృజనాత్మక అన్వేషణలో, ఆవిష్కరణలో మానవ జీవితాన్ని మధ్య యుగ కాలం నుంచి ఆధునిక కాలం దాకా అత్యంత ప్రభావితం చేసిన కళారూపం నాటకం! నాటకం 14 వ శతాబ్ద కాలం నుంచి యూరప్‌లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని షేక్స్పియర్, ఇబ్సెన్ వంటి రచయితల తోడ్పాటుతో ఎంతగానో ముందుకు వెళ్ళింది. అలాగే భారతదేశంలో శూద్రకుడు, భాసుడు, కాళిదాసు వంటి మహా కవులు రాసిన రచనల ద్వారా నాటకం శతాబ్దాల క్రితం పరిఢవిల్లడమే కాకుండా 'నాటకాంతాః సాహిత్యం' అనే స్థాయికి వెళ్లి పోయింది. అంటే సాహిత్యం శిఖర రూపం నాటకంగా భారతీయ సాహితీ వేత్తలలో నిర్ధారణ అయింది.
నాటకానికి పట్టాభిషేకం
నాటక రంగం నుంచి తర్వాత సినిమా, టీవీ, ఓటీటీ, సోషల్ మీడియా వంటి నూతన సాంకేతిక అంశాల ఆగమనంతో, నాటక రంగ ప్రాధాన్యత కొంత తగ్గినప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ నాటకం మానవుడి సృజనాత్మకత నుంచి పుట్టిన ఒక అత్యంత అద్భుతమైన సాంస్కృతిక విశేషంగా విరాజిల్లుతోంది. అందుకే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థలు మార్చి 27ను ప్రపంచ రంగస్థల దినోత్సవంగా నాటకానికి పట్టాభిషేకం చేసే లాగా ఉత్సవాలు జరపాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. నాటక దినోత్సవ సందేశంగా థియేటర్ అండ్ కల్చర్ అఫ్ పీస్ అనే నినాదాన్ని చెప్పారు. ఈ నినాదం ఒక కళా రూపం మానవాళికి చేసే సామూహిక ప్రయోజనానికి ప్రతీక అని చెప్పొచ్చు.
సైకో థెరపీగా నాటకం
మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రోల్ ప్లే, యాక్టింగ్, డ్రామా వంటివి మనుషులలో పేర్కొంటున్న ఎన్నో మానసిక దౌర్బల్యాలకి, అశాంతులకు ప్రక్షాళనగా చెబుతున్నారు. ఒక మనిషి తనలోని ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, కక్షలు, కార్పణ్యాలని, నెగిటివ్ థాట్స్‌ని వివిధ రకాల పాత్రలను పోషించడం ద్వారా సంతృప్తి పరుచుకొని తనలోని ప్రతికూల స్వభావాలని తుడిచిపెట్టుకుంటారు. అలాగే నాటకాన్ని వీక్షించే ప్రేక్షకులు సైతం వివిధ పాత్రల ద్వారా తమని తాము ఐడెంటిఫై చేసుకుంటూ, తాదాత్మ్యం చెందుతూ, మమేకమవుతూ ఆయా పాత్రలు పొందిన పరాభవాలను, విజయాలను, అనుభవాలని తమకు అన్వయించుకుంటూ వారు కూడా మానసికంగా ప్రక్షాళన చెందుతారనేది కూడా నిరూపణ అయింది. ఈ విధంగా నాటకం ఒక సైకో థెరపీగా ఒక కళాత్మక మానసిక చికిత్సా విధానంగా ప్రస్తుతం కనిపిస్తోంది. అలాగే యుద్ధ బీభత్సాన్ని, మానవాళి సమూహిక హాననాన్ని వీడేలా గొప్ప సందేశం నాటకం ఇస్తుంది.
భావోద్వేగాల పునరావిష్కరణ
ఆ లెక్కన శాంతి సంస్కృతి స్థాపనలో నాటకం అనన్య సామాన్యమైన పాత్రని పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే మన అంతరంగంలోని మానవులని, మనలోని భావోద్వేగాలను పునర్ ఆవిష్కరించడానికి నాటకం అవసరం. వేయడానికి అయినా, చూడటానికి అయినా నాటకం మనలోని భావోద్వేగాలకు,మన కళ్ళెదుట నిలిచే ప్రత్యక్ష ప్రతిబింబం! అందుకే ప్రపంచ శాంతి కోసం, మానవాళి ప్రశాంతత కోసం అయినా నాటకం వర్ధిల్లాలి..నాటకం కొనసాగాలి.. నాటక సంస్కృతి విస్తరించాలి!
(ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా)
డా. మామిడి హరికృష్ణ
డైరెక్టర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం
80080 05231