ఏ చేతిలో లేనిది

poem

Update: 2023-08-01 21:45 GMT

ఒక్కొక్క ఋతువు

రావడం పోవడం

నిర్ధిష్ట కాలక్రమంలోనే

ఆనందనిలయ ప్రకృతిలో

చినుకులు రాలినవా

చిట్టడవి పూల వాసనలో

పుడమి పులకరింత

జరంత వానతడి

కొండంత మనసును తడిమింది

చేన్లన్నీ పొట్టకొచ్చె

చెరువు పారిన పొలాల

దంచికొట్టే వాన

వరదైంది జలఖడ్గం దూసి

పల్లే పట్నం బతుకు బరువైంది

మనిషి మనిషిగా కానరాక

చలి ఎంతైనా

ఎండ ఎలాగైనా

తట్టుకోవచ్చు భరించోచ్చు కానీ

గీ వానేంది!?

ఏళాపాళా లేని మద్దెల దరువులా

నింగీ నేలను కలిపే ఎరిపిలేని ధారై

వాన రాకడకూ పానం పోకడకూ

ఒక మహత్తర సామ్యం చూపు

ఎవరికీ తెలియదు

ఎవరి చేతిలో లేనిది

లోకరీతి వేదాంతం తెలుసా మనసా!

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

9849305871.

Tags:    

Similar News