కొత్త పుంతలు తొక్కుతున్న 'కథలు'

ప్రతీ వ్యక్తి సినిమాలో తనను తాను చూడాలనుకుంటారు’. అదే సినిమాల విజయ సూత్రం కూడా. ‘ప్రేమ పావురాలు’ వంటి హిందీ, తెలుగు చిత్రాల

Update: 2023-10-14 00:45 GMT

ప్రతీ వ్యక్తి సినిమాలో తనను తాను చూడాలనుకుంటారు’. అదే సినిమాల విజయ సూత్రం కూడా. ‘ప్రేమ పావురాలు’ వంటి హిందీ, తెలుగు చిత్రాల కథ వెనుక ముంబాయి వంటి ప్రాంతాలలో విడి కుటుంబాల వారికి ఉమ్మడి కుటుంబం వంటి అంశాలు బాగా ఆకర్షించాయని’ ముళ్ళపూడి వారు ఓ సందర్భంలో అన్నారు. తెలిసిన వాతావరణం, స్నేహం, సునిశితమైన ప్రేమ, ఉమ్మడి కుటుంబాలలోని ‘మనిషికి మనిష’నే కాన్సెప్ట్ వంటివి ‘శతమానం భవతి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నాటి ‘సీతారామయ్యగారి మనవరాలు’ వంటి చిత్రాలను విజయతీరాలకు చేర్చాయి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను గమనించాలి.

మనుషుల్ని కలిపే కథలకు విలువెక్కువ!

‘చివరకు మనమందరమూ కథకులమే’నని ప్రపంచమంతటా విజయం సాధించిన ‘డాక్టర్ హు’ రచయిత స్టీఫెన్ మొఫాట్ వ్యాఖ్యానం. మనల్ని మనం ఊహించుకునే కథలు ఆనందం, ఆత్మసంతృప్తినిస్తాయి. భాష, భౌగోళిక, మానవీయ కోణాలు వంటివి కథను ‘మనిషి’కి దగ్గరగా చేర్చుతాయి. ఒక ఉదాహరణ- స్నేహం, మానవతావాదం, లక్ష్యం వంటి అంశాలను మిళితం చేసి విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విజయం అందరికీ తెలిసిందే... మానవ భావోద్వేగాలు అన్ని ప్రాంతాలలో ఒకటేనని చెబుతూనే ‘తన స్వంత ప్రాంతీయ’ ముద్రను కలిగిన ‘కాంతార’ విదేశాలలో సహితం ‘డాలర్ల’ వర్షం కురిపించింది. ప్రత్యేకమైన ‘సాంస్కృతిక నేపథ్యం’ చిత్ర నిర్మాత, దర్శకునికి కాసుల వర్షం కురిపించింది. భాషల కతీతంగా ‘మనుషుల్ని’ కలిపే ‘కథ’లకు విలువెక్కువ అని టాలీ, బాలీ, హాలీవుడ్’లతో పాటు ‘శాండిల్ వుడ్’లు కూడా నిరూపించాయి. ‘2018’ ఆస్కార్‌కు ప్రాంతీయ చలనచిత్రంగా ఎంపిక కావడం వెనుక ‘సందేశం’ అందరికీ తెలిసిందే!

1954లో జపనీస్ రచయిత అకిరా కురసోవా తీసిన ‘ది సెవెన్ సమురాయ్స్’ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ప్రపంచమంతటా ఆ తరహా చిత్రాలకు మార్గదర్శిగా నిలిచింది. 1960 లో ఇంగ్లీష్ వెర్షన్ జాన్ స్టర్జిన్ ‘ది మాగ్నిఫిసెంట్7’గా హిందీలో 1975లో ‘షోలే’గా విడుదలై రికార్డులను నెలకొల్పటం చరిత్ర. విజయ టెండూల్కర్ రాసిన ‘కమలా’ నాటకాన్ని చలనచిత్రంగా రూపొందించినప్పుడు సాధారణ స్త్రీల గౌరవం గురించి చర్చ భారీ ఎత్తున జరిగింది. ఆలోచనలను రేకెత్తించింది.

ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కంటెంట్ ప్రస్తుతం తన సత్తాను నిరూపిస్తున్నది. దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, అర్జెంటీనా, జపాన్, జర్మనీ వంటి అనేక ఇతర దేశాల కథలు ‘నెట్టింట్లో’ సులభంగా చూస్తున్నాం. అనేక ప్రయోగాత్మక చిత్రాలను గమనిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలో సహితం ‘కథలు’ ప్రయోగాత్మకంగా వస్తున్నాయి. మన వాతావరణానికి తగిన విధంగా ‘సినిమాలను’ నిర్మిస్తూనే విశ్వ వ్యాప్తమైన మానవ విలువలకు ప్రాధాన్యాన్నిస్తున్నాయి చిత్రాలు. సాంస్కృతికమైన ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో సినిమాలు వస్తున్నాయి. ‘అరవింద సమేత’, ‘రంగస్థలం’, ‘బలగం’, ‘సామజవరగమన’, ‘విమానం’, ‘జై భీమ్’, ‘2018’ అటు కన్నడ, మలయాళీ పరిశ్రమలో కూడా వైవిధ్యమైన విలువలకు పట్టం కట్టేవి అప్పుడప్పుడూ వస్తున్నాయి.

