September 17th: విలీనం కాదు.. విమోచనం కాదు.. ముమ్మాటికీ ప్రజా విద్రోహ దినం!

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజు మాత్రమే కాదు, ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిన రోజు. 1948 సెప్టెంబర్ 17ను

Update: 2024-09-17 01:30 GMT

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజు మాత్రమే కాదు, ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిన రోజు. 1948 సెప్టెంబర్ 17ను తెలంగాణకు విమోచన దినోత్సవం అని, భారత్‌లో విలీనమైన రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అని చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చరిత్రలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి, ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుచేసే కుట్రలు జరుగుతున్నాయి. వాస్తవ చరిత్రను వక్రీకరించి, వక్రభాష్యాలు చెప్పి నేటి తరం తెలంగాణ ప్రజల మనసులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక దినాన్ని తమ పార్టీ త్యాగాల ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. వాస్తవంగా జరిగింది ఏమిటి?

ప్రజల పూర్తి సహకారం, భాగస్వామ్యంతో జరిపిన సాయుధ పోరాటంతో హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం పెరిగింది. వారు నిజాంకు, దొరలకు ముచ్చెమటలు పట్టించారు. 1947 ఆగస్టు 15న దేశ స్వాతంత్ర ప్రకటన రావడంతో సంస్థానాలను దేశంలో విలీనం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీంతో నిజాం సంస్థానం స్వాధీనానికి ప్రభుత్వం నడుం కట్టింది. అప్పటికే భయాందోళనలో ఉన్న నిజాం ప్రభువు బెట్టు చేయడంతో పోలీస్ (సైనిక) చర్య అనివార్యమైంది. 1948 సెప్టెంబర్ 17న దేశ హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్‌తో రాజీపడి ఏడవ నిజాం తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. దీనినే రాజకీయ పార్టీలు రకరకాలుగా వ్యాఖ్యానించడం పరిపాటి అయ్యింది.

విలీనమూ లేదు.. విమోచనా జరగలేదు!

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైనట్లు కనిపించినా, అది అసంపూర్ణమే. నిజాం ప్రభువుకు తగిన గౌరవమే దక్కింది. ఆయనకు ఎలాంటి శిక్షా విధించలేదు. ఆయన అరాచకాలు కూడా కొనసాగాయి. విమోచనం జరిగింది, అనుకుంటే నిజాం ఇక్కడి నుండి పారిపోవాలి లేదంటే అతని అధికారాలు, ఆస్తులు జప్తు చేయబడాలి. చేసిన దుర్మార్గాలకు గాను శిక్ష అనుభవించాలి. కానీ అలాంటివేమి జరగలేదు. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య యథాస్థితి కొనసాగించే ఒప్పందం మాత్రమే కుదిరింది. సర్ఫేఖాస్ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఏడవ నిజాం నవాబు ప్రజలను పీడించి కూడబెట్టిన బంగారం, నగలు, వజ్రాలు ఇతర దేశాలకు స్వేచ్ఛగా తరలించబడ్డాయి. అంతేకాదు 1850 జనవరి నుండి 1956 అక్టోబర్ వరకు రాజ్‌ ప్రముఖ్‌గా రాజభవన్‌లోనే ఉండి అధికారం చలాయించారు. ఆపరేషన్ పోలో తర్వాత1971 వరకూ సంవత్సరానికి 50 లక్షలు రాజభరణంగా నిజాంకు చెల్లించారు. వీటికి పన్ను మినహాయింపు ఇచ్చారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీనిని రద్దు చేసింది.

గ్రామాలలో 1948 నాటికి ప్రజల తిరుగుబాటు పెరిగి, కమ్యూనిస్టు పార్టీ బలపడడం భారత ప్రభుత్వం గమనించింది. దీనికి తోడు దున్నే వాడిదే భూమి ప్రాతిపదికగా 10 లక్షల ఎకరాలు ప్రజల స్వాధీనం అయ్యింది. 3000 గ్రామాలలో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. దీనిని ప్రమాదంగా భావించిన భారత ప్రభుత్వం (కాంగ్రెస్ పాలకులు) నిజాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుమించి విలీనం జరగలేదు. విమోచన అంతకంటే జరగలేదు. అందుకే 1948 సెప్టెంబర్ 17లో జరిగింది ముమ్మాటికి ప్రజా విద్రోహమే.

ప్రజా విద్రోహ చర్యలు చేపట్టి..

సుదీర్ఘకాలం పోరాడి, రక్తతర్పణం చేసి ప్రజలు సాధించుకున్న హక్కులని కోల్పోయారు. స్వాధీన పరచుకున్న భూమి మళ్లీ దొరల పాలయ్యింది. రూమీ టోపీలతో గ్రామాలను వదిలి హైదరాబాద్ చేరిన దొరలు ఖద్దరు టోపీలతో వచ్చి గ్రామాలపై పెత్తనం కొనసాగించారు. ప్రజా విముక్తి కోసం ఏర్పడ్డ సంఘాలు తీవ్ర నిర్భంధాన్ని ఎదుర్కొన్నాయి. కమ్యూనిస్టు పార్టీ దళాలు భారత సైన్యం తుపాకులకు బలయ్యాయి. నిజాంపై తిరుగుబాటు చేసిన సుమారు నాలుగువేల మంది కిరాతకంగా హత్య చేయబడ్డారు. పౌర ప్రజాస్వామిక హక్కులు అడుగంటాయి. హైదరాబాద్ సంస్థానంలో నిజాం, దొరలు, రజాకార్లు చేసిన దురాగతాలపై ఎలాంటి విచారణలు జరగలేదు, ఎలాంటి శిక్షలనూ విధించలేదు. నిజాంపై తిరుగుబాటు చేసి అక్రమ నిర్బంధం పాలైన కవులు, రచయితలు, ఉద్యమకారులను జైళ్ల నుండి విడుదల చేయలేదు. ఇవన్నీ ప్రజా విద్రోహ చర్యలే కదా. అందుకే తెలంగాణకు జరిగింది ముమ్మాటికి విద్రోహమని నినదించక తప్పదు.

ఉనికే లేని పార్టీల ఆర్భాటమే జాస్తి!

సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. దీని కోసం ఈ ఉద్యమంతో ఏ సంబంధం లేని రాజకీయ పార్టీలు హడావిడి చేయడం ఆశ్చర్యం గొలిపే విషయం. ఈ సందర్భంలో నిజాంతో ఒప్పందం చేసుకున్న కేంద్రంలో ని జాతీయ ప్రభుత్వం కూడా ద్రోహంలో భాగస్వామనే చెప్పాలి. బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీల విషయానికి వస్తే ఆ ఉద్యమ సమయానికి ఈ పార్టీలు మనుగడలోనే లేవు. కానీ వీటి ఆర్భాటమే మరీ ఎక్కువగా ఉంది. చరిత్రను ఎప్పుడూ వాస్తవిక దృష్టి తోనే చూడాలే తప్ప, తమదైన దృష్టితో చూడరాదు.

- రమణాచారి

99898 63039

Tags:    

Similar News