పదునెక్కుతున్న జనసేనాని!

Pawan Kalyan is Perfecting himself as a Politician

Update: 2023-07-26 00:00 GMT
పదునెక్కుతున్న జనసేనాని!
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. తనలోని నిఖార్సయిన నాయకుడ్ని సరికొత్తగా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. రెండోవిడత యాత్రలో మరింత దూకుడుగానే వ్యహరించారు. ఈ సారి ప్రభుత్వంపై విమర్శలు సకారాత్మకంగా చేసి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టారు. వ్యవస్దలోని లోపాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఆయన వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేశారు. వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

అధికార పార్టీని ప్రశ్నిస్తూ..

ప్రశ్నించిన తీరులో కాస్త ఆక్షేపణ వున్నా నిజాన్ని వ్యవస్థలోని లోపాలను తేటతెల్లం చేయడం వల్ల పవన్ కల్యాణ్ పై కేసుల పరంపరతో పక్కదారి పట్టించే పనిలో అధికార పార్టీ వందిమాగధులు నిమగ్నమైనారు. కాక రేపిన కాగ్ నివేదికాంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిలో లోపాలను కాగ్‌ నివేదిక వెల్లడించిందన్నారు. ఏపీ ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు నగదును ఎవరి కోసం ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఏదో మేలు చేశామంటూ ప్రతిరోజు చెప్పుకునే వైసీపీ మంత్రులు, నేతలు, సీఎం జగన్.. 1,18,000 కోట్ల అప్పు గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రజలపై చేసిన అప్పులకు సీఎం జగన్‌ ప్రభుత్వం, మంత్రివర్గం జవాబు చెప్పాల్సిందే అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పదోవంతుకు పైగా వైసీపీ సర్కార్ అప్పులు తీసుకొచ్చిందని, వాటిని నిజంగానే ప్రజలకు ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవని పవన్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం దారి మళ్ళిస్తున్న నిధుల గురించి ప్రశ్నించడం కాగ్ నివేదిక వివరాలతో సహా నిలదీయటం లాంటి వాటిని పరిశీలిస్తే ఈ సారి జనసేనాని బాగానే కసరత్తు చేసినట్లు అవగతమవుతోంది. వారాహి యాత్ర కోసం చేసిన కృషి, పడిన కష్టం వృథా కాబోదని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందని చెప్పడం గమనార్హం. తొలి దశ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చేసిన వ్యాఖ్యలు. ప్రజాకంటక పాలన విముక్తి గోదావరి జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని సంకేతాన్ని జనసైనికులకు ఇచ్చి క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇదే పట్టుదలతో సక్సెస్‌ఫుల్ చేయాలని కోరారు.

క్రియాశీలక రాజకీయ నాయకుడిగా..

జనసేన ఎంత బలంగా ముందుకు వెళ్లితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పోటీ ఒంటరిగానా, పొత్తులోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని, పొత్తులు ఉంటాయో ఉండవో తేలేవరకు పార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడవద్దని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే పొత్తు లేదా ఒంటరి పోటీనా అన్న ప్రశ్నను ఉత్పన్నం అయ్యేటట్లు చేస్తోంది. పొత్తులపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని అవివేకంతో మాట్లాడటం లేదని, అధికారంలోకి రావాలనే ఆశ ఎవరికి ఉండదు అందరికీ ఉంటుందని చెప్పడం చూస్తే పవన్ కల్యాణ్ పదునైన అలోచనలతో కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వపన్ కల్యాణ్ వినియోగించుకొని ఓటుగా మలచుకొని క్రియాశీలక రాజకీయ నాయకుడిగా తనని తాను మార్చుకుంటునట్లు సంకేతం సుస్పష్టం ఇప్పటికే ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అంటూ నినదించడం షురూ చేసిన పవన్ కళ్యాణ్, ఆ నినాదానికి కొనసాగింపుగా ‘వెల్‌కమ్ జేఎస్‌పీ’ అంటూ నినదించడం గమనార్హం. వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. జనసేన పార్టీకి వెల్‌కమ్ చెప్పాలన్నది జనసేన అధినేత, రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్న విషయం.

- సుధాకర్ వి

రాజకీయ విశ్లేషకులు

99898 55445

Also Read: నా ఊహాల్లో హీరో అంటే ఆయన ఒక్కరే: పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tags:    

Similar News