దేశంలో ఆడపిల్లకు రక్షణ ఉందా?

దేశంలో ఆడపిల్లకు రక్షణ ఉందా?... special editorial on Attacks on women in india

Update: 2022-11-05 18:30 GMT

ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని శోకించేంతగా మారుతున్న పరిస్థితులకు కారణం ఎవ్వరు? దీనికి పితృస్వామ్య వ్యవస్థ ఓ కారణమైతే, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం. నిరాదరణ, అత్యాచారాలు, లైంగిక దాడులతో కూడిన నేటి సమాజం మరో కారణం. అత్యాచారం జరిగితే నిందితులను బోనులో నిలబెట్టాల్సిన పోలీసులు, అధికార యంత్రాంగం తగు రీతిలో స్పందించడం లేదు. ప్రజలు బయటకి వచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తప్ప చర్యలు తీసుకోని వ్యవస్థలు దేశంలో ఉండటం సిగ్గుచేటు. మహిళల సంరక్షణ కోసం చట్టాలను రూపొందించినా అవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలలో నిందితులపై లిక్కర్ ప్రభావం ఉంటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారుల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరుసలు మరచిన కామాంధులు దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. భూమి మీద మహిళ లేకపోతే సృష్టికి మనుగడే లేదు. తల్లి కడుపులో పడిన నాటి నుంచి కట్టె కాలే వరకు మహిళ తన ఒళ్లు గుల్ల చేసుకొని చేసే సేవకు, శ్రమకు, త్యాగానికి ఈ సమాజం ఏమిచ్చినా రుణం తీరదు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆడపిల్లలకు మాత్రం కనీస రక్షణ కరువైంది. మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి 'బురదలో పోసిన పన్నీరు చందంగానే' మారుతున్నాయి.

17 నిమిషాలకో అత్యాచారం

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని 'జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో' నివేదిక స్పష్టం చేస్తున్నది. 2020 తో పోల్చితే 2021లో దేశంలో మహిళలపై అత్యాచారాలు దాదాపు 20 శాతం పెరిగాయి. 2020లో 28,046 అత్యాచార కేసులు నమోదు కాగా, 2021లో 31,677 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 86 అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలో గంటకు సగటున 49 కేసులు నమోదవుతున్నాయని నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 56,083, రాజస్థాన్‌‌లో 40,738, మహారాష్ట్రలో 39,526,​వెస్ట్ బెంగాల్‌లో 35,884, ఒడిశాలో 31,352 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీ‌ఆర్‌బీ వివరించింది. 2021లో మహిళలపై నేరాల రేటులో అసోం (168.3) అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాలలో వరుసగా ఢిల్లీ (147), ఒడిశా (137), హర్యానా (119.7), తెలంగాణ (111.2) ఉన్నాయి. ఇందులో అత్యాచారం, అత్యాచారం చేసిన తర్వాత చంపడం, వరకట్నం, యాసిడ్ దాడులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, కిడ్నాప్, బలవంతపు వివాహం, మానవ అక్రమ రవాణా, ఆన్‌‌లైన్ వేధింపుల వంటి నేరాలున్నాయి.

ప్రతి ముగ్గురిలో ఒకరు బాధితులు

ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళలు 35 శాతానికి పైగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సమితి ఇంటరాజెన్సీ వర్కింగ్ గ్రూప్ తరపున డబ్ల్యూహెచ్‌ఓ 161 దేశాలలో నిర్వహించిన పరిశోధనలో ప్రతి ముగ్గురు ఆడవారిలో ఒకరు లేదా 33 నుంచి 35 శాతం మహిళలు అత్యాచారాలకు బలవుతున్నారని కనుగొన్నారు. భారతదేశంలో కూడా దాదాపు మూడింట ఒకవంతు మంది మహిళలు శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక వెల్లడించింది.

15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలో నాలుగింట ఒక వంతు వారి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా సన్నిహితులతోనో, భాగస్వామితోనో భౌతిక లేదా మానసిక లైంగిక హింసకు గురవుతున్నారు. ఆరు నుంచి ఎనిమిది శాతం మంది భాగస్వామి కాకుండా ఇతరులతో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

Also read: మహిళలంటే గౌరవం లేని పార్టీ బీజేపీ! దానికి ఇవే సాక్ష్యాలు

తెలంగాణలో కూడా

తెలంగాణలో క్రైమ్ పెరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. తెలంగాణలో నమోదైన 823 అత్యాచార కేసులలో 819 మంది బాధితులకు ఆ నిందితులు పూర్తిగా తెలుసు. 509 (61.8 శాతం) కేసులలో స్నేహితులు భాగస్వాములుగా ఉన్నారు. కేవలం నాలుగు కేసులలోనే నిందితులకు బాధితులెవరో తెలియదని నివేదిక పేర్కొంది.

