పక్కన చాయ్ పార్సెల్ పట్టుకుపోతున్న బచ్చాబాబును చూసిన. వాడి మాసిన బట్టలను, శరీరాన్ని గమనించిన. పది పన్నెండేండ్లుంటాయేమో. నా ఆలోచనల అంతరంగం ఏమీ పట్టదు కదా? వాడి జీవనసమరం వాడిని నడిపిస్తుంది. నవ్వు మొహంతో ఆ చాయ్ పార్సెల్‌ను మనకు రాని నైపుణ్యంతో పట్టుకుని వాడి పని స్థలానికో, ఫుట్‌పాత్ బెడ్ రూంకో వెళ్లిపోయాడు. బతుకుదెరువు లేక బిహార్ వదిలి ఇక్కడి దాకా వచ్చిన ఆ చాయ్‌వాలా అంతరంగంలో సుడులు తిరిగే భావోద్వేగాలనో, బాల్యాన్ని వదిలి పనిబాట పట్టిన ఆ బచ్చా నవ్వు మొహం విసిరే ప్రశ్నలనో అర్థం చేసుకోగలమా? ఇప్పుడు మనల్ని ప్రభావితం చేస్తున్న భావోద్వేగాలకు అతీతంగా ఆ జీవన ప్రాథమిక సమస్యల పరిష్కారాలకు ప్రయత్నించగలమా? కనీసం మనసున్న మనుషులుగా ఆలోచించగలమా?
అగ్ని ప్రమాదంలో 11 మంది బిహారీ వలస కార్మికుల సజీవ దహనం. బుధవారం ఉదయం ఒక మిత్రుడి పరామర్శకు వరంగల్ వెళుతుండగా తెలిసిన వార్త. ఉన్న ఊరును, అనుబంధాన్ని అనివార్యంగా వదులుకుని రాష్ట్రం కాని రాష్ట్రాలకు వలస వచ్చినవారి జీవన సమరం. వాళ్ల బతుకులలోకి తొంగి చూస్తే ఎన్నో చేదు వాస్తవాలు మనలను వెక్కిరిస్తాయి. ఏ లక్షల సంపాదన కోసం వాళ్లు ఇలా రాష్ట్రాలకు రాష్ట్రాలు వలస వెళ్లాల్సి వస్తున్నది? వాళ్లు ఏ విలాస భవంతులలో, ఏ పట్టు పరుపులపై పవళిస్తుంటారు?
వాళ్ల మాసిన బట్టలు, శరీరాలు ఏం చూపిస్తున్నట్టు? దేశం స్వాతంత్ర అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న దశలో ఈ దేశ ప్రజల దీనస్థితి ఏమిటి? ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే హృదయం ఎలా స్పందిస్తుంది? ఏం బతుకులు వారివి? ఉన్నచోట, ఉన్న ఊరిలోనో, ప్రాంతంలోనో, ఆ రాష్ట్రంలోనో బతకలేని పరిస్థితులు ఎందుకుంటాయి? అలా ఉన్న పరిస్థితులను మార్చడానికి ప్రభుత్వాలకు ఏమవసరమవుతాయి? అందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుంది?
అంతటా వొడువని కథలే
ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి, గృహవసతి వంటివి ఈ దేశంలో ఇప్పటికి ఎందరికి అందుబాటులో ఉన్నట్టు? ప్రజల దైనందిన జీవనం ఎలాంటి కష్టనష్టాలు, వ్యథలు లేకుండానే గడుస్తున్నదా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్నా ఇదేమి దుస్థితి? ఇంకెంతకాలమీ అమానవీయ జీవనం? నూరేండ్లు నిండేనాటికైనా ఈ దేశం హసిస్తుందా? ప్రజల మధ్య ఎంతటి అసమానతలు? వైరుధ్యాలు. ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా, ఆ అంశాలపై బాధ్యతలను గుర్తెరగకుండా, అసలు వాటిని పట్టించుకోకూడదనే అన్నట్టు విస్మరించడం, ప్రజలను కూడా పక్కదారి పట్టించి విస్మరింపజేయ ప్రయత్నించడం నేటి దృశ్యం.
మిత్రుడి ఇంట పరామర్శ సందర్భంలోనూ ఓ బాధాకర పరిణామం. ఊరి పరిస్థితులపై, సామాజిక పరిణామాలపై మాటల సందర్భంలో ఊహించని విధంగా ఇద్దరు ఉపాధ్యాయ మిత్రుల అభిప్రాయాలు కొంత ఆశ్చర్యపరిచాయి. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టానిష్టాలకు సంబంధించిందేగానీ వారి ఆలోచనావిధానం, ప్రభావమవుతున్న తీరు కలవరపరిచింది. మానవీయ విలువలు, సామాజిక బాధ్యత బదులు భావోద్వేగ అంశాలే వారిని తాత్కాలికంగానైనా ఆకట్టుకుంటున్నాయన్న వాస్తవం కొంత కలవరపరిచింది. ఆవేదనకు లోనుచేసింది. అనుభవమున్న ఉపాధ్యాయవర్గమే ఆ రకమైన ప్రభావాలకు లోనవుతున్నారంటే, ఏమీ తెలియని వయసులోని కొత్త తరంవారిని భావోద్వేగాలపరంగా ఉత్తేజితులను చేసే పకడ్బందీ ప్రచార లౌక్యానికి పడిపోకుంటా ఉంటారా? ఎప్పుడూ అందరూ ఒకే ఒరవడిలో కొట్టుకుపోరుగానీ, కొంతకాలం కొన్ని అంశాలు కొందరిని అసంబద్ధంగా నడిపిస్తాయి. అలాంటివారికి కఠిన జీవన వాస్తవం కన్నా భావోద్వేగ అంశాలే ప్రధానమవుతుంటాయి.
