న్యూ ట్రెండ్... వైలెన్స్‌తో సెంటిమెంట్

sentiment with violence is New Trend in Tollywood

Update: 2023-12-09 00:45 GMT

‘నిర్మాణాత్మక హింస’ అనేది హింసకు చెందిన ఒక రూపం. టాల్‌స్టాయి వంటి వారు (తెలుగులో కా.రా. మాష్టారు) కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు చాటున స్త్రీ హింసను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు వచ్చాయి. ఉద్యమాల్లో ‘హింస’ ప్రధాన భాగమయింది. ‘హింస’ గురించి సాహితీపరమైన, సామాజిక అవసరమైన చర్చ ఎందుకంటే సాహిత్యం కన్నా దృశ్యం ‘వ్యక్తిని’ త్వరగా ప్రభావితం చేస్తుందనేది సత్యం. ‘రామాయణం’ చదివి ఎవరూ రాముడు సీతలా కాలేదు. భారతం చదివి కుటుంబ పోరులు, హరిశ్చంద్రుని కథ చదివి ఎవరూ మారలేదు’ అని చాలా ఏళ్ల క్రితం ప్రముఖ నటుడు సభాముఖంగానే చెప్పాడు. కానీ‘యోగి వేమన’ సినిమా చూసి ఒకాయన ‘యోగి’ కాగలడనేది సత్యం. ‘సూపర్ మాన్’ సిరీస్ చూసి భవనాల నుండి దూకిన వారున్నారు. కొన్ని దశాబ్దాల కింద ‘రాంబో’ సీక్వెల్ చిత్రాల్లో క్లైమాక్స్ మొత్తం ‘హింస’ ఉండేది. ఆ చిత్రాలు మంచి రాబడిని తెచ్చుకున్నాయి.

కట్ చేసి.. వర్తమానానికి వస్తే..

కొంతకాలం క్రితం అనగా తొంభైల నుంచి 2000 సంవత్సరం వరకు బి. గోపాల్ వంటి దర్శకులు కథానాయకుల చేతికి గొడ్డళ్ళు ఇచ్చి విపరీతంగా జనాలను నరికించేవారు. అయితే సుమోలు గాలిలోకి ఎగరడం అనేది అదనపు ఆకర్షణగా ఉండేది. అదో రాయలసీమ ఫ్యాక్షనిజానికి బ్రాండ్‌గా మారింది. (వాస్తవాలు అవి కాకపోయినా) క్రమంగా వయలెన్స్ కూడిన సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే సినిమాలు వచ్చాయి. ‘కలిసుందాం రా…’ ‘ప్రేమంటే ఇదేరా…’ ‘సింహ’ ‘అఖండ’ ‘సింహాద్రి’ ఇలా… వీటిలో ‘హింస’కు ఒక పరిధిని నిర్ణయించుకున్నారు. ఇది కూడా ‘వర్గ’ ‘కుటుంబ’ పరమైన వర్గీకరణలోనే ఉంచేశారు. ఓ సామాజికమైన అంశాన్ని’ స్పృశిస్తూ’.. హింసకు హింసే సమాధానమనే ఆటవిక నినాదంతో ‘రాఖి’ ‘ఖడ్గం’ ‘మహాత్మా’ లాంటి చిత్రాలు వచ్చాయి. ఇవి కూడా బాగానే ‘రెవిన్యూ’ చేశాయి. (రాఖీ తప్ప). అయితే మనిషి జీవితాలలో ఇంతకన్నా ఎక్కువ హింసనే ఉందనే వాదనను ‘సమాంతరంగా’ తెరపైకి తెచ్చారు. ఇటువంటి చిత్రాలు విస్మరించేవి విషయమేమిటంటే ‘వ్యక్తిగత హింస’కు ‘వ్యవస్థాగత హింస’కు మధ్యనున్న సన్నని రేఖ. అయితే చలనచిత్రాలు ‘వసూలు’ కోసం తీస్తారు. అది వ్యాపారం. లాభనష్టాల అంశాలు ప్రధానం. డబ్బులు వస్తాయని తెలిస్తే ‘హింస’ను ఓ కమర్షియల్ పాయింట్ గా, ఓ ‘సక్సెస్ సూత్రంగా’ ప్రచారం చేస్తారు. ఇదే పంథాను ప్రేక్షకులలోని ఓ ‘సున్నితపు మనస్తత్వం కలిగిన జాతి నిర్మాణ వర్గాలు’ వృత్తిగా స్వీకరిస్తే.. సామాజిక పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవి జరిగిన దాఖలాలు కోకోల్లలు గడిచిన ఐదు దశకాలలో సినిమాలు చూసి హత్యలు చేసిన వారు, మానభంగాలు చేసిన వారు, తప్పించుకునేందుకు సినిమాలలో చూపిన సాంకేతిక మార్గాలను వినియోగించడం లేదా సీ.సీ. కెమెరాలున్నా ధైర్యంగా వాటి ముందు విజయ చిహ్నంగా వ్రేళ్ళు చూపిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. వారు దొరికిన తర్వాత ‘ఫలానా చిత్రం’లోని సన్నివేశాలు మాకు ‘ఇన్స్పిరేషనని’ చెబుతున్నారు. ఇవే అంశాలతో అక్కినేని, ఆదుర్తి కలిసి ‘సుడిగుండాల’నే గొప్ప చిత్రాన్ని నిర్మించారు.

