స్వార్థ చింతనతో నేను, నాది అన్న తలంపుతో సాగుతున్న మన సమాజంలో తన జీవిత సర్వస్వాన్ని సమాజ సేవకు అంకితం చేసిన దానకర్ణుడు, గాంధేయవాది త్యాగమూర్తి, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించిన సేవా తత్వరుడు, నాటి నిజాం రాజుచే నిజాం రాజ్య చంద్రుడు అని కీర్తించబడిన వర్తక శ్రేష్ఠి చందా కాంతయ్య ఆదర్శప్రాయుడు.
చందాకాంతయ్య 1904 నవంబర్ 28న వరంగల్లులో ఒక మధ్యతరగతి కుటుంబంలో చందా రత్నయ్య, జగ్గమ్మ దంపతులకు జన్మించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కాంతయ్య చదువు ప్రాథమిక విద్యతోనే ఆగిపోయింది. కుటుంబ పోషణకై చిన్న గుమాస్తాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి క్రమంగా వ్యాపార అంశాలపై అవగాహన పెంచుకున్నాడు, మేలుకువలు నేర్చుకున్నాడు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి అనతి కాలంలో వరంగల్‌లో పట్టణ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగాడు.
ఎన్నో సేవా, దాన గుణాలు..
ఆయన ఇతర వ్యాపారస్తుల వలె లాభాపేక్షతో, ధనాశతో కపట మార్గంలో వ్యాపారాన్ని నిర్వహించేవాడు కాదు. నీతి నిజాయితీలే పెట్టుబడిగా భావిస్తూ ధర్మబద్ధంగా వ్యాపారాన్ని నిర్వర్తించేవాడు వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంలో చాలా భాగం దానధర్మాలకు, సమాజ సేవకు వినియోగించేవాడు. చందాకాంతయ్య భార్య పేరు రోహిణమ్మ. వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. త్యాగంలోనూ దాన గుణంలోనూ రోహిణమ్మ చంద్రునికి తగిన ఇల్లాలే. చందాకాంతయ్య దంపతులిరువురికి దేశభక్తి స్వాతంత్ర్య కాంక్ష,గాంధీ పై అభిమానం మెండుగా ఉండేవి.
చందాకాంతయ్య సేవా,దాన గుణాలను తెలిపే సంఘటనలు తన జీవిత చరిత్రలో కోకొల్లలు. పెద్ద కూతురు పుడుతున్న సమయంలో తన భార్య ప్రసవ వేదన పడుతుంటే ఆమెను వరంగల్ లోని అప్పటి నిజాం సర్కారియా దవాఖానలో చేర్పించాడు. కానీ అక్కడ గర్భిణీ స్త్రీల వైద్యం కొరకు సరైన సదుపాయాలు లేవు. వసతుల లేమి కారణంగా గర్భిణీ స్త్రీలు ప్రసావేదనతో ఎంతో బాధపడుతుంటే చూసి చలించిపోయిన కాంతయ్య రెండు జనరల్ వార్డులు కట్టించడమే కాకుండా డాక్టర్లు నర్సుల కొరకు వసతిగృహాలు(క్వార్టర్లు) నిర్మింపజేశాడు. అంతేకాకుండా వైద్య పరికరాలు కూడా సమకూర్చాడు నిజాం సర్కారియా దవాఖానాకు కొత్తరూపునిచ్చాడు. కాంతయ్య మరణాంతరం అప్పటి రాష్ట్రమంత్రిగా ఉన్న పీ.వీ.నరసింహారావు గారు ఆ దవాఖానకు చందా కాంతయ్య పేరు పెట్టడం జరిగింది. అప్పటినుండి అది చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్‌గా ప్రసిద్ధి పొందింది.
తెలుగు భాష పాఠశాల కోసం..
