పాలస్తీనా ప్రతిఘటనా చలనం
దుఃఖపు క్రూరత్వం ప్రేరేపించిన
పాలస్తీనా పిచ్చి
దెబ్బతిన్న ఆత్మగౌరవపు ఎదపై కన్నీళ్ళు
గొంతులో దిగ్గొట్టిన మేకులు
చేతినిండా పులుముకున్న రక్తం
తన శవాలు, తన హంతకులు,
తన సమాధులు తన కవచాలు
తన కాళ్ళు, తన అర చేతులు, తన నోరు
అవును ఇదే.. ఇదే పిచ్చి ధోరణి
అనాథ నేలకు చెందినవాడు
ఒక మెరుపు దాడి, నింద లేకుండా,
నిస్సహాయంగా ఈ ప్రపంచపు
వాకిలి నుంచి బహిష్కృతుడు
చీకటి రాత్రి కుట్రలో శత్రువుల ముట్టడి
స్నేహితుల మధ్య ఒంటరిగా
నిర్భయంగా పోరాడుతున్నాడు
శత్రుదెబ్బలను ఎదుర్కొంటున్నాడు
ఆత్మీయతను కూడా..
గాయపడిన శిరస్సు నుంచి
ఎగజిమ్ముతున్న రక్తం ఎగజిమ్ముతోంది
ఈ ప్రపంచ హృదయానికి
అతని హృదయం ఏం చెపుతోందో ఎవరికి తెలుసు
చివరికి అతని తల రెండు ముక్కలైంది
అతని కొమ్ముచెంబు ముక్కలు ముక్కలై
చెల్లాచెదరైపోయింది
ఆహ్..
ఈ విప్లవ యుగంలో
ప్రతి నిశ్శబ్దపు రాత్రి ఒక భారం
ముళ్ళపైన, తిట్లపైన
భద్రమైన ఇళ్ళ నుంచి పంపిస్తున్నారు
ఎవరి తల నుంచో బొట్టు బొట్టుగా
జారుతున్న అలికిడి
దుఃఖపు వీరత్వాలు
పాలస్తీనా పిచ్చి వైపు నడిపిస్తున్నాయి
(పాకిస్తానీ ఉర్దూ కవయిత్రి ఫెహ్ మిదా రియాజ్ రాసిన ఈ కవితను బెంగళూరుకు చెందిన కవయిత్రి పూర్ణా స్వామి ఉర్దూ నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ అనువాదం జవాద్ మెమోరియల్ అవార్డు పొందింది.)
- అనుసృజన
రాఘవశర్మ