అనూహ్య విజయం- సమస్యల వలయం

అనూహ్య విజయం- సమస్యల వలయం... tdp got unexpected success with a chain of problems

Update: 2023-03-22 19:00 GMT

త్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది. ఈ పరిణామంతో వైఎస్ఆర్‌సీపీ పార్టీపై పట్టభద్రులలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం తొణికిసలాడుతోంది. ఈ విజయాన్ని ఎంతో సంబరంగా నిర్వహించుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ విజయం వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తులో తమ పార్టీకి ఎదురయ్యే సమస్యలు తలచుకుంటుంటే, కార్యకర్తలతో పాటూ ఆ పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

అంతా ప్రభుత్వ వ్యతిరేకత కాదు..

ఈ ఎన్నికల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 7,16,664 ఓట్లు పోలవ్వగా వీటిలో 6,63,782 మాత్రమే చెల్లిన ఓట్లుగా పరిగణించారు. ఈ ఓట్లలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు 43.89 శాతంతో 82,967 ఓట్లు, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ 29.49 శాతంతో 55,751 ఓట్లు, పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ 18.59 శాతంతో 35,153 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మాధవ్ 5.75 శాతంతో 10,885 ఓట్లు సాధించారు. అయితే టీడీపీ అభ్యర్థి వైసీపీపై కేవలం 27,216 ఓట్లతోనే గెలుపొందారు ఇది కేవలం 14.40 శాతం మాత్రమే. అలాగే చిత్తూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేవలం 10.96 శాతం ఓట్ల తేడాతో అంటే 27,262 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిని ఓడించాడు. అలాగే వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతో మెజారిటీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు అందులో టీడీపీ అభ్యర్థి తన సమీప అభ్యర్థిపై కేవలం 7,453 ఓట్లతో గెలిచాడు. అయితే ఆ పార్టీ ఈ మూడు నియోజకవర్గాల గెలుపును ఆనందించాల్సిన అంశమే కానీ ఈ విజయంతో ముడిపడిన అనేక అంశాలను పరిశీలిస్తే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పెను సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినా అవి కేవలం స్వల్పంగా ఉండటం పైగా ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కాదని కచ్చితంగా చెప్పవచ్చు. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందన్న ప్రచారం తప్పనిపిస్తుంది.

ఆ పార్టీ మద్దతే ముఖ్యం..

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే జనసైనికుల వల్లే టీడీపీకి ఈ విజయం సాధ్యమైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. దానికి కారణం జనసేన పార్టీ తొంభై శాతం పట్టభద్రులైన యువతతో నిండి ఉన్న పార్టీ. వీరంతా పవన్‌ను ఆరాధిస్తుంటారు. పవన్‌పై విపరీత అభిమానంతో ఉండి ఏది చెబితే అది చేసేలాగా ఉంటారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జనసేనకు, వైసీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిస్తే వారు ప్రలోభాలకు లొంగకుండా జగన్‌పై కసితో నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో జనసేన బలం ఊహకందని విధంగా రెట్టింపు అయింది. అందుకే ఈ విజయం జనసేన నైతిక విజయంగా భావించవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలంటే జనసేన పార్టీ మద్దతు కచ్చితంగా అవసరమవుతుంది. అయితే జనసేనతో టీడీపీ కలిసి పోటీ చేయాలంటే మాత్రం కొద్ది కాలమైనా ముఖ్యమంత్రి పదవి జనసేనకు కేటాయించాలని జనసేన కోరుకుంటుంది. ఆ పదవి కేటాయించకుండా జనసేన కార్యకర్తలు టీడీపీతో పొత్తుకు ఒప్పుకోరు. ముఖ్యమంత్రి పవన్ కావాలని అలాగైతేనే జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాపు కులస్తులు కోరుకుంటున్నారు. దీనినే ఇటీవల హరిరామ జోగయ్య వ్యూహాత్మకంగా ప్రకటించారు కూడా. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేసేందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది. తెలుగుదేశంతో పొత్తు వద్దని మా పార్టీ సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది కూడా. అయితే టీడీపీతో పొత్తుకు జనసేన ఒప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం జగన్‌కు మద్దతిచ్చి ఆయనను తిరిగి గద్దెనెక్కించేందుకు కృషి చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2024 ఎన్నికల్లో రాణిస్తారో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : మంది సొమ్ముతో... శ్రీమంత సీఎం సుద్దులు

కైలసాని శివప్రసాద్

94402 03999

Tags:    

Similar News