దేశదిమ్మరి గమ్యం!

Poem

Update: 2024-03-19 00:30 GMT

నా అంతర్లోక మృత్తికలలో... నేనో ప్రవాహిని

నిత్యం ధమనులు, సిరలలో ప్రవహిస్తూ

నాలోని యునైటెడ్ నేషన్స్‌ని

నేను స్పర్శిస్తూ ఉంటాను!

నా అంతర్దేహ మేఘాలలో నేనో సంచారిని

నిరతం నాలోని నాడుల ద్వారా సంచరిస్తూ

నాలోని మనో దేశాలను

నేను సందర్శిస్తుంటాను

నా అంతః శరీరాకాశంలో నేనో ప్రవాసిని

నిరంతరం నాలోని ఎండోక్రైన్ గ్లాండ్స్‌లో వసిస్తూ

నాలోని ఉద్వేగ శీతోష్ణ స్థితులను

అనుభూతిస్తుంటాను

నా అంతర్నిర్మాణ పర్వతాలలో నేనో పర్యాటకున్ని

సతతం నన్ను నిలిపే అస్థి పంజరపు

హైవేల వెంట ప్రయాణిస్తూ

కండరాల కొండలను తడుముతూ ఉంటాను

నా అంతర్నాడీ అరణ్యాలలో నేనో చంచలున్ని

అనుక్షణం వెన్నుపూస కీకారణ్యంలో

కాట కలిసి తిరుగుతుంటాను

నా అంతరాత్మలో నేనో దేశదిమ్మరిని

ప్రతీక్షణం నా ఆత్మ సాగరంలో ఈదులాడుతూ

జీవన తీరాల వైపు అడుగులేస్తుంటాను...

నాకు గమ్యం నైమిత్తికం – గమనమే ప్రామాణికం...

చలనం నా అస్తిత్వం - జ్వలనం నా వ్యక్తిత్వం!!

అవును,

నేనో ప్రవాహిని, సంచారిని,

ప్రవాసిని, పర్యాటకున్ని...

నేనో చంచలున్ని... దేశదిమ్మరిని!

డాక్టర్ మామిడి హరికృష్ణ

80080 05231

Tags:    

Similar News