తెలుగు కంటెంట్ ప్రపంచస్థాయిలో..

సాంకేతికాభివృద్ధి ‘కథను’ తినేస్తున్నదనే వాదన ఉంది. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకు విజయాలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ‘స్టార్స్’ తో భారీ బడ్జెట్ సినిమాలు ‘కథ’లేక, ‘మనిషి’ (ప్రేక్షకుని)కి కనెక్ట్ కాలేక, వారిని తనతో తీసుకు వెళ్ళలేక (ట్రావెల్) చతికిలబడ్డాయి. ‘జైలర్’ వంటి చిత్రాలలో ఉన్నదేమిటో ‘భోళాశంకర్’, నిన్నటి ‘స్కంధ’లో లేనిదేమిటో ప్రేక్షకుడికి తెలుసు. 'అతను మేధావి', ‘మంచి కథ’ సౌభ్రాతృత్వపు ఆలోచనలను కలిగిస్తాయి. చిన్నగానే అయినా సామాజిక మార్పును శిఖర స్థాయిలో కోరుకుంటాయి. సూక్ష్మమైన సూత్రాలతోనే సాధించే ప్రయత్నాలు చేస్తాయి. క్లిష్టమైన, సున్నితమైన అంశాలను సహితం ఎంతో మానవీయంగా చిత్రించిన సినిమాలు వస్తున్నాయి. ‘బలగం’, ‘విమానం’ వంటివి ఉన్నాయి. ప్రపంచ సినిమా స్థాయిలో వీటిని పరిశీలించలేము. కారణం నటీనటులు, నిర్మాణ విలువలు, బడ్జెట్ వంటివి. అయినా మనిషి విజయవంతమైన, ఆనందకరమైన జీవనానికి కావలసిన వనరులను తక్కువ స్థాయిలోనే ‘సంతృప్తి’కరంగా ఎలా ఉపయోగించుకోవచ్చో, పొందవచ్చో ఇటువంటి కథలు చెబుతాయి. నిరంతరాయమైన సాంకేతికాభివృద్ధి అంచున కథ కనుమరుగవుతున్నదని అనుకోవలసిన అవసరం లేదు. కొత్త బాధ్యతల వైపు మార్పుకు, సమస్యల ప్రపంచంలో తమ వంతు నిర్వహణా సామర్థ్యపు సమర్థతలను ఆలోచించుకోవటానికి కథలు అవసరమవుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటువంటి కథా చిత్రాలకు లోపం లేదు. తెలుగు మూకీ నుంచి టాకీ వరకు నేటి వరకు అనంత ప్రయాణంలో కొన్ని వేల ఉత్తమ కథా చిత్రాలు వచ్చాయి. మానవతకు పట్టం కట్టాయి. ఆత్మీయతానుభవాలను గూర్చి, మనిషిలోని మంచి చెడులను, సమాజంలోని ‘వ్యక్తి’ స్థాయి అనుభవాలను వివరించాయి. ఇవన్నీ సాంస్కృతిక భౌగోళిక వైవిధ్యం నుంచి పుట్టినప్పటికీ మనిషిని కదిలించే శక్తి ఉంది. అవి.. ప్రేక్షకుల్ని కలిసికట్టుగా ఆనందింపజేస్తూ, ఆవేదనా క్రీనీడల జీవితాన్ని ఆస్వాదించమని సుతిమెత్తగా చెప్పాయి. చెబుతాయి.

గురుదేవులు రవీంద్రులు ‘ఎవరూ ప్రపంచ భారాన్ని మరింతగా పెంచకూడదు. ప్రతీ ఒక్కరూ దానిని తగ్గించడానికి ప్రయత్నించాలి' అని చెప్పారు. ఆ పని కథాత్మకమైన చిత్రాలు చేస్తాయి. నాటి ‘మాలపల్లి’, ‘దేవత’, ‘వందేమాతరం’ తర్వాత కాలంలో ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సిరివెన్నెల’ ఇలా ఎన్నెన్నో తమవంతు సాంస్కృతిక మధ్యవర్తిత్వంతో ‘మానవ విలువల ఔన్నత్యం’ గూర్చి చెప్పాయి. భాషకతీతంగా వచ్చే ‘కాంతార’ లాంటి చిత్రాలు కూడా భావోద్వేగాలను ప్రగాఢంగా ప్రభావితం చేశాయి. ఈ పని కన్నడ, మరాఠీ నాటక రంగం కూడా చేయటం విశేషం. ఆ దిశగా తెలుగు నాటక రంగం ‘సినిమా’ ప్రపంచంలో ‘ఫేడౌట్’ అయింది. ఇది శోచనీయం.

ఏది ఏమైనా ప్రపంచస్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ‘కంటెంట్’ విశ్వవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందదాయకం. కానీ.. ఈ శాతం మూడు శాతానికి మించి లేదనుకోవటం మరో విషాద కోణం. కాలక్షేపపు చిత్రాల కెరటాల హోరు ‘కలుషితాన్ని’ తమతో ముందుకు తీసుకురావడం, ‘ముత్యాలు’ సాగర గర్భంలో ఉండిపోవటం జరుగుతున్నది.. ఇది మారాలి...

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Tags:    

Similar News