పరీక్షలపై భయం పోవాలంటే..

Open book exams are the solution for students to get rid of their fear of exams!

Update: 2024-04-03 01:15 GMT

సహజంగా పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్థుల్లో భయం, ఆందోళన మొదలవుతుంది. ఏడాదిగా చదివిందంతా గుర్తుపెట్టుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొదటి వాక్యం గుర్తుకు రాకపోయినా సమాధానం సరిగా రాయలేరు. రాత్రనక, పగలనక కష్టపడి చదువుకుని పరీక్ష హాల్లోకి వెళ్ళగానే పరీక్ష పత్రం చూస్తూ, ఆత్రుతతో టెన్షన్ పడుతూ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో టెన్షన్ తగ్గించి, కంఠస్థం (బట్టి పద్ధతి) చేసే విధానానికి స్వస్తి పలికి, పరీక్షలకు పుస్తకాలను తీసుకుని వెళ్లి, చూసి రాసే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందోనని సీబీఎస్‌సీ ఆలోచిస్తోంది. ఈ ఆలోచనే ఓపెన్ బుక్ ఎగ్జామ్ చర్చను తెరపైకి తీసుకువచ్చింది.

పుస్తకాలు చూస్తూ పరీక్షలను రాసే పద్ధతిని ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అంటారు. ఈ పరీక్ష విధానంలో సమాధానం రాసేటప్పుడు విద్యార్థులు వారి పుస్తకాలు, స్టడీ నోట్స్, గైడ్లు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తారు. ఓపెన్ బుక్ పరీక్షలు ప్రస్తుత పరీక్షలతో పోల్చుకుంటే కఠినంగా ఉంటాయి. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞానాన్ని వారి బట్టీ పట్టే సామర్థ్యాన్ని మనం పరీక్షిస్తున్నాం. ఓపెన్ బుక్ పరీక్షల్లో ప్రశ్నలు సాంప్రదాయ పద్ధతిలో వలె నేరుగా ఉండవు, పరోక్షంగా విద్యార్థుల అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. విశ్లేషణ స్థాయినీ అంచనా వేసేలా ఉంటాయి.

విస్తృత స్థాయి ప్రశ్నలు..

మూల్యాంకన ప్రక్రియను మార్చడానికి, సమస్యలను సంశ్లేషణ చేయడానికి, విశ్లేషించడానికి విద్యార్థులను సమర్థవంతంగా తయారు చేయడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి విమర్శనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడానికి విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాన్ని పెంచడానికి ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. ఈ విధానం సృజనాత్మకతతో కూడి ఉంటుంది. పుస్తకాలతో విస్తారమైన పరిచయం లేకుండా విద్యార్థులు సమాధానాలు రాయలేరు. ఓపెన్ బుక్ పరీక్షలో వచ్చే ప్రశ్నలు విస్తృత పరిధిని కలిగి ఉంటాయి. పుస్తకం ఆమూలాగ్రం చదివి పరీక్ష రాసేలా ఉండదు. ఆ సబ్జెక్టుకి సంబంధించి అనేక పుస్తకాలతో సంబంధం ఉండేలా విస్తృత స్థాయి ప్రశ్నలు ఈ పరీక్షల్లో అడుగుతారు. వారు తెచ్చుకున్న పుస్తకాల్లో స్టడీ మెటీరియల్‌లో ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన సమాచారాన్ని వినియోగించుకొని ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. బుక్ రీడింగ్, ఇంటర్నల్ డిబేట్‌లకు బాగా అలవాటు పడి ఉంటే ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ విద్యార్థులకు సులభం అవుతుంది.

ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఎందుకు?

నూతన జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా మూల్యాంకన పద్ధతిని మార్చడం, ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతిని అన్వేషించడం, విద్యార్థుల ప్రయోజనం కోసం వివిధ రకాల పరీక్షలను అమలు చేయాలని సిఫార్సు చేసింది. సీబీఎస్‌సీ సాధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఓపెన్ బుక్ ఎగ్జామ్‌ని అన్వేషిస్తుంది. సీబీఎస్‌సీ గత సంవత్సరం విడుదల చేసిన నేషనల్ కరికులం ప్రైమ్ వర్క్ ఆధారంగా ఈ రకమైన ప్రతిపాదనను సైతం రూపొందించింది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ప్రస్తుత మూల్యాంకన ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను సమీక్షించనుంది సీబీఎస్‌సీ.

ప్రయోజనాలు..

ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ విద్యార్థులకు ముఖ్యమైన భావనలు, హై ఆర్డర్ స్కిల్స్ , సెల్ఫ్ అసెస్మెంట్‌పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. క్లిష్టమైన సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. బోర్డ్ ఎగ్జామ్ ఆధారంగా నడిచే కోచింగ్ పరిశ్రమ విస్తరణను నిరోధిస్తుంది. వనరుల నిర్వహణ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల్లో పరీక్షకు సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్థులతో జరిపిన అధ్యయనంలో తేలింది. విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. పరీక్షలు స్వేచ్చగా ఎలాంటి ఒత్తిడి లేకుండా రాస్తారు.

పరిమితులు..

ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు సాంప్రదాయ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల్లా కాకుండా సమగ్రమైన ప్రత్యేకమైన ప్రశ్నల రూపొందించడంలో ప్రస్తుత ఉపాధ్యాయులకు అవగాహన లేదు. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అలాగే ఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే, విద్యార్థులు స్డడి మెటీరియల్ కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అధిక నాణ్యత గల స్టడీ మెటీరియల్ ఉపయోగించి కొంత మంది విద్యార్థులు అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. స్టడీ మెటీరియల్స్‌పై ఎక్కువగా ఆధారపడితే నిజమైన అవగహన లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.

కాపీ కొట్టడం కాదు

ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే కాపీ కొట్టే విధానం కాదని విద్యార్థులు,తల్లిదండ్రులు గమనించాలి. పాఠ్యాంశాలలోని భావనలను అవగాహన చేసుకొని లోతైన అధ్యయనం చేస్తేనే ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు సరైన జవాబులు రాయగలరు. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా సీబీఎస్‌సీ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా మరింత అధ్యయనం చేసి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిన్లాండ్, సింగపూర్, ఇంగ్లాండ్,అమెరికా,జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివిధ పరీక్షల్లో ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అమలు చేసి సత్ఫలితాలు పొందుతున్నారు.

పాకాల శంకర్ గౌడ్

విద్యావేత్త.

98483 77734

Tags:    

Similar News