ఉపాధ్యాయ సంఘాలూ.. ఈ బాధ్యత తీసుకోండి!

బహుళ, భిన్న సంస్కృతులు పరిఢవిల్లిన ఈ దేశంలో శాంతి, సౌభాగ్యం, సహనశీలత, సామాజిక, శాస్త్రీయ దృక్పథాలు, మానవీయత వంటి ఉత్తమ

Update: 2024-09-14 00:45 GMT

బహుళ, భిన్న సంస్కృతులు పరిఢవిల్లిన ఈ దేశంలో శాంతి, సౌభాగ్యం, సహనశీలత, సామాజిక, శాస్త్రీయ దృక్పథాలు, మానవీయత వంటి ఉత్తమ విలువలను విద్యార్థులలో పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. వారి ధ్యేయం సమాజ అభివృద్ధి. అందుకే ఉపాధ్యాయులలో ఆదర్శవంతమైన నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించాలి. తద్వారా విద్యార్థుల్లో విలువలు పెంపొందించి భావి సమాజ నిర్మాణానికి దోహదపడాలి. అధ్యాపకుల సమర్థతను కాపాడడంలో, వారి వృత్తిపరమైన గౌరవాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రముఖ పాత్ర నిర్వహించాలని నూతన జాతీయ విద్యా విధానం -1986 పేర్కొనడం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం యూటీఎఫ్, టీఏఫ్, డీటిఎఫ్, పీఆర్‌టీయూ, ఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ, యస్‌టీయూ, ఆపస్, తపస్, వెనుకబడిన తరగతుల ఉపాధ్యాయ సంఘాలని, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, జూనియర్ కళాశాలలో గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల సంఘం, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ జూనియర్ లెక్చరర్ల విభాగం, తెలంగాణ లెక్చరర్ల సంఘం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, డిగ్రీ స్థాయిలో జీసీజీటీఏ, టీసీజీటీఏ వంటి ఉపాధ్యాయ సంఘాలున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఆయా వర్సిటీలకు సంబంధించిన అధ్యాపక సంఘాలు ఉన్నాయి. ఇలా దాదాపు 100 దాకా గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని అధ్యాపక సంఘాలు(ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య) (లెఫ్ట్, రైట్, తటస్థం సంఘాలు) ఉన్నాయి. ఉన్నత విద్యలో బాగా బలంగా వినపడేటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఐఫ్యాక్టో (AIFACTO), అఖిల భారతీయ రాష్ట్రీయ సంశిక్ మహాసంఘ్ (ABRSM) అధ్యాపకులకు సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ప్రాథమిక సభ్యుల అవసరాలు తీర్చేందుకు వాటి పరిధిలో అవి పనిచేస్తున్నాయి.

బతకలేక బడిపంతులు కాలమే నయమా!

అయితే, జీతభత్యాలు, సౌకర్యాలు నామమాత్రంగా ఉండి బతకలేక బడిపంతులు అనే రోజులలోనే విద్యాలయాల మీద మమకారం, విద్యార్థుల మీద ప్రేమాభిమానాలు, వృత్తిపై అంకితభావం, సామాజిక బాధ్యత ఉపాధ్యాయుల్లో ఉండేది. రానూ రానూ అధ్యాపకులు వారి సమస్యల పరిష్కారం కోసం సంఘాలు ఏర్పరచుకొని తమ సమస్యలతో పాటు, విద్యా సంబంధ నిర్ణయాల్లోనూ పాలుపంచుకునేవారు. అయితే ప్రస్తుతం ఆ సంఘాలు వారి హక్కులకు సంబంధించిన విషయాలైనా (జీపీఎఫ్, డీఏలు, పీఆర్సీలు, ఎర్నింగ్ లీవ్స్ ఎన్‌క్యా‌ష్మెంట్, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు) కోసం మాత్రమే కాకుండా నైతిక విలువలు గల, సృజనాత్మకమైన విలువలు గల, గుణాత్మకమైన విద్యను, మార్గదర్శకమైన విద్యను అందించడంలో సఫలమవుతున్నాయా, విఫలమవుతున్నాయా? అని ఆలోచించాలి. ఒకవేళ విఫలం అయితే ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి. ప్రభుత్వాలు తీసుకునేటువంటి విద్యా సంబంధ నిర్ణయాలను, నిజంగా క్షేత్రస్థాయి విద్యకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, అవసరమైతే చట్టబద్ధమైన, న్యాయస్థానాల ద్వారా సాధించుకోవాలి.

ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా?

టీచర్ ట్రైనింగ్ కోర్సులు ( టీటీసీ, బీఎడ్ & ఎంఈడీ) కోర్సుల ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు... టీచింగ్ విధానంలో వస్తున్న నూతన పోకడలను, సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకొని పాఠాలు చెప్పడంలో ఏ విధంగా విద్యార్థులకు చేరువ కావాలి అనే ప్రశ్న బహు అరుదు. జూనియర్, డిగ్రీ, కళాశాలలో విశ్వవిద్యాలయాల స్థాయిలో లెక్చలర్లకు, ఆచార్యులకు టీచింగ్‌లో టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేయ కుండా వారు పాఠాలు బోధించడం శాస్త్ర సహితంగా లేదు. ఒకవేళ టీచర్లు గానీ, లెక్చరర్లు గానీ ఎంతమంది ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల కు క్రమం తప్పకుండా అటెండ్ అవుతున్నారు, దీనికి ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారనేది మనం ఒకసారి ఆలోచించాలి. విద్యా విషయాలపై, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యా వ్యవస్థలో నూతన పోకడలపైన, శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పాటలు చెప్పడంలోనైనా, సెమినార్లను, కార్య గోష్టులను (వర్క్ షాప్స్), ఎగ్జిబిషన్లను, చర్చలను నిర్వహించాలి.

విద్యాలయాలు సక్రమంగా పనిచేసేలా..

విద్యాలయాలు సక్రమంగా పనిచేసేలా సమయపాలన పాటించేలా ఉపాధ్యాయ/అధ్యాపక సంఘాలు కృషి చేయాలి. అధ్యాపకుడు తరగతి గది నుండి సమాజానికి విస్తరించాలి. సత్ ప్రవర్తన గల సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ సంఘం బాధ్యత తీసుకోవాలి అప్పుడే విద్యాలయాలకు సమాజ సహకారం ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాలు వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహించడంలో సమాజంలో వివిధ వర్గాల నిపుణుల సేవలను వినియోగించుకుని నూతన పోకోడలను ఉపాధ్యాయులకు అందజేయాలి. కొత్త సిలబస్ అమల్లోకి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి.

డా. రవి కుమార్ చేగొని

జనరల్ సెక్రటరీ, తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్

98669 28327

Tags:    

Similar News