జయశంకర్ సార్ ..స్ఫూర్తితో సంఘటితమవుదాం!

Remembering Kotthapalli Jayashankar on his birth anniversary

Update: 2023-08-06 00:15 GMT

స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్లు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ పరిణామ క్రమంలోనే ఆచార్య జయశంకర్ తన స్వీయ జీవితాన్ని మండించి మూడు తరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు అయ్యారు. తెలంగాణ ఎవరికోసం? వచ్చిన తెలంగాణ ఎలా ఉండాలో దిశా నిర్దేశనం చేసిన మార్గ నిర్దేశకుడు.

వచ్చిన తెలంగాణను.. అల్లకల్లోలంగా

సాధించుకున్న తెలంగాణలో ఆ వైపుగా ప్రగతిశీల ప్రయాణం చూపించాల్సిన చారిత్రక అవకాశాన్ని ఈనాటి పాలకులు పొందినారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వక్రమార్గం పట్టించి తెలంగాణను అల్లకల్లోలంగా అస్తవ్యస్తంగా మార్చివేసినారు. తమ దోపిడీ పాలనను రాకెట్ వేగంతో కొనసాగిస్తున్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గకపోగా ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ ఆత్మహత్యలు పెద్ద ఎత్తున స్వరాష్ట్రంలో చోటుచేసుకోవటం ఈ పాలనా ఫలితమే. తెలంగాణ నేలను, నీళ్లను, కాంట్రాక్టు వనరులుగా మార్చి తమ ఆశ్రితులకు పెద్ద ఎత్తున కట్టబెడుతూనే ఉన్నారు. ప్రజలు చేసిన పోరాటాలను సొంతం చేసుకొని రాజకీయ అర్హతను కూడబెట్టుకోవడానికి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఫ్యూడల్ పాలనా రీతులను పునరుద్ధరించుకున్నారు. తెలంగాణ సమాజం అభ్యుదయ పరివర్తన సాధించుకునే ప్రయత్నానికి తూట్లు పొడిచి అనేక దుర్మార్గమైన, అనైతిక పరిణామాలను తెలంగాణ సమాజం నిండా వెదజల్లుతున్నారు. ఢిల్లీని ధిక్కరించిన వారసత్వాన్ని వదిలి వారితో కుమ్మక్కైనారు.

మరోవైపు బహుళత్వ భారతదేశాన్ని అసహన సమాజంగా మార్చి వేయడం కోసం తరాలుగా పోగు చేసుకున్న మహత్తర భారతీయ భావనను కేంద్రంలో ఉన్న పాలకులు చిదిమి వేస్తున్నారు. యావత్తు దేశ నేల, నీరు, అడవులు, కార్మిక మానవ శక్తులను దేశ సర్వసంపదను తన స్వదేశీ, విదేశీ కార్పోరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూ ఇక్కడి ప్రజల ధార్మిక జీవితాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇక విద్యా, వైద్యం వంటి రంగాల నుండి ప్రభుత్వం అంచెలంచెలుగా వైదొలుగుతూ వస్తుంది. గౌతమ బుద్దుడు, ఆశోకుడు, మహాత్మా గాంధీ వంటి శాంతి కాముకులు నడయాడిన నేలపై దశాబ్దాలుగా శాంతియుతంగా జీవిస్తున్న ఆదివాసీ తెగల మధ్య ఆశాంతియుతమైన వాతావరణాన్ని సృష్టించి యుద్ధోన్మాదాన్ని తలపిస్తున్నారు. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగానే మణిపూర్ తగులబడుతుంటే ఈ దేశ ప్రధాని హాయిగా మౌనంగా ఉంటున్నారు.

జయశంకర్ సార్ చూపిన తోవలో..

ఈ పరిస్థితుల్లో దారి తప్పిన ఇరువురి పాలన విధానాలను సరి చేసుకోమన్నందుకు, పాలనా విధివిధానాలలో ప్రజలను భాగస్వామ్యం చేయమన్నందుకు, తమ హావభావాల చాటున కప్పి వేయబడిన కుయుక్తులను బయటపెట్టే ప్రయత్నం చేసిన వారిని రక్తపు మడుగులలోనూ, భయ సంస్కృతిలోనూ, మౌన లొంగుబాటులోకి పంపుతున్నారు. కానీ సమాజాన్ని చీకట్లు కమ్మేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తులు పంజా విసురుతున్నప్పుడు విద్యావంతులు మౌనంగా ఉంటే పాలకులు చేసే నేరాలకు సహకారం అందించినట్లేనని జయశంకర్ సార్ అనేకమార్లు ఉద్ఘాటించారు. విద్యావంతులు మౌనంగా ఉంటే భవిష్యత్తు సమాజాన్ని కాపాడలేమని, గతంలో చేసిన త్యాగాలకు విలువ ఉండదని, ఉద్యమ విలువలకు సమాజంలో నీడ ఉండదని తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా అంతర్గత దోపిడీ విధానాలు కొనసాగుతాయని వాటి మీద నిరంతరం పోరాటం చేయగలిగే వాచ్ డాగ్ లాంటి చైతన్యవంతమైన పౌర సమాజం తెలంగాణలో ఎల్లకాలం ఉంటుందని విశ్వసించారు. కానీ ఇక్కడ వలస దోపిడీతో పాటు అంతర్గత దోపిడీ నేడు మరింత పెరిగింది. ఈ దోపిడీ విధానాలను ఎదుర్కొనేందుకు మరింత పదునైన పోరాటాలను చేయాల్సిన అవసరం ఉన్నదని పౌర సమాజం గుర్తించాలి.

పై విషయాల వెలుగులో రాజ్యాంగబద్ధంగా ప్రయత్నించేందుకు ఎవరితోనైనా కలిసి నడిచేందుకు లేదా ఆ లక్ష్యాల వెలుగులో పనిచేసే వారిని కలుపుకోవడానికైనా, కలిసి నడవడానికైనా తెలంగాణ విద్యావంతుల వేదిక సమున్నతమైన లక్ష్యాల సాధన కోసం తన కార్యాచరణను అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది. చారిత్రక ప్రాధాన్యత వర్తమాన పోరాట గరిమగలిగిన సంస్థగా సంఘటితంగాను, సమన్వయంతోను, సమాంతరంగాను పనిచేసేందుకు జయశంకర్ సార్ చూపిన తోవలో వేదిక ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా నేడు ఆచార్య జయశంకర్ స్ఫూర్తి సదస్సును తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నిర్వహిస్తున్నది. జయశంకర్ సార్ ఆలోచనలతో ఏకీభవించే ప్రజాస్వామిక వాదులందరూ ఈ సదస్సులో భాగం అవుతూ భవిష్యత్ కార్యచరణను రూపొందించుకోవడానికి కలిసి రావాలని వేదిక ఆహ్వానం పలుకుతుంది.

(నేడు ఆచార్య జయశంకర్ జయంతి)

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

94416 61192

Tags:    

Similar News