నిజాం పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. తెలుగువారు చదువుకోవడానికి తెలుగు మాధ్యమం పాఠశాలలు లేవు. ఉర్దూ మీడియం పాఠశాలలే ఉండేవి. మెజార్టీ శాతం ఉన్న తెలుగు వాళ్ళు తమ భాషను కాదని ఉర్దూలో విద్యను అభ్యసించే దుస్థితి ఉండేది. తెలుగు భాషాభిమాని అయిన చందా కాంతయ్య ఈ దుస్థితిని చూడలేక కాళోజీ సోదరులతో పాటు మరికొంతమంది పెద్దలతో ఒక సమావేశం నిర్వహించాడు. విద్యాసంస్థను ప్రారంభించాలంటే ఆర్థిక భారం అని అందువల్ల కొంత కాలం వేచి చూద్దామని సమావేశ పెద్దలు మాట్లాడుతుండగానే, చందాకాంతయ్య 50 వేల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చాడు. ఆ విద్యాసంస్థల్లో తెలుగు బోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పండితుల ఉపన్యాస సభలు నిర్వహించబడేవి ఈ విద్యాసంస్థల నిర్వహణకు ఆర్థిక ఇబ్బంది రాకూడదని భావించిన చందా కాంతయ్య తన రైస్ మిల్లులోని 3 లక్షల రూపాయలు విలువైన స్థిరాస్తిని ఆంధ్ర విద్యా వర్దిని సంఘం పేరుతో రిజిస్టర్ చేయించాడు.
పిల్లలకు విద్యతో పాటు ధార్మిక చింతన పెంపునకై భోగేశ్వరాలయ ప్రాంగణంలో పాఠశాలను నడిపేవాడు పాఠశాలకు వచ్చే ఆదాయంతో భోగేశ్వర దేవాలయంలో నిత్య దూప, దీప నైవేద్యాలకు లోటు లేకుండా చేసేవాడు. శిధిలమైన దేవాలయాలను పునరుద్ధరించి వాటిలో ప్రార్థనా మందిరాలు, సభా భవనాలు నిర్మించాడు. ప్రజలతో కలిసి ధార్మిక యాత్రలు నిర్వహించేవాడు. ఆ ఖర్చంతా తానే భరించేవాడు.
ఎందరికో ఆర్థిక చేయూతనిచ్చినా..
చందా కాంతయ్య తన సంపాదనలో చాలా భాగం పేదల పెండిండ్లకు, వారింట్లో జరిగే ఇతర శుభకార్యాలకు ఖర్చు చేసేవాడు. వ్యాపారంలో ఆరోజు వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు అవసరాలకు ఖర్చు పెట్టేవాడు. ఆ విధంగా సంపాదించిన ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడం వల్ల సరైన సమయంలో కూతురుకు పెళ్లి చేయలేకపోయాడు, కొడుకుకు మెడికల్ కోర్సులో సీటు వచ్చినా, డబ్బు కట్టలేక వదిలేశాడు. ఎందరికో ఆర్థిక చేయూతనిచ్చిన చందా కాంతయ్య అంతగా తన కుటుంబానికి ఏమి చేసుకోలేకపోయాడు. చందా కాంతయ్య దానగుణం తెలిసిన కొందరు పెద్దలు చందాలు వేసుకొని చందా కాంతయ్య కొడుకును మెడిసిన్ చదివించారు.
చందా కాంతయ్య వాసవి గ్రంథాలయాన్ని స్థాపించారు. పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా కాంతయ్య క్రమం తప్పకుండా విరాళం అందజేసేవాడు. చందా కాంతయ్య కోరుకుంటే రాజకీయ అధికారం లభించేది. కానీ రాజకీయ అధికారం కోసమో, పేరు ప్రతిష్టల కోసమో కాంతయ్య దానధర్మాలు సామాజిక సేవ చేయలేరు. దేశభక్తితో, మానవత్వంతో జీవిత చరమాంకం వరకు తనకున్న దానిలోనే ఇతరులకు దానం చేస్తూ సహాయం అందిస్తూ వచ్చాడు. యజ్ఞయాగాదులు,అన్నదానాలు, చెరువులు తవ్వించడాలు, తీర్థయాత్రలు,విద్వద్గోష్ఠులు, వేదాంత సభలు నిర్వహించిన కాంతయ్య 1967 ఆగస్టు 26న మరణించాడు.
(నేడు చందా కాంతయ్య జయంతి)
-సుధాకర్.ఏ.వి
అదనపు ప్రధాన కార్యదర్శి
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్
9000674747