రాజీలెరుగని రాంరెడ్డి!

Remembering Telangana Ramreddy

Update: 2023-12-19 00:30 GMT

1958 జనవరి 27న గుండ రాంరెడ్డి తాను పనిచేస్తున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి, తన 36 ఏండ్ల వయసులో రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యోగులపై వలసపాలకుల వివక్షకు వ్యతిరేకంగా అంతటి త్యాగానికి సిద్ధపడటంతో యావత్ తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు, అప్పటినుంచి ఆయన పేరు తెలంగాణ రాంరెడ్డిగా స్థిరపడిపోయింది.

1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణ రాజ్యాన్ని బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేశారు. ఆ తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా పరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జరిగాయి. ఆ సమయంలో రాంరెడ్డి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరుగా హైదరాబాద్ నగరంలో పనిచేస్తుండేవారు. నూతన ప్రభుత్వంలో పరిపాలనా పరంగా ఆంధ్రప్రాంత నాయకులు తమ పెత్తనాన్ని నిలుపుకోవడానికి ఆంధ్రప్రాంతం నుండి వలసలను ప్రోత్సహించారు. అదే సమయంలో తెలంగాణ అధికారులను ఆంధ్రప్రాంతానికి బదిలీ చేశారు. వారి స్థానంలో వారికంటే జూనియర్స్‌ను హైదరాబాద్‌కు బదిలీపై తెచ్చుకుని ప్రమోషన్లు ఇవ్వసాగారు. దీంతో జూనియర్స్‌కి సీనియర్స్‌తో సమాన హోదాలను ఇచ్చి తమకు విధేయులుగా పనిచేయించుకోవడం మొదలెట్టినారు. పైగా ఇద్దరికీ జీతభత్యాలు ఒక్కటే! ఇలా వివిధ శాఖల్లో వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత అధికారుల దీనావస్థలను స్వయంగా చూసిన రాంరెడ్డి మనసు చలించిపోయింది. ఆవేశానికి లోనైన రాంరెడ్డి వివక్షపూరితమైన ఆంధ్రపాలకుల పరిపాలనా వ్యవస్థపై పోరాటం చేయడానికి కృతనిశ్చయుడైనాడు. కానీ పెత్తనం, అధికారాలు, పదవులు అన్ని వారి చేతుల్లోనే ఉన్నాయి. ఆ సమయంలో కనీసం ఓ ఉద్యోగ సంఘం కూడా లేదు. అంతటి బలవంతమైన వ్యవస్థపై ఒంటరి పోరాటం ఒక ఉద్యోగిగా తగదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తు కోసం రాజీనామా చేసిన రాంరెడ్డి ఏమాత్రం బాధకు లోనుకాలేదు.

నిజానికి రాంరెడ్డి పరపతి గల వ్యక్తి. ఆయన కావాలనుకుంటే తన జీతం, ప్రమోషన్ అన్ని ఒక చిటికెలో పొందగలిగే వారు. కానీ వారి దగ్గర చేయి చాచడం నచ్చలేదు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకుండా 15 మాసాలు పెండింగ్‌లో ఉంచింది. అలాగే ప్రమోషన్ ఇవ్వజూపింది. కానీ రాంరెడ్డి తపనంతా సహోద్యోగులకు జరుగుచున్న అన్యాయంపైనే కేంద్రీకృతమైంది. ఇలా సహోద్యోగుల భవితవ్యంకై పోరాట మార్గాన్ని ఎంచుకున్న రాజీనామా చేసిన ఒకే ఒక వ్యక్తి రాంరెడ్డి. అంతటి త్యాగానికి సిద్ధపడటంతో యావత్ తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు, అప్పటి నుంచి ఆయన పేరు తెలంగాణ రాంరెడ్డి స్థిరపడిపోయింది. ఉద్యోగుల్లో చైతన్యం కలిగించడానికి ఆయన జిల్లాల్లో కి వెళ్ళడం ఆరంభించారు. దానితో రాంరెడ్డి పలుకుబడి పెరిగి 1968లో జరిగిన శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగారు. అన్నీ రాజకీయ పార్టీలు అందించిన ప్రోత్సాహంతో ఆయన విజేయుడుగా నిలిచారు. ఆరు సంవత్సరాల పాటు శాసనమండలి లోపల, బయట ఆంధ్ర పాలకుల దౌర్జన్యకాండను ఎండగట్టారు. ఆయన పోరాటమంతా తెలంగాణ పూర్వవైభవాన్ని సంస్కృతిని ప్రత్యేక రాష్ట్రంలోనే చూడగలమని విశ్వసించేవారు. అదే దశలో వారి పోరాటం సాగింది.

దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఈయనకు క్లాస్‌మేట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలి సమావేశాల్లో 'ఏం రాంరెడ్డి నీకు తెలంగాణ పిచ్చి పోయినట్లు లేదే!' అన్నప్పుడు 'తెలంగాణను మీరు చూస్తారో లేదో గానీ నేను తప్పకుండా చూస్తాను' అని ధృఢమైన నమ్మకాన్ని రాంరెడ్డి తెలియజేశారు. యాదృచ్ఛికమే అయినా రాష్ట్ర అవతరణకు ముందే పీవీ గారు చనిపోయారు. కానీ రాంరెడ్డి తెలంగాణ అవతరణ చూశారు. రాంరెడ్డి 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగిన ఉద్యమంలో అన్ని బహిరంగ సభల్లోనూ ప్రసంగించారు, ఉద్యమించారు. సాధనకు తనవంతు కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించారు. తనతో పాటు పలు శాఖలలో నిజాయితీగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తును మృగ్యం చేయగల ఆంధ్ర పాలకుల దుర్నీతి విధానాలకు నిరసనగా, ముందున్న 18 సంవత్సరాల సేవా కార్యక్రమాలను లెక్కచేయకుండా, తెలంగాణ రాంరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆకృత్యాలమయమైన పాలనపై అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన తన అభిమతంగా ప్రచారం చేసిన రాంరెడ్డి చివరకు ఆ పోరాట ఫలితాన్ని కళ్ళరా చూడగలిగారు. శత వసంతాల ప్రాయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి సన్మానాన్ని స్వీకరించిన తెలంగాణ రాంరెడ్డి 2019 మే 7న స్వర్గస్తులైనారు. వారు సాగించిన పోరాటం అజరామరం, భావితరాలకు స్ఫూర్తి దాయకం.

-పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Tags:    

Similar News