ఈ స్టేను ఉపసంహరించుకోవాలి!
Telangana government should withdraw village layout registration in Supreme Court
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ భూమి ఉన్నవాన్ని లేని వాడిని చేసింది. భూమిలేని వాన్ని ఉన్నవాన్ని చేసింది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని చేసింది. ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిని చేసింది. తద్వారా తెలంగాణలో ఎమ్మార్వోల నుండి కలక్టర్‌ల వరకు, కార్పొరేటర్ నుండి మంత్రుల వరకు వేల కోట్లు సంపాదించారనేది కాదనలేని నిజం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించి భూములను మింగిన సర్పాల నుండి మళ్ళీ భూమిని కక్కించాలి.. ప్రస్తుత భూ సమస్యలకు కారణమైన సాఫ్ట్‌వేర్ కంపెనీకు కాంట్రాక్ట్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థ అయిన ఎన్‌ఐసీకు ఇచ్చి, ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సరిదిద్దాలి. ధరణి వలన తమ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి. లేఅవుట్ల భూములకు ఇస్తున్న రైతుబంధును ఆపాలి. కౌలు రైతులను ఆదుకోవాలి. అసైన్డ్ భూమికి అమ్ముకునే హక్కులు ఇవ్వాలి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామపంచాయతీ లేఅవుట్లలో ఫస్ట్ డాక్యుమెంట్ కానీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేసింది. దీనిపై కొందరు హైకోర్టును సంప్రదించగా ఇది రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్దమని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. కానీ హైకోర్టు తీర్పును అప్పీల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకుంది. దీనివల్ల హెచ్‌ఎండీఏలో సుమారు రెండు లక్షల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది, డెవలపర్స్, డబ్బు చెల్లించిన కొనుగోలు దారులు ఆనాటి నుండి ఆందోళన చెందుతూనే ఉన్నారు. అందుకే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిల్‌ను ఉపసహరించుకోవాలి. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని స్కీమ్స్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లలో ఉన్నవారిని వెంటనే తొలగించాలి.
-నారగోని ప్రవీణ్ కుమార్
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
98490 40195