విద్యార్థులారా.. చావడం కాదు బతికి సాధించాలి

విద్యాలయాలు సమగ్ర వ్యక్తిత్వం గల సమాజాన్ని తయారు చేసే కర్మాగారాలు, గురువులు. అందులో కార్మికులు

Update: 2025-04-17 00:45 GMT
విద్యార్థులారా.. చావడం కాదు బతికి సాధించాలి
  • whatsapp icon

విద్యాలయాలు సమగ్ర వ్యక్తిత్వం గల సమాజాన్ని తయారు చేసే కర్మాగారాలు, గురువులు. అందులో కార్మికులు, వారి సృజనాత్మక బోధనలో తయారైన విద్యార్థులే విశ్వ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. కానీ వాస్తవంగా నేడు జరుగుతున్నదేమిటి? దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చెబుతోంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో బలవన్మరణాల రేటు ప్రతి ఏటా 2 శాతం పెరుగుతుండగా.. విద్యార్థుల అఘాయిత్యాలు 4 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అంతేకాదు నమో దు కానివీ చాలా ఉంటున్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తే వీటిని చాలా వరకు నిలువరించవచ్చు.

మార్కులు, ర్యాంకుల వేటలో...

పిల్లల ఆత్మహత్యలు మన దేశంలో సామాజిక సమస్యగా మారాయి. చదివేది, పరీక్షలు రాసేది విద్యార్థులైతే, వాటి ఫలితాలపై విద్యార్థుల సామర్థ్యాల స్థాయిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు వారి పిల్లలపై ర్యాంక్‌లు, మార్కుల వేటలో అంచనాలు పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఒత్తిళ్లతో కూడిన చదువులు, పోటీ పరీక్షల వాతావరణానికి తోడు రకరకాల ఆర్థిక, సామాజిక కారణాలు, వివక్ష లాంటివి నేటి తరం విద్యార్థులు విపరీత మానసిక ఒత్తిడితో తల్లి తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక కుంగుబాటులో నిస్సహాయ స్థితిలో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఒంటరితనమే కుంగుబాటు

పోటీ పరీక్షల కోసం విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాల్లో చేరే వారిలో చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. హఠాత్తుగా కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండటం వల్ల వీరిలో ఒంటరితనం చోటు చేసుకుంటుంది. ఇది కుంగుబాటుకు కారణం కూడా అవుతుంది. ఓదార్చడానికి తోడులేని వాతావరణంలో ఇవి ఎక్కువగా అనర్థానికి దారి తీస్తాయి. తమ సమస్య తెలిస్తే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో వెనకాడుతుంటారు. వీరు మరింత కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

కుంగుబాటు సంకేతాలు..

పిల్లలతో కలిసి ఉండకుండా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం. రాత్రిపూట నిద్రలేకపోవడం, చనిపోతానని లేఖలు రాయడం, స్నేహితులతో తరచూ ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు మాట్లాడటం. ఇలాంటి ప్రవర్తనతో అధిక ఒత్తిడి వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పు వస్తుంది. భయం, ఆందోళన, డిప్రెషన్ లాంటి లక్షణాలు పెరుగుతాయి. ఆ లక్ష్యాన్ని సాధించగలనో లేదో అందరూ అవమానిస్తారేమో, తక్కువగా చూస్తారేమో ఇతరులతో పోటీ పడలేనేమో వంటి ఆలోచనలు కొంతమందిలో ఆత్మహత్యకు దారి తీస్తాయి. ఇలా విద్యార్థుల ప్రవర్తన భిన్నంగా ఉంటే వెంటనే కౌన్సిలింగ్ కొరకు మానసిక వైద్యుల వద్దకు, సైకాలజిస్టుల వద్దకు తీసుకువెళ్లాలి. తల్లిదండ్రులు గాని, విద్యాసంస్థల్లో టీచర్లు గానీ దాన్ని గుర్తించగలిగితే చిన్నపాటి కౌన్సిలింగ్‌తో వాళ్లను మామూలుగా మార్చవచ్చు.

చదువొక్కటే జీవితం కాదు!

విద్యార్థులారా.. చావడం కాదు, బతికి సాధించాలి. చదువు ఒక్కటే జీవితం కాదు. నీకంటూ ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉంటావు. అదేమిటో తెలుసుకో. ఆత్మవిశ్వాసంతో ఆచరించిన మరుక్షణమే నీకు తిరుగే ఉండదు. లోకులు పలు కాకులై మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్లే, మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయని గట్టిగా నమ్మండి.

మేకిరి దామోదర్,

95736 66650

Tags:    

Similar News