అన్నీ భావోద్వేగాలే
ఊరికి పోయొస్తున్నప్పుడల్లా ఎన్ని భావోద్వేగాలో? ఒకవైపు బాధల ఆవేదనలు, మరోవైపు కొంతయినా సాంత్వన పరిచే పచ్చని చెట్లు, చల్లని గాలి. ఆహ్లాదం కలిగించే చెరువుల నీళ్లు. కొన్ని దశాబ్దాల కిందట చిన్నప్పుడు బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడల్లా కిటికీల నుంచి చూసి సంబురపడే ఆ దృశ్యాలు కొంతకాలం మాయమై మళ్లీ కొన్నేండ్లుగా కనిపిస్తుండటం ఒక ఆశావహ, ఆరోగ్యకర పరిణామమే అనిపించింది. మళ్లీ ఇప్పుడు వాటిపై వ్యాపార ఇనుపకంచెలు కమ్మేస్తుండటం మరో విషాద ప్రక్రియ. రోడ్డు పక్కన కొంచెమన్నా జాగా వదలకుండా రియల్ ఎస్టేట్ గోడలు వెలుస్తున్నాయి. ఇక వరంగల్-హైదరాబాద్ దారిలో రాయగిరి, యాదగిరిగుట్ట, భువనగిరి ప్రాంతాలలో ఇంతకాలం కనువిందు చేసిన కొండలు గుట్టలు కనుమరుగవుతున్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారడానికి ఇంకెంతోకాలం పట్టదనిపిస్తుంది. ఇవన్నీ ఎవరికి పట్టాలి? ఎవరేం చేయాల్సి ఉన్నది? మనసంతా ఏదోలా అవుతుండగా హైదరాబాద్ శివారుకు వచ్చేశాం.
చాయ్ తాగుదామని వాహనాన్ని రోడ్డుకు పక్కగా ఆపి చాయ్ డబ్బా దగ్గరికి వెళ్లాం. 'చాయ్ ఇస్తావ్ మసాలా చాయ్' అంటూ అనుమానమొచ్చి 'తెలుగు నైతో హిందీ' అని అడిగితే 'హిందీ' అని బదులిచ్చిండు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ బచ్చా బాబు. 'కహాసే' అంటే 'బిహార్' అన్నడు చాయ్‌వాలా. పొద్దున ఘటనలో 11 మంది బిహారీలు చనిపోయిన సంగతి తెలుసా? అంటే 'ఐసా, నై మాలూమ్' అని చూసిండు. ఈ-పేపర్ తెరిచి చనిపోయినవాళ్ల పేర్లు చదివి వినిపించాను. ఎంతగా కదిలిపోతాడో అని ముఖంలోకి చూస్తే, కొంత అంతుబట్టని కవళికలు. కొన్ని క్షణాల్లో మళ్లీ తన పనిలో పడ్డాడు. మేము చాయ్ గ్లాసులు తీసుకుంటూ, పక్కన చాయ్ పార్సెల్ పట్టుకుపోతున్న బచ్చాబాబును చూసిన. వాడి మాసిన బట్టలను, శరీరాన్ని గమనించిన.
పది పన్నెండేండ్లుంటాయేమో. నా ఆలోచనల అంతరంగం ఏమీ పట్టదు కదా? వాడి జీవనసమరం వాడిని నడిపిస్తుంది. నవ్వు మొహంతో ఆ చాయ్ పార్సెల్‌ను మనకు రాని నైపుణ్యంతో పట్టుకుని వాడి పని స్థలానికో, ఫుట్‌పాత్ బెడ్ రూంకో వెళ్లిపోయాడు. బతుకుదెరువు లేక బిహార్ వదిలి ఇక్కడి దాకా వచ్చిన ఆ చాయ్‌వాలా అంతరంగంలో సుడులు తిరిగే భావోద్వేగాలనో, బాల్యాన్ని వదిలి పనిబాట పట్టిన ఆ బచ్చా నవ్వు మొహం విసిరే ప్రశ్నలనో అర్థం చేసుకోగలమా? ఇప్పుడు మనల్ని ప్రభావితం చేస్తున్న భావోద్వేగాలకు అతీతంగా ఆ జీవన ప్రాథమిక సమస్యల పరిష్కారాలకు ప్రయత్నించగలమా? కనీసం మనసున్న మనుషులుగా ఆలోచించగలమా?
వెంకట్ జీవి
80966 77333