2021లో తెలంగాణలో మొత్తం నేరాల సంఖ్య 1.45 లక్షలు. 2020లో 1.35 లక్షల కేసులు నమోదు కాగా, 17.951 కేసులు హైదరాబాద్ నుంచే ఉన్నాయి. గతం కంటే 10 వేల కేసులు పెరిగాయి. 4,365 మంది మహిళలపై దాడులు జరిగాయి. 620 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అత్యాచార బాధితులలో దాదాపు 99.5 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు అని ఎన్‌సీ‌ఆర్‌బీ చెబుతోంది.

ఢిల్లీలో మహా దారుణం

2020 తో పోలిస్తే 2021లో దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు 40 శాతం పెరిగాయి. దేశంలోని 19 మెట్రో నగరాలలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులలో 32.20 శాతం కేసులు ఢిల్లీలోనే నమోదవడం గమనార్హం. నిరుడు ఢిల్లీలో 13,892 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 3,948 కిడ్నాప్, భర్తల చేతిలో చిత్రహింసలకు గురైనవి 4,674, బాలికలపై రేప్ కేసులు 833 వరకు ఉన్నాయి. సగటున రోజూ ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. కట్నం వేధింపులతో మృతి చెందిన కేసులు 136 నమోదయ్యాయి. మహిళల పరువుకు భంగం కలిగించేలా దాడులకు పాల్పడిన కేసులు 2,022 నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద 1357 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 43,414 కేసులు నమోదయ్యాయి.

ముంబైలో 12.76 శాతం, బెంగళూరులో 7.2 శాతం కేసులు ఉన్నాయి.పిల్లలపై నేరాలు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతున్నాయని ఎన్‌సీ‌ఆర్‌బీ వెల్లడించింది. 2021లో పోక్సో ( లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద 53,874 కేసులు నమోదయ్యాయి. పిల్లల మీద నేరాలకు సంబంధించి 2020లో 1,28,511 కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 1,49,404కు (16.2శాతం) పెరిగింది. 2021 లైంగిక దాడి కింద 30,348 కేసులు నమోదయ్యాయి. పిల్లల కిడ్నాప్ సంబంధించి నిరుడు 67,245 కేసులు, పిల్లలు కనిపించడం లేదని 29,364 కేసులు నమోదయ్యాయి. 140 మంది చిన్నారులను అత్యాచారం చేసి చంపి వేయగా, 1,402 మంది చిన్నారులను హత్య చేశారు.

Also read: సామాజికం: జీవిత నాశిని పోర్నోగ్రఫీ

ఎవరు కారణం ?

ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని శోకించేంతగా మారుతున్న పరిస్థితులకు కారణం ఎవ్వరు? దీనికి పితృస్వామ్య వ్యవస్థ ఓ కారణమైతే, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం. నిరాదరణ, అత్యాచారాలు, లైంగిక దాడులతో కూడిన నేటి సమాజం మరో కారణం. అత్యాచారం జరిగితే నిందితులను బోనులో నిలబెట్టాల్సిన పోలీసులు, అధికార యంత్రాంగం తగు రీతిలో స్పందించడం లేదు. ప్రజలు బయటకి వచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తప్ప చర్యలు తీసుకోని వ్యవస్థలు దేశంలో ఉండటం సిగ్గుచేటు.

మహిళల సంరక్షణ కోసం చట్టాలను రూపొందించినా అవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలలో నిందితులపై లిక్కర్ ప్రభావం ఉంటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. లిక్కర్‌‌ను‌‌‌ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అశ్లీల ప్రదర్శనలు, చిత్రీకరణలు, టీవీలు, పోర్న్ సైట్లు ఇంటర్నెట్​మనిషి చెడిపోవడానికి కారణమవుతున్నాయి. వాటిని నియంత్రించాలి. విద్యా వ్యవస్థలో లింగ స్పృహను పెంచేలా మార్పులు చేయాలి. షీ టీమ్స్, హాక్​ఐ యాప్, హెల్ప్ లైన్ నంబర్ల గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి.


డా. బి. కేశవులు నేత. ఎండీ. (సైకియాట్రీ)

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Tags:    

Similar News