అవమానాల పాలవుతున్న అడ్డా కూలీలు

Problems of Adda Coolies

Update: 2023-07-25 22:45 GMT

మేము నిరంతరం పనిచేస్తేనే బతుకు బండిని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళం. మేము ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ జాగ వద్ద అడ్డా కూలీలుగా అవమానాలకు గురవుతున్నాము. గ్రామ, పట్టణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలుగా, దళితులుగా, గిరిజనులుగా, ఆదివాసులుగా, బహుజనలుగా పొట్టకూటి కోసం పొద్దు పొద్దుగాల ఒక బాక్సులో గొడ్డు కారం, బుక్కెడు బువ్వ వేసుకుని ఓ అడ్డా వద్దకు పోయి నిలబడి పని కోసం ఎదురు చూస్తూ చూస్తూ కాళ్లు నొప్పులు రాగా, చూసి చూసి కళ్లు చెదిరి పోగా ఆ రోజు పని దొరుకుతుందో లేదో అన్న భయంతో ఇంటి నుంచి బయలుదేరి పని దొరకకపోతే కన్నీటితో ఇంటికి తిరిగి వెళ్లే అడ్డాకూలీలం. ప్రతిచోట కొంతమంది వ్యక్తులు అడ్డాకూలీలు, అడ్డా కూలీలు అంటూ అవమానపరుస్తున్నారే కానీ పని కోసం ఉపాధిని వెతుక్కునే పనిలో అడ్డ మీద వందలాది మంది చింపిరి జుట్టుతో మాసిన అంగి లాగుతో జీవనం కొనసాగించడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అభివృద్ధి చెందుతున్న భారత్ అని చెప్పుకుంటున్న నేటి సమాజంలో ఇంకా అడ్డా కూలీలు ఎందుకు ఉన్నారన్న ఆలోచన మాత్రం ఎవరికీ లేదు.

ఇన్నాళ్లు కష్టపడ్డా..

తెల్ల చొక్కా వేసుకొని బైక్ పై, కారుపై వచ్చిన వ్యక్తుల వద్దకు వందలాది కూలీలు సార్ పని ఉందా ..సార్ పని ఉందా ఏదైనా చేస్తాం, వస్తాం మీ వద్దకు అంటూ బతిమిలాడుకుని పనికి వెళ్లే పరిస్థితులు కండ్ల ముందు కదలాడుతున్నాయి. కుటుంబాన్ని పోషించడానికి ఆ కష్టజీవులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. సమాజంలో నేటికీ లక్షలాదిమంది మూడు పూటల బువ్వ కోసం ముప్పుతిప్పలు పడుతూ, బతుకుతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుందా లేదా అన్న చర్చ పక్కన పెడితే శ్రమ కోసం పాకులాడే పనిలోనే శ్రామికుడు నిమగ్నమైపోయినప్పుడు మూడు పూటలా తిండి కోసం తాను పడుతున్న నరకయాతనను ఈ పాలకులు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అడ్డ కూలీల వద్ద వారికి కనీసం మౌలిక సదుపాయాలు షెడ్, మంచినీరు మరుగుదొడ్ల సౌకర్యం ఈ పాలకులు కల్పించడం లేదు.. అభివృద్ధిలో అంతా దూసుకుపోతున్నాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వాలు‌‌, ఉదయం నుంచి ఏదో ఒక చోట వేలాది మంది కూలీలు అడ్డా వద్ద పని కోసం ఆరాటం పడుతున్నారంటే ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఒక్కసారి అయినా సమీక్షించుకోవాలి. ఇన్నాళ్లు కష్టపడ్డా ఏటికి లేదు కాటికి లేదు అని మనసులోని బాధను దిగమింగుతూ తమ కన్న పిల్లల కోసం చెమటను చిందిస్తూ పదును పెట్టిన గడ్డపారతో గొడ్డలితో కష్టపడుతున్న శ్రమజీవుల కష్టాలను ఈ పాలకులు నేటికీ తీర్చలేని పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. నిరుపేద కుటుంబాలు మనుషులుగా తల ఎత్తుకొని బతికినప్పుడు కదా అభివృద్ధి అంటే!

పాలకుల తీరును అర్థం చేసుకుంటూ..

స్వాతంత్ర్య భారతదేశంలో నేటికీ 80% మంది అభివృద్ధికి నోచుకోలేదంటే మన దేశం కార్పొరేట్ సంపన్నుల అభివృద్ధిలో ఉందా? పేదవాడి అభివృద్ధిలో ముందుకు వెళుతోందా అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం యువతపై ఉంది. పేదరికం నుంచి బయటపడేందుకు పాలకులు ఏమాత్రం సహకరించని పరిస్థితులు దాపరించి ఉన్న స్థితిగతుల్లో ప్రతి పౌరుడు కనీసం చైతన్యవంతంతో నైనా తమ హక్కుల సాధన కోసం తాము తాముగా బతకలేని పరిస్థితుల్లో ఈ దోపిడీ పాలకులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సందర్భాల్లో అమానవీయంగా కొనసాగిస్తున్న తీరును మనం ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి. అభివృద్ధికి సంక్షేమ పథకాలు అంటూ తాత్కాలికంగా చేతులు దులుపుకుంటున్నారు సంక్షేమ పథకాలతో పెద్ద ప్రయోజనం లేదు.. మనుషులు అభివృద్ధి చెందకుండా సంక్షేమ పథకాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? అడ్డ కూలీలు, కార్మికులు శ్రామికులు బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై ప్రజలను చైతన్యవంతం చేస్తూ మనం చైతన్యవంతం అవుదాం.

వి.గోపీనాథ్

సామాజిక కార్యకర్త

9666800045

Tags:    

Similar News