గాజా బాలుని పిలుపు

poem on gaza incident

Update: 2023-11-21 23:15 GMT

పన్నెండేళ్ల పాలస్తీనా బాలుడు ఎం సి అబ్దుల్, జూన్ 2021లో గారీ మెక్ కార్తీ, సియాన్ హెర్న్ అనే మరో ఇద్దరితో కలిసి రాసుకుని పాడిన పాట ఇది. ఏడు దశాబ్దాలుగా దుర్మార్గపు ఇజ్రాయిల్ దురాక్రమణకు గురైన పాలస్తీనా వేదన, ఆక్రోశం, ఆగ్రహం కలగలిసిన పాట ఇది. గాజా చుట్టూ ఇజ్రాయిల్ కట్టిన గోడ వెనుక ఖైదీలైన ఇరవై లక్షల ప్రజల సామూహిక వేదన ఇది. దీన్ని అబ్దుల్ రాప్ పద్ధతిలో పాడి, విధ్వంసమైన పాలస్తీనా ఇళ్ల శిథిలాల నేపథ్యంలో వీడియో చేసి యూట్యూబ్‌లో ఉంచాడు.

ఇవాళ హమాస్ దాడి నేపథ్యంలో, ఆ దాడిని సాకుగా తీసుకుని, పూర్తిగా గాజాని దురాక్రమించి, పాలస్తీనా ప్రజలకు ఒక దేశం, గజం నేల లేకుండా చేయడానికి ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణ హోమం, చేస్తున్న యుద్ధం, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతున్న లక్షలాది పాలస్తీనా ప్రజల హాహాకారాలు, మానవ హననాల నేపథ్యంలో ఇంకా బతికున్నాడో లేదో తెలియని అబ్దుల్ పాట, అతని ఆత్మస్థైర్యం మనల్ని కుదిపివేస్తుంది.

నేను అలసిసొలసిపోయా!

రాత్రంతా నిద్రపోలా!

నిద్రపోతే బాంబులు పిడుగులు

అదంతా ఒక పీడకల!

అమాయక బాలల్ని అమరులుగా చేసే

క్రూరులుగా మీరు ఎలా తయారయ్యారు

బాంబు ఎక్కడ ఎప్పుడు పడుతుందోనని

నక్కి కూర్చున్నా నా గదిలో!

దయ్యం పట్టినట్లు వూగిపోతున్నాయి ఇళ్ళు!

నా చిన్ని తమ్ముడిని రక్షించాలని నా యత్నం!

అణచబడ్డవాడి కోర్కె కంటే బలమైనదేమీ లేదు.

ఎదురుదాడి చేస్తా శత్రువుపై నా పాటలతో, కవితలతో!

పాలస్తీనాను ముక్క చెక్కలు చేస్తున్న కాలంలో జీవిస్తున్నా

నా తలపై మబ్బుల్లో దాక్కుని వేలాడుతున్నాయి అవేమిటి

మాకు రొట్టె ముక్క కోసం బయటకు వెళ్ళి

ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు నాన్న!

నా 12 వ యేట ఇది నాలుగొవ యుద్ధం!

మొద్దుబారిపోయినా! భయమే లేదు నాకు!

క్షేమంగా ఉండటానికి చేసేదేమీ లేదు

ఈ ఇల్లే నా సమాధి ఐనా భయపడని ధీరుణ్ణి నేను....

ఇక్కడున్న 20 లక్షల ఖైదీల స్వేచ్ఛ కోరుతున్నా ...

గోడలు ప్రతిధ్వనించేలా నినదించినా మార్పు లేనేలేదు.

ఇదీ ఆక్రమిత ప్రాంతంలో జీవితం!

మా తల్లులు విలపిస్తున్నారు భయంతో,

దుఃఖంతో వీధుల్లోని శవాలపై కప్పిన శ్వేత వస్త్రాలు!

భవనాలన్నీ బూడిదై పోతున్నా సరే

ఉక్కు గుండె నాది, కోలుకోడానికి పట్టదులే ఎంతోసేపు

జీవేచ్చ పోదు ఎన్నడూ మాలో!

మా పెద్దమ్మ ఇల్లూ ధ్వంసమైంది

ఇంటిపై వేసిన బాంబు గాయపరచిందామెను

ఆ రాత్రి పడింది బాంబు ఎగురుతూ వచ్చి

ఆమె బతుకే బ్రద్దలైంది కానీ ఇంకా ప్రాణాలతోనే వుంది!

నా చెల్లి నిద్రపోలేకపోతోంది

ఆమె ఏడుపు ఆపాలని విఫలయత్నం చేస్తున్నా!

అబద్ధాలు చెప్పా - ఆ పేలుళ్ళన్నీ టపాసులవని!

జాలీ దయా లేని హృదయ విదారక పరిస్థితి ఇది.

కరెంటు లేక, నీళ్ళు లేక చీకట్లో మగ్గుతున్నాం మేమంతా

వారేమో టవర్స్ ని కూల్చేస్తున్నారు!

కానీ నా కలానికున్న బలాన్ని మాత్రం

తొలగించలేరెవరూ!

నేను రాయడం మొదలెడితే ఆపలేరెవరూ నన్ను!

మైక్రోఫోన్లో మాట్లాడటమే తప్పించుకునే ఏకైక మార్గం!

అలా మాత్రమే నా భావాలు చెప్పగలను -

నిద్ర సమయంలో ఫైటర్ విమానం ఎగరడం విచిత్రం!

తెలుసు దానికి నగరం మొత్తాన్ని

అల్లకల్లోలం చేయగలనని....

ఒక్క బటన్ నొక్కితే చాలు ఒక్క క్షణంలో

కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి.

నేను కోరుతున్నా స్వేచ్ఛను

ఇక్కడ వుంటున్న 20 లక్షల ఖైదీలకు....

గోడలు పగలేలా అరుస్తున్నా మార్పేమీ లేదు

ఈ ప్రాంతపు ఇరవై లక్షల మంది

స్వేచ్ఛను కోరుతున్నా! కోరుతున్నా!

(ఇంగ్లీష్ వీడియో నుండి అనువాదం)

-కొత్తపల్లి రవిబాబు

Tags:    

Similar News