ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇంత వివక్షా?
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇంత వివక్షా?... So much showing discrimination in development of Uttarandhra says konatala ramakrishna
నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు, వివక్ష అనేవి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తరాంధ్రకు జరగడం అత్యంత బాధాకరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు జీవనాడి. 2014-2019 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి, టెండర్లు పిలిచి పనులు కూడా మొదలుపెట్టింది. 2019 లో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని సమస్యలని పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ రాస్తున్న లేఖ.
'నీళ్లు,నిధులు,నియామకాలు' విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు, వివక్ష అనేవి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తరాంధ్రకు జరగడం అత్యంత బాధాకరం. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నట్లు మీడియాలో పలు కథనాలు వచ్చిన విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది.ఈ వలసలకు ప్రధానకారణం స్థానికేతరుల ప్రాబల్యం పెరిగిపోవడమే. ఉద్యోగాలన్నీ స్థానికేతరులే పొందుతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం కోసం నిబద్ధతతో 371-డి ద్వారా ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే దక్కే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఆ డిక్లరేషన్‌ని పట్టించుకోవాలి
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, వారు ఏం కోరుకుంటున్నారనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రజాసంఘాలతో, అన్ని రాజకీయ పక్షాలతో త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ముందే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధిపై ఎంత ఖర్చు చేశారు, ఎంత కేటాయించారు తదితర అంశాలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, 2023-24 సం॥లకు ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 15శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నిధులు ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో కాలంగా కృషిచేస్తున్న మేధావులు ఉత్తరాంధ్ర డిక్లరేషన్ పేరిట 24 పేజీల నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున అన్నీ రాజకీయపక్షాలకు అందజేయడంతోపాటు మీడియాకు కూడా విడుదల చేశాము. ఈ నివేదికను మీరు, రాష్ట్ర మంత్రివర్గం, ప్రభుత్వ అధికారులు ఒకసారి పరిశీలించి ఇందులోని ప్రధాన అంశాలపై దృష్టిసారించి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషిచేయాలని కోరుతున్నాము.
ఈ లేఖతో పాటు 2019 ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌ను మీకు పంపుతున్నాము. ''ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు?'' అనే అంశంపై 7 జనవరి 2023 నాడు విశాఖపట్నంలో వివిధ రాజకీయ పక్షాలతో, మేధావులతో ఒక సదస్సును ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున నిర్వహించడమైనది. ఈ సదస్సులో ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల గురించి వివిధ రాజకీయపార్టీలు, మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నాం.
సాగు, తాగునీటికి కటకట
ఉత్తరాంధ్రలో మొత్తం 30 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో 16 నదులున్నాయి. ఉత్తరాంధ్రకు 207 టీఎంసీల సాగునీరు అవసరం కాగా కేవలం 100 టీఎంసీల నీరు మాత్రమే అందుతున్నది. బచావత్ కమిషన్ నివేదిక ప్రకారం భవిష్యత్ అవసరాలకు 400 ఎంజీడీల నీరు అవసరమవుతుందని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం తాగునీటికి 170 ఎంజీడిలు అవసరం కాగా కేవలం 120 ఎంజీడీలు మాత్రమే అందుబాటులో ఉండటంతో తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంచినీటి కొరత కారణంగా ఈ ప్రాంతంలోని పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అత్యధిక వర్షపాతం 1050-1200 మి.మీ దాకా ఈ ప్రాంతంలో కురుస్తున్నా ఉత్తరాంధ్ర జిల్లాలోని కోటి మంది ప్రజలు తాగునీరు, సాగునీరు సమస్యలతో అల్లాడిపోతూ, పొట్టచేత పట్టుకుని లక్షలాది మంది వలసబాట పడుతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే ఏకైక మార్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు జీవనాడి. దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి గారు 21 ఫిబ్రవరి 2009 లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, కష్టాలను పరిష్కరించడానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అతి తక్కువ ఖర్చుతో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. 2014, 2019 వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేస్తామని మీరు హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుచేయదలుచుకున్నాము.
2014-2019 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు ఈ ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి, టెండర్లు పిలిచి పనులు కూడా మొదలుపెట్టింది. 2019 లో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మీరు వెంటనే ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్టుపై సమీక్షించాలని, ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఉత్తరాంధ్రలోని 30 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందించాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున కోరుతున్నాము.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాలవాంఛ విశాఖ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఏర్పాటుతో పాటు, విశాఖ రైల్వే స్టేషన్‌కు అనుబంధంగా ఎన్‌ఎడి జంక్షన్, బిహెచ్‌విపి మధ్య శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణం. వీటిపైన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చిరకాల వాంఛను తీర్చాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు మలేరియా తదితర వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యంపై దృష్టిపెట్టాలని విమ్స్ ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి, కేజిహెచ్ ఆసుపత్రిని ఆధునీకరించాలని, కొత్త జిల్లాల ప్రకారం అన్నీ జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభించి, ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలని కోరుతున్నాము.
సమావేశం ఏర్పాటు చేయాలి..
రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. పాదయాత్ర సందర్భంగా, ఇంకా అనేక సందర్భాల్లో, మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మైనింగ్ మాఫియా దోచుకుంటుంది. లాట్రైట్ పేరిట బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. విభజన హామీల్లో భాగంగా ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం గిరిజన యూనివర్సిటీ ప్రారంభమైనా అందులో బోధించడానికి ఆచార్యులు లేరు. విద్యార్థులు కూడా కేవలం 70 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గిరిజన యూనివర్సిటీకి స్వంత క్యాంపస్, సరిపడా ఆచార్యులను నియమించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఉత్తరాంధ్రలో 350 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. సముద్రాన్ని నమ్ముకుని వేలాది మంది మత్స్యకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారికి తగిన ఉపాధి లేక మత్స్యకారులు గుజరాత్ తదితర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతాల్లో జెట్టిలు నిర్మించి, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, వారు సేకరించిన మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించి స్థానికంగా మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
2014లో రాష్ట్ర విభజన సందర్భంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్, బోలంగీర్ `కలహండి` కోరాపుట్ తరహా ప్యాకేజీని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం భిక్ష వేసినట్టు సంవత్సరానికి 50 కోట్లు చొప్పున కేటాయించింది. ఈ నిధులు కూడా వారు మంజూరు చేయడం లేదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని అమలు చేయకపోవడాన్ని ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సహజవనరులు ఇక్కడి పేదలకు చెందేలా చర్యలు చేపట్టాలి. ప్రతి పేద కుటుంబానికి కనీసం హెక్టారు భూమి అయినా ఇచ్చి, వలసల్ని నివారించాలి. అటవీ భూములు, సంపదతో పాటు ఉత్పత్తుల్ని వినియోగించుకునేలా ఆదివాసీలను వారసత్వ సంపదగా ప్రకటించాలి.
పై సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకుని మీరు వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాసంఘాలతో, వివిధ రాజకీయపక్షాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం, ఈ సమావేశంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆకాంక్షలను మీ ముందు ఉంచుతాం. మీరు వెంటనే దీనిపైన తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
కొణతాల రామకృష్ణ,
మాజీ పార్లమెంట్‌సభ్యులు,
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక
Read More...