రాహుల్ పరిణితి, మోడీకి అసలైన సవాల్..!
మొన్నటి వరకు రాహుల్‌ను పప్పుగా భావించిన బీజేపీకి ఒక్కసారిగా విస్మయం కలిగేలా తన వాగ్ధాటితో పార్లమెంట్‌లో అదరగొట్టారు. జూలు విదిల్చిన సింహాన్ని
మొన్నటి వరకు రాహుల్‌ను పప్పుగా భావించిన బీజేపీకి ఒక్కసారిగా విస్మయం కలిగేలా తన వాగ్ధాటితో పార్లమెంట్‌లో అదరగొట్టారు. 'జూలు విదిల్చిన సింహాన్ని' తలపించారు. గతంలోని తన బలహీనతలను రాహుల్ అధిగమించి ప్రతిపక్ష నేతగా పరిణితి సాధించారు. ఆయన మాటల శైలిలో, భావ వ్యక్తీకరణ రీతిలో స్పష్టమైన ప్రగతి కనిపించింది.
నరేంద్ర మోడీ మూడోసారి పదవి చేపట్టిన అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మోడీ మొహంలో గతంలోని వర్చస్సు మసకబారింది. మాటల్లో వాడీ, వేడి, పదును తగ్గింది. పైగా ఆయన మాటలు హేతు రహితంగా, పేలవంగా ఉన్నాయి. ఆయనలో మునుపటి ఉత్సాహం, ఊపూ లేదు. మోడీ గెలుపు అంచనాలు, భారీ టార్గెట్ ఊహలు గతులు తప్పాయి. గోదీ మీడియా కల్పిత జోస్యాలు, విజయోత్సాహం, కృత్రిమ హైపులు, ఆర్భాటపు ప్రకటనల రంగులు వెలిసిపోయాయి.
మూగబోయిన మోడీ ఇండియా కూటమిలో ఉత్సాహం
ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ విజృంభణతో మోడీ కంఠం మూగబోయింది. ఆయన మాట్లాడుతున్నంత సేపూ మోడీ కళ్లల్లో ఏదో కసి, ఉక్రోషం, సభలో అసహనంతో ఊగిపోవడం కనిపించింది. ఆయన అరుదుగా నవ్వుతారు. కానీ అందులోనూ సహజత్వం కనిపించదు. ఆయన మౌనంగా ఉన్నా ఆయనలో దాగి ఉన్న అశాంతి, విసుగు, అసహనం ఇట్టే ఇతరులకు తెలిసిపోతుంది. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని పెద్దలు అంటారేమో.
ప్రస్తుత సభలో 'ఇండియా' కూటమిలో ఉన్న ఐక్యత, ఉత్సాహం ద్విగుణీకృతం అయినట్లు కనిపించింది. వారి ఘాటైన సూటి విమర్శలు, లేవనెత్తిన నిత్య ప్రజా జీవన సమస్యలు బీజేపీ నేతలను కలవరపెట్టాయి. కాంగ్రెస్ (భారత్ కూటమి)లో విపక్షంగా గత పదేళ్లలో కనిపించని జవం, జీవం ఉరకలెత్తాయి. లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయా! ప్రజలలో విపక్షాల పట్ల ఆశలు, అంచనాలు చిగుళ్లు తొడిగాయి.
వాగ్ధాటితో అదరగొట్టిన రాహుల్
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మోడీ, యోగి, అమిత్ షా 'రాజకీయ పోకడల హిందుత్వ సిద్ధాంతంలో గుట్టును విప్పి చెప్పారు. దానిలో హింస, నఫరత్ మర్మాన్ని దేశ ప్రజలకు బహిర్గత పరిచారు. అసలు హిందూ మతం శాంతికి, విశ్వ కల్యాణానికి, సత్యానికి, పేమకు, పరమత సహనానికి, 'అహింస'కు ప్రతిరూపం అని, హిందూ మతానికి...బీజేపీ 'హిందుత్వానికి సంబంధం లేదనీ, బీజేపీ, ఆరెస్సెస్ హిందూ మతానికి ప్రతీకలు కాదని స్పష్టంగా లోక్‌సభలో ఎలుగెత్తి చాటారు. మోడీ, యోగి, అమిత్ షా, హిందూ మతానికి ప్రతీకలు కారనీ, వారిని హిందూ మతోద్ధారకులుగా చెప్పరాదని లోకానికి చాటారు. రాహుల్ తొలి ప్రసంగంలోనే అనూహ్యంగా బీజేపీ మత రాజకీయాలపై బలమైన పంజా విసరడంతో ప్రజల్లో బీజేపీ మతమౌడ్యంపై ఏవగింపు కలిగింది. గత పదేళ్లలో భారత ప్రజల్లో మతం పేరుతో విభజన విషబీజాలు నాటింది. తరతరాల భావ సమైక్యకతకు, పరమత సహన భావనకు విఘాతం సృష్టించింది.
గోదీ మీడియాను విశ్వసించక..
బీజేపీ ప్రతి చిన్న విషయాన్ని మతంతో ముడిపెట్టింది. మైనార్టీ మతస్తులను హిందువులు ద్వేషించేలా విస్తృతంగా బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. అందుకే రాహుల్ బీజేపీ మత ఎత్తుగడకు చెక్ పెట్టేలా సభలో ఘాటుగా విమర్శించారు. గోదీ మీడియా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి బీజేపీకి ఎన్నికల్లో విజయానికి కృషి చేసినా.. ప్రజలు ఈ కుతంత్రాలను అర్థం చేసుకొని ఎన్డీఏకి బ్రేకులు వేశారు. మోదీకి సంపూర్ణ మెజార్టీని తిరస్కరించారు. ఆరెస్సెస్ నేత భగవత్ మొన్నటి ఉపన్యాసంలో సూచనలు, అధికార పత్రిక 'పాంచజన్యం'లో వ్యాసాల సారం మోడీ ప్రవర్తనలో, పార్టీ విధానాలలో మార్పు తెస్తుందా? లేదా అనేది వేచి చూడాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496