తంగలాన్ మూడు తరాల నెత్తుటి చరిత్ర..

చరిత్ర అంటే ఘటనల సమాహారం. ఆ చరిత్రకు విజేతల విహారం తప్ప పరాజితుల గోస అసలే పట్టదు. ఎక్కడో ఒకే ఒకడు ఉంటాడు బాధ్యతగా

Update: 2024-08-23 01:15 GMT

చరిత్ర అంటే ఘటనల సమాహారం. ఆ చరిత్రకు విజేతల విహారం తప్ప పరాజితుల గోస అసలే పట్టదు. ఎక్కడో ఒకే ఒకడు ఉంటాడు బాధ్యతగా, వ్యవస్థీకృతంగా అణచివేసిన అనామకుల గురించి తలచేవాడు. పా. రంజిత్ లాగా, తంగలాన్ లాగా తమ చుట్టూ నైరాశ్యం నిండి ఉన్నప్పుడు వెలుగు దివ్వెల గురించి ఆలోచిస్తూ తలపోతలతో అనామకంగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను వెలికితీస్తుంటారు.

వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదరకుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగిన తలలు, తుప్పుపట్టిన కత్తులు అంతే. నాగరిక ఆవాస ఆనవాళ్లను తుదమట్టంగా చెరిపేసు కున్నాక గతం గురించి వలపోత ఎందుకు?

క్షమాపణ చెప్పలేని జాతి మనది!

ఒకప్పుడు ఇక్కడ మనిషి మహోన్నతంగా బతికాడు అనడానికి మిగిలిన మట్టి పెంకులు, శిలాజాలు, ఈటె, బల్లెం, వాడేసిన స్నాన ఘట్టం, ఆ నగర నిర్మాణానికి కూలిన బతుకులు, అధికారం కోసం తెగిన పీకలు. ఆ ధ్వంసం అయిన శిథిలాలలో గతాన్ని వెతుక్కుని ఏం లాభం. ద్వాపరలో చనిపోయిన శ్రీకృష్ణుడు పుట్టిన మూలాల గురించి కార్బన్ డేటింగ్ చేస్తాము గానీ ఈ దేశ విముక్తి కోసం రక్తతర్పణ చేసిన రాంజీ గోండ్, బిర్సా ముండా పేరే తలవం. గడిచిన కాలాన ఒక జాతి మీద మరొక జాతి, ఒక వ్యవస్థ మీద మరొక వ్యవస్థ తమ ఆధిపత్యం కోసమో, తమ జాతి ఉత్కృష్టతను కాపాడుకోవడానికో జరిపిన అమానవీయమైన మారణ హోమాలకు ఏదో ఒకదశలో నేలకు తలవంచి క్షమాపణ చెప్పాయి. తమ పాపాలను క్షమించమని వినమ్రంగా ప్రాధేయపడ్డాయి.

కేజీఎఫ్ గని లోతుల్లోని చరిత్ర!

కానీ ఏకలవ్యుడు, శంభూకుని మొదలు కంచక చర్ల కోటేశు, మంథని మధుకర్ దాకా నడిచి వచ్చిన నెత్తుటి గాయాలకు క్షమాపణ ఇంకా బాకీనే ఉంది. ఆ బాకీ తీర్చమని అడగాల్సిన అవసరం ఉంది. ఆ బాకీ తీర్చడంలో భాగంగానే పా.రంజిత్ తంగలాన్ సినిమా తీసాడు. అది మూడు గంటల సినిమా కాదు... మూడు తరాల నెత్తుటి చరిత్ర. పా రంజిత్ తీసిన పూర్వ సినిమాలు ఒక ఎత్తు, తంగలాన్ ఒకెత్తు. కేజీఎఫ్ లాంటి సినిమా చూసాక తంగలాన్ అవసరమా అనుకోవచ్చు. అందుకే రంజిత్ తన ఆలోచనను మార్చుకుని కేజీఎఫ్ గని లోతుల్లోకి చరిత్రలో అనామకంగా మిగిలిపోయిన పేజీలలోకి వెళ్లాడు.

సినిమా తీసాడా, చరిత్ర తిరగ రాసాడా?

కోలార్ గోల్డ్ వెతుకులాట ఇప్పటిది కాదు, రాజరికపు కాలం నుండి టిప్పు సుల్తాన్ దాకా సామ్రాజ్య వాదుల నుండి తంగలాన్ దాకా రక్తసిక్తమైన చరిత్ర. రెండు వందల యాభై ఏళ్ల చరిత్రను రెండున్నర గంటల్లో దృశ్యమానం చేయడమూ సాహసమే. ఇది కాలంలోకి ప్రయాణం లాంటిది. అలా వెళ్లే క్రమంలో పూర్వం గొప్పగా విలసిల్లిన నాగ జాతులు, తథాగతుని అడుగు జాడలు కనుగొన్నాడు. హైందవ సమాజం తెగనరికిన బౌద్ద, జైన ఆనవాళ్లు కనుగొన్నాడు. మత వ్యాప్తికోసం శైవ వైష్ణవ తెగలు నరికిన తలల చరిత్ర చూసాడు. నిజానికి ఇది తెగిన బుద్దుడి తల కోసం తలపోత కాదు. తన బౌద్ధిక ప్రాభవాల ప్రదర్శనా కాదు. మతం రాజేసిన మానవ హననం ఎంత బీభత్సంగా ఉంటాదో వెతికాడు రంజిత్. రంజిత్ సినిమా తీసాడా, చరిత్ర తిరగ రాసాడా? అనేది చూసే వాని దృష్టి కోణం మీద ఆధారపడి ఉంటది.