కొత్తగా వస్తున్న చిత్రాలలో ‘హింస’ను మరో కొత్త పుంతలు త్రొక్కిస్తున్నారు. ‘స్కంధ’ అనే చిత్రంలో దాదాపు అరవై శాతం నరుక్కోవటాలే... ఒక్కడు… ఓ ప్రత్యేకమైన కత్తితో వరుసగా పది, వంద, వేయి తలలు నరికటమే. శవాలను గాలిలోకి లేపటమే.. హీరో కండబలం, గుండెబలం చూపటానికి ‘హింస’ ఒక కొలమానమై పోయింది. ఆ మధ్య ఓ చిత్రంలో కథానాయకుడు వేగంగా వస్తున్న రైలును తన చూపుడు వ్రేళ్ళును చూపి భయ పెడతాడు. అంతే రైలు ‘కీచు’మనే శబ్దంతో ఆగిపోతుంది.. మరో చిత్రంలో ‘షేర్ ఖాన్… వంద, వేయి,… పెంచుకుంటూ పోయి మనుషులను పంపు నా కత్తికి ఎరవేస్తా… బొబ్బలు పెట్టిన హీరో అలానే చేస్తాడు. వచ్చిన వారంతా తమ తలకాయలను ఆయనకిచ్చేసి అలా, అలా ప్రక్కనున్న నదిలో పడిపోతారు… అంత ‘హింస’కు కారణం.. అతని ప్రేయసి.

రాబోతున్న చిత్రాల్లోనూ..

కొద్దిరోజుల క్రితం ‘ఏనిమల్’ అనే చిత్రం విడుదలైంది. రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మోస్ట్ వైలెంట్ ఫిలింగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే 116 కోట్లు సాధించి రికార్డు సృష్టించిందని మీడియా వర్గాల కథనం. సినిమాలో అడల్ట్స్, వైలెన్స్ సన్నివేశాలు విపరీతంగా ఉన్నాయని సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. (ఎందుకు కట్స్ ఇవ్వలేదో.. వారు చెప్పరు) ఓ వర్గం ప్రేక్షకులైతే ఇందులోని ‘హింసాత్మక సంఘటనలు’ చిత్రించిన తీరును చూసి అవాక్కవుతున్నారు. పచ్చి బూతులు, నగ్న సన్నివేశాలు, గొంతులను పరాపరా కోసేయడాలు సీన్లు ఇంతగా ఉన్న చిత్రం ఈ మధ్యకాలంలో మరొకటి లేదని చెప్పవచ్చు. ఇదే అలవరుసలలో మరికొన్ని చిత్రాలు కూడా రాబోతున్నాయని ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఆ మధ్యన వచ్చిన ‘లియో’ ‘హింస’ ప్రధాన పాత్రతో ఏ పాటి విజయం సొంతం చేసుకుందో అందరూ చూశారు. భయమంటే ఏమిటో తెలియని మృగాలకు సహితం భయం నేర్పగలవాడిగా జూనియర్ ఎన్టీఆర్‌తో వస్తున్న ‘దేవర’ చెబుతుంది. ఇందులో అండర్ వాటర్ సీన్స్‌నే కాదు ప్రతీ యాక్షన్ ఎపిసోడ్ చాలా వైలెంట్‌గా ఉండబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. సూర్య నటిస్తున్న ‘కంగువా’లోనూ ఇటువంటి సన్నివేశాలు బోలెడు ఉంటాయని చెబుతున్నారు. చిత్ర సంస్థ విడుదల చేసిన అతని ‘లుక్’ చూస్తేనే శత్రువులు భయంతో పరుగులు తీసేలా ఉన్నారనిపిస్తుంది. దర్శకుడు సుకుమార్ పుష్పరాజ్ బన్వర్ సింగ్ యాక్షన్ సీన్స్ ‘పుష్ప’లో చూసిన వారికి ఇహ రెండులో ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు. ఇలా రాబోతున్న (బహుశా సంక్రాంతి బరిలో) చిత్రాల్లోని వైలెన్స్‌తో ‘సెంటిమెంట్’ ని జోడించి ఇదిగో ‘నయా ట్రెండ్’ అని ప్రచార జో(హా)రు పరిశ్రమ పెంచితే తర్వాత కాలంలో ఎలాంటి చిత్రాలు వస్తాయో ఊహించడం కష్టం కాదు. ‘ఏనిమల్’కి ‘ఏ’ ఇచ్చి తమ ‘వృత్తి ధర్మాన్ని’ నిర్వహించిన సెన్సార్ వారు కూడా పెద్దగా చేసేదేమీ ఉండదేమో?

- భమిడిపాటి గౌరీ శంకర్

94928 58395


Similar News