పాలనలో చెరగని సంతకం… కాకి మాధవరావు
పాలనలో చెరగని సంతకం… కాకి మాధవరావు... remembering ex chief secretary kaki madhavarao
ఐఏఎస్ అధికారిగా పదవీవిరమణ అనంతరం ఆయనకు వచ్చిన అవకాశంతో ఆర్థికంగా ఎంతో సంపాదించవచ్చు, కానీ నీతి నిజాయితీలకు కట్టుబడి ఆ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు. రిలయన్స్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం ప్రాజెక్టులు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వాటికి ఆ మాజీ ఐ.ఎ.ఎస్ అధికారిని ఆంధ్ర ప్రదేశ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించమని కోరగా, ఆ అవకాశాన్ని ఆయన తిరస్కరించి తన ఔన్నత్యాన్ని పెంచుకున్నారు. ఆయన మరెవరో కాదు ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించి, ఐఏఎస్ అధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఎదిగిన కాకి మాధవరావు. ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక శాఖలలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన పలు కీలక నిర్ణయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 1989వ సంవత్సరంలో మాధవరావుకు పంపిన లేఖలో ఆహార, వ్యవసాయ శాఖల కార్యదర్శిగా మీరు అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు శ్లాఘనీయం అంటూ కితాబిచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఒక శాఖ కార్యదర్శికి ఈ విధమైన లేఖ పంపడం అరుదైన సంఘటన. అందునా ఎన్టీఆర్ వంటి గొప్ప నేత నుండి ప్రశంసలు అందుకోవడం మాధవరావుకు మాత్రమే సాధ్యం. తన పదవీకాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.
హైదరాబాదు నగరంలో శిల్పకళా వేదిక 'శిల్పారామం' నిర్మించడంలో ఆయన కృషి ఎంతగానో ఉన్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి)ని హైదరాబాదులో నెలకొల్పేందుకు 260 ఎకరాలను కేటాయించి ఏర్పాటు చేయడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. హైటెక్ సిటీ, హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల రూపకల్పనలోను మాధవరావు పాత్రను మనం మరువలేం. నెక్లెస్ రోడ్డు సుందరీకరణకు విరివిగా నిధులను మంజూరు చేసారు. అంతేకాక జంట నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం సర్దార్ పటేల్ రోడ్డుపై నాలుగు, నారాయణగూడ వద్ద, తార్నాక చౌరస్తా, మూసీ నదిపై ఫ్లైఓవర్లను నిర్మించే ప్రతిపాదనలను ఆమోదించారు.
హైదరాబాదులోని పటాన్ చెరు ప్రాంతంలో ఉన్న ఔషధ పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, యజమానులు, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడిన వారికి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడడంతో, అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్న మాధవరావు ఆ పరిశ్రమల కాలుష్య ప్రమాణాలు పాటించే విధంగా తాను చర్యలు తీసుకుంటానని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అంగీకారంతో పరిశ్రమలు మూత పడకుండా, కార్మికుల ఉపాధికి రక్షణగా నిలిచారు. నిజాం నవాబు ముకరంజాకు హైదరాబాదులో ఉన్న వందలాది ఎకరాల మిగులు భూముల్లో 390 ఎకరాల మిగులు భూములను అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, జాతీయ ఉద్యానవనంగా కేటాయించేందుకు మాధవరావు కృషి చేశారు. ఇది ప్రస్తుతం కాసు బ్రహ్మానందరెడ్డి (కేబిఆర్) పార్కుగా అభివృద్ధి చెందింది. అంతేగాక అఖిల భారత సర్వీసుల అధికారులకు హైదరాబాదులో ఇళ్ళ స్థలాల కేటాయింపునకు ఆయన కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడం కోసం ప్రభుత్వ, దేవాదాయ భూముల కేటాయింపు కోసం కృషి చేసారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఇతివృత్తంగా రూపొందించిన చలనచిత్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.29 లక్షల రుణాన్ని మంజూరు చేయించడమే కాక, చిత్రం విడుదలకు కూడా ఆయన కృషి చేశారు. తదనంతరం అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న ఆ సినిమా నిర్మాతను ఆదుకునేందుకు ఆ రుణాన్ని మాఫీ చేసేందుకు ఆయన కృషి చేశారు. తన కుమారుడు పనిచేస్తున్న ఒక ట్రస్టుకు సంబంధించి భూములు కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలిసి, ఏ అపవాదూ తనపై పడకూడదనే నిజాయితీతో ఆయన తన కుమారుడిని ఆ ఉద్యోగం నుండి రాజీనామా చేయించిన అరుదైన వ్యక్తిత్వం మాధవరావు సొంతం. ఒక సాధారణ వ్యవసాయ కార్మికుని కుటుంబంలో జన్మించి, గ్రామీణ నేపథ్యంలో చదివి, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ఐఏఎస్ అధికారిగా ఎంపిక కావడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మాధవరావు రాష్ట్ర చరిత్రలో ఒక చెరగని ముద్ర వేశారు. రాష్ట్ర పరిపాలనలో తనకంటూ ఒక పేజీని ఏర్పరుచుకున్నారు.
స్వతంత్ర భారత చరిత్రలో సివిల్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తున్న కీలక భూమికను మాధవరావు గుర్తు చేస్తారు. ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో అధికారుల పాత్ర ప్రాముఖ్యతను తెలిపేందుకు మాధవరావు ఒక ఉదాహరణగా నిలుస్తారు. భారతదేశంలోనే అత్యున్నత అధికారిగా కీర్తి ప్రతిష్టలు పొందిన స్వర్గీయ ఎస్.ఆర్ శంకరన్ మాధవరావు సేవలను ప్రస్తుతిస్తూ 'నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, నిరుపేదల పట్ల, అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కొరకు ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు ఎంతగానో తపన పడతారు మాధవరావు' అంటూ కితాబునిచ్చారు. సమున్నత వ్యక్తిత్వం కలిగిన మాధవరావు స్వయంగా ఆయన ఆత్మ కథను భావితరాలకు అందించేందుకు 'సంకెళ్ళను తెంచుకుంటూ... ఓ దళిత చీఫ్ సెక్రటరీ ఆత్మకథ' పుస్తకం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, భావితరాలకు ఆయన ఆత్మ కథ దిక్సూచి కావాలని కోరుకుంటున్నాను.
-నేలపూడి స్టాలిన్ బాబు
సామాజిక రాజకీయ విశ్లేషకులు,
8374669988
Also Read...