తెలుగు తెరకు మట్టివాసనలద్ది..

సినిమా అంటే ఇలానే ఉండాలి అని అలవాటు పడ్డ తెలుగు తెరకు మట్టి వాసన అద్దిన వాడు రంజిత్. తాతలు నేతులు తాగారు అని చెప్పే కాకమ్మ కథల స్థానే తెగిపడి శంబూకుని శిరస్సు చెప్పిన రహస్యాలను తవ్వి తీస్తున్నాడు. పెట్టుడు మీసాలు, పిట్టగూడు లాంటి విగ్గుకు అలవాటు పడ్డ బాబుల డాబుల దర్పాలు కాదు. వంటి చేత్తో వందల మందిని హతం చేయడం కాదు. చేతి కర్రను ఆయుధంగా మర్మకళను, రస విద్యనూ, సిద్ద వైద్యాన్ని, సిద్దుల జ్ఞానాన్ని వొడిసిపట్టాడు. మొత్తంగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన కక్కడి వారసుల ప్రతిరూపమే ఇవ్వాల్టి తంగలాన్. ప్రకృతి మనకు ఒనకూర్చిన వనరుల మీద ఆధిపత్యం కోసం ఒకనాటి రాజరిక, తర్వాత మధ్యయుగ కొనసాగింపుగా వచ్చిన ఆధునిక సమాజాలు రాజేసిన యుద్ధాల వెనక అన్యాక్రాంతం అయిన మూలవాసుల ఆర్తనాదం ఈ తంగలాన్. ఆధునిక మానవుడు అనుభవిస్తున్న సకల సౌకర్యాల వెనక అనామకంగా మిగిలిపోయిన ఆదిమ సమాజాల ఆనవాళ్ల వెతుకులాట తంగలాన్.

తంగలాన్ కేవలం ఒక గని కార్మికుడి చరిత్ర మాత్రమే కాదు. ఆ కోట్ల టన్నుల మట్టిని ఎత్తిపోసిన లక్షలాది కార్మికుల అనామకుల చరిత్ర. వాళ్లు ఏనాడూ ఏ ఆధిపత్య చరిత్రలో అయినా ఒక పేజీకి నోచుకోలేదు. ఆ విస్మృత చరిత్రను వెండితెర మీద దీప్య వెలుగులో దృశ్యమానం చేసాడు రంజిత్.

కల్చరల్ షాక్ తంగలాన్

ఈ సినిమాలో మత వ్యాప్తి ఉంది, మత మార్పిడి ఉంది, భూమిని స్వాధీనంలో ఉంచుకుని తరాలుగా వెట్టి చాకిరీ చేయించుకున్న రాజరిక, మధ్యయుగాల దాష్టీకం మీద తిరుగుబాటు ఉంది. చావుని ఎదిరించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం. చావుని ఎదిరించి బతికినా, పోరాడినా, చనిపోయినా నీ ఉనికిని నిరాకరించే ఉదంతాలు ఎన్నో...

వంద తలలు, కవచ కుండలాలు, మట్టి కుండల్లో జీవం పోసుకున్న మహిమాన్వితుల జీవిత కల్పనాజగత్తుకు అలవాటు పడ్డ లోకానికి కల్చరల్ షాక్ ఈ సినిమా. రంగు వెనక రాజకీయాలను రంజిత్ చెప్పినంత బలంగా ఏ దర్శకుడూ చెప్పలేదు. ఇవ్వాళ బంగారాన్ని వంటి మీద సింగారించుకుంటున్న సకల లోకం ఆ అలంకరణ వెనక కోట్లాది మంది చెమట నెత్తురు ఉందని మరిచిపోతారు. బురద నుండి బువ్వ తీసే రైతును, బూడిద నుండి బంగారం తీసే శ్రమ జీవిని ఏనాడు మనం పట్టించుకున్నాము కనుక?

యాది కొస్తున్న బస్తర్ తంగలాన్‌లు

ఏది ఏమైనా తంగలాన్ జీవిత పోరాటం ఈ కాలపు ధిక్కారం. జేమ్స్ కేమరూన్‌కి, అవతార్ సినిమాలో నాగరికులు తరాలుగా మూలవాసులు కాపాడుకున్న సహజ సంపద కోసం వచ్చిన ఆధునిక విధ్వంసకారులలాగా అనిపించారు. మన తంగలాన్‌లో విక్రం నటన అమోఘం. మెల్ గిబ్సన్ తీసిన ‘అపొక్లిప్టో’ చిత్రంలో రూడి యంగ్ బ్లడ్ నటన కన్నా తక్కువేమీ కాదు తన నటన. మనకొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కోటాను కోట్ల సంపదను కబళించాలి అని చూస్తున్న బహుళ జాతి సంస్థలను ధిక్కరిస్తున్న బస్తర్‌లో వేలాది మంది తంగలాన్‌లే యాదికి వచ్చారు. ఇది కాపాడుకోవాల్సిన పరంపర. త్యాగాల పునాదిగా ఆవిర్భవించబోతున్న మానవీయ సమాజానికి నాంది. ప్రపంచ సంపదలో సగం బంగారాన్ని ప్రపంచానికి ఇచ్చిన కోలార్ గని కార్మికుల త్యాగం మొదటి భాగంగా వచ్చింది. అక్కడ జమకూడిన మాఫియాతో తంగలాన్ చేసిన తండ్లాట రెండో భాగంగా రాబోతోంది.

డా. గుఱ్ఱం సీతారాములు

99516 61001

Tags:    

Similar News