అతిపెద్ద సామాజిక భద్రత పథకం! నేడు అవినీతి కూపం

ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం తొలిసారిగా 1991లో ఉపాధి హామీ పథకాన్ని ప్రతిపాదించింది

Update: 2022-10-03 18:45 GMT


పనుల మీద పర్యవేక్షణ లేక, వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. 2020-2021లో దేశవ్యాప్తంగా 974.87 కోట్ల నిధులు దుర్వినియోగమైతే అందులో తెలంగాణ రాష్త్రంలోనే సుమారు 86.98 కోట్లు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపితే ఇది సుమారు 769.37 కోట్లుగా తేలింది. ఈ నాలుగు రాష్ట్రాలలోనే దాదాపు 80 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనలో వెల్లడైంది. 2021-2022లో ఏకంగా 150 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఉంది.

ర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం తొలిసారిగా 1991లో ఉపాధి హామీ పథకాన్ని ప్రతