ఏళ్లుగా రూ. 8కే ఎకరం లీజు..
Over the 48 years Rs.8 thousand for acre lease.. why?
కర్ర ఆధారిత పరిశ్రమల కోసం 1976 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం వేల ఎకరాల అడవిని ధ్వంసం చేసి ఆ భూములను అటవీ అభివృద్ధి సంస్థ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లీజుకు ఇచ్చింది. సుమారు 48 సంవత్సరాలుగా ఆ భూములను అటవీ అభివృద్ధి సంస్థ సాగుచేస్తోంది. అయితే, సంస్థ ఏర్పడ్డ నాడు లీజు ఎంతుందో అదే లీజు నేటికి అమలు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
—-------------------------------
వేల ఎకరాల అటవీ భూములను అత్యంత కారుచౌకగా లీజుకు చేస్తున్న ఆ సంస్థ ఆదాయం విషయానికి వస్తే అంత ఆశాజనకంగా లేదు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఎకరానికి వచ్చే ఆదాయంతో పోల్చితే ఈ సంస్థ చూపించే ఆదాయం పొంతన ఉండటం లేదు. కారుచౌకగా అటవీ భూములను సొంతం చేసుకొని వచ్చే ఆదాయం విషయంలో కార్పొరేషన్ చేతి వాటం చూపుతుంది. ఇదే సంస్థలో పనిచేస్తున్న అధికారుల ఆస్తులు మాత్రం అంతుపట్టకుండా పెరిగిపోతున్నాయి. సంస్థ ఏర్పాటుకు ఉద్దేశించిన లక్ష్యం నెరవేరక పోగా ప్రజాధనం కొందరు అధికారుల, కార్పోరేషన్ చైర్మన్‌ల, రాజకీయ నాయకుల పంట పండిస్తోంది.
62 వేల ఎకరాల్లో వ్యాపారం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 జిల్లాల్లో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్‌డీసీ) విస్తరించి ఉంది. ఈ జిల్లాలన్నీ పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలు కావడం విశేషం. ఇక్కడ పీసా (పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డు ఏరియాస్), 1/70 చట్టాలు ఉంటాయి. అత్యధికంగా ఆదివాసీలు నివసించే ప్రాంతాలు. ఒక్కో జిల్లాలో వేల ఎకరాల జామాయిల్, వెదురు, టేకు, జీడిమామిడి సాగు చేస్తోంది. అత్యధికంగా లాభాలు వచ్చే జామాయిల్ సాగుకు ఈ సంస్థ మొగ్గుచూపుతూ పర్యావరణానికి విఘాతం కల్పిస్తోంది. జిల్లాల వారిగా లెక్కలు చూసుకుంటే ఖమ్మం 13,772.93 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం 13,705.91 ఎకరాలు, మెదక్ 5,352.5 ఎకరాలు, సిర్పూర్ కాగజ్ నగర్ 11,648.01 ఎకరాలు, మేడ్చెల్ 10,470.50 ఎకరాలు, వరంగల్ 7,413.97 ఎకరాల్లో మొత్తం 62,363.91 ఎకరాల్లో విస్తరించి ఉంది.
48 సంవత్సరాలుగా..
వ్యవస్థలో కొన్ని కొన్ని ఒప్పందాలను చూస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంటుంది. ముఖ్యంగా అటవీ అభివృద్ధి సంస్థ ( టీఎస్‌ఎఫ్‌డీసీ)- తెలంగాణ అటవీ శాఖ మధ్య ఉన్న లీజు ఒప్పందం కూడా ఇలాంటిదే. వేలాది ఎకరాల పచ్చని అడవులను ధ్వంసం చేసి భారీ వృక్షాలను నేల కూల్చి ఎంతో విలువైన భూములను ఎకరం కేవలం రూ. 8కే కార్పోరేషన్‌కు కట్టబెట్టడం ఎంతో హేయమైన చర్య. 48 సంవత్సరాలుగా లీజులో ఎలాంటి మార్పు లేకపోవడం చూస్తే దీన్ని హేయమైన ఒప్పందంగా చెప్పొచ్చు. ఓ పక్క రోజు రోజుకు అడవులు ధ్వంసం అవుతున్నాయి. పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అడవుల సంరక్షణ పేరుతో పేదల సాగుచేస్తున్న పోడుభూములను బలవంతంగా గుంజుకొని అడవుల పునరుద్ధరణ చేపట్టే అటవీ శాఖ ఈ భూముల విషయంలో, దాని లీజు విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదో అంతుపట్టడం లేదు. వేలాది ఎకరాల అటవీ భూముల్ని దశాబ్దకాలంగా కేవలం వ్యాపారం కోసమే వాడుకుంటుంటే ఇటు ప్రభుత్వం కానీ, అటవీ శాఖ కానీ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పి. క్రాంతి
జర్నలిస్టు
85019 05444