ఈ సినిమాలూ.. గ్రామాల్లో ప్రదర్శించండి!

Update: 2023-09-09 00:00 GMT

ప్రస్తుతం తెలంగాణ కుటుంబ నేపథ్యంలో, తెలంగాణ సామాజిక జీవన శైలి నేపథ్యంలోనూ, తెలంగాణ ప్రాంతీయ భాషా శైలి నేపథ్యంలోనూ తెలుగు సినిమాలు వస్తున్నాయి.. అయితే వేణు ఎల్డండి దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా కథా నేపథ్యం పూర్తిగా తెలంగాణ కుటుంబ నేపథ్యం అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబ సన్నివేశాలతోనే రెండు గంటలకు పైగా ఉన్నటువంటి సినిమా నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో నటీనటులందరూ నటనలో సహజత్వం కనబరిచారు.

తెలంగాణలో పదేళ్ల పిల్లవాడి నుండి పండు ముసలి వరకు బుడగ జంగాలు పాడిన పాటకు, మనిషి చనిపోయాక మూడొద్దులకు, ఐదొద్దులకు, పదకొండొద్దులకు కాకి అన్నం ముట్టకపోవడం వంటి చిన్న సన్నివేశాలు అందరి హృదయాలను తాకింది. దానివలన సినిమాను తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో సర్పంచ్‌లు బాధ్యత తీసుకొని కచేరీ దగ్గర సినిమా ప్రదర్శించారు ఇది మంచి పరిణామమే.. అయితే బలగం కంటే ముందే ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమా ‘శతమానం భవతి’ కూడా కుటుంబ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా! అందులో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్ (రాజుగారి పాత్ర), జయసుధ (జానకమ్మ పాత్ర) వాళ్ళకి కలిగిన సంతానం నుండి ఒంటరిగా బతకడం అనేది అది కేవలం సినిమా వరకు మాత్రమే కాదు మానవ జీవితంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలే..

సినిమాల భావం ప్రజల్లోకి వెళ్లేందుకు..

వస్తువైనా, సినిమా అయినా, వ్యక్తి అయినా ఏదైనా కూడా విమర్శకు గురైనప్పుడు కచ్చితంగా మరో వస్తువుతో, మరో సినిమాతో, మరో వ్యక్తితో పోల్చకపోతే అది విమర్శ అనిపించుకోదు! బలగం కంటే ఆరేళ్ళు ముందే వచ్చిన సినిమా 'శతమానం భవతి' ఇంతగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది.. అలాగే కుటుంబ నేపథ్యంలోనే బలగం కంటే ఇరవై రోజుల తర్వాత విడుదలైన మరో తెలుసు సినిమా 'రంగమార్తాండ' దీనికి మూలం మరాఠీలో 'నటసామ్రాట్‌'గా విజయం అందుకున్న సినిమా! దీని రీమేక్‌కి తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. శతమానం భవతిలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు ఇందులో రమ్యకృష్ణ ప్రకాశ్ రాజ్ భార్య పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఇక్కడ శతమానం భవతి, రంగమార్తాండ రెండు సినిమాలను పోల్చి చూస్తే శతమానం భవతిలో తల్లిదండ్రులను వదిలేసి విదేశాల్లో గడుపుతున్న పిల్లలకు దూరంగా ఉండే తల్లిదండ్రుల ఆవేదన తెలిపారు.

అదే రంగమార్తాండాలో కుటుంబం ఒకే దగ్గర ఉన్నప్పటికీ నేటి జీవితాన్ని అనుసరించి ప్రతి చోటా జరుగుతున్న విధానాన్ని చిత్రించారు. నేటి కుటుంబాల్లో కోడలు ఎలా వ్యవహరిస్తుందో అనే పాత్రలో అనసూయ భరద్వాజ్, బిడ్డ కూడా ఎలా ఆలోచిస్తుందో అనే పాత్రలో శివాత్మిక రాజశేఖర్‌లతో చక్కగా చూపించారు దర్శకుడు. మరి ఇలాంటి చిత్రాలను కూడా గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో సర్పంచ్‌లు బాధ్యత తీసుకొని ప్రదర్శిస్తే ఈ సినిమాల భావం ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. కేవలం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమాలు పూర్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని కచ్చితంగా చెప్పలేము. కానీ భావితరాలు అభివృద్ధి దిశలో, ఆదర్శవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు నేటి తరం పిల్లలకు కావాల్సిన మాతృభాష, చదువు, సంస్కారం వంటివే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించగలవు. ఇలాంటి నేపథ్యంలో విడుదలైన సినిమాలను తప్పకుండా ప్రదర్శించాలి.

భవిష్యత్తు నిర్మాణం కోసం..

అలాగే తెలుగులో రిలీజైన 'సార్' సినిమా. ఇది తమిళంలో వాతి పేరుతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో నటినటులు వారి వారి పాత్రల ద్వారా విద్య గొప్పతనం గురించి, మాతృభాష విలువల గురించి, విద్య ప్రైవేటీకరణ చేయడం వల్ల నిరుపేద బిడ్డలకు, అట్టడుగు వర్గాలకు జరిగే నష్టం ఎలాంటిదో సమాజానికి తెలియజేశారు!

బంధాలతో కూడుకున్న సినిమాలు భవిష్యత్తును నిర్మించలేవు. ఆయా కుటుంబ బంధాల మధ్య చదువు ఉంటే సంస్కారం అలవడుతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో అని నిర్ధారణ చేసే ఆలోచనా శక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. సృజనాత్మకత జోడించి నూతన ఆవిష్కరణలకు దారి తీస్తుంది. ఒత్తిడి లేని విద్యను పొందటానికి ఆస్కారం ఉంటుంది. కేవలం సెంటిమెంట్ మాత్రమే మనిషిని మార్చలేదని గుర్తుంచుకోవాలి. దానికి కచ్చితంగా మాతృభాష తోడుగా ఉండాల్సిందే. 'రంగమార్తాండ' సినిమాలో తెలుగులో మాట్లాడితే ఎండలో నిలబెట్టిన సన్నివేశం బట్టి మనం గమనిస్తే.. ఇక్కడ తెలుగు కాదు చూడాల్సింది. మాతృభాషలో మాట్లాడటం తప్పు ఎలా అవుతుందని పిల్లవాడు స్వీయపరిశోధన చేసుకునే ఆలోచనా విధానం పెరుగుతుంది.

అలాగే ప్రకాశ్ రాజ్ చెప్పే కాళిదాసు, భరతుడు, భవభూతి, గుర్రం జాషువా, అనిశెట్టి ఇలా కవులను పరిచయం చేయడం ద్వారా భారతీయ సాహిత్యం గొప్పదనం తెలుసుకోవచ్చు.. చదువు ద్వారానే గౌరవ మర్యాదలు లభిస్తాయి అని సార్ సినిమాలో ధనుష్ చెప్పే డైలాగ్ అక్షర సత్యం. కాబట్టి గ్రామాల్లో నేటి యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి భవిష్యత్తు నిర్మాణం కోసం చదువు విలువ తెలుసుకోవడానికి ఇటీవలే విడుదలైన చిత్రాలు అన్నింటినీ బలగం సినిమా ప్రదర్శిస్తున్నట్లే రంగమార్తాండ, సార్, శతమానం భవతి వంటి సినిమాలను గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో ప్రదర్శిస్తే ప్రజల్లోకి ఆ విషయాలను తీసుకెళ్ళవచ్చు. అప్పుడే భావితరాలను ఆధునిక జీవనశైలిలోకి మార్చగలం, భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాదులు వేయగలం.

ఎజ్జు మల్లయ్య

తెలుగు లెక్చరర్

96528 71915

Tags:    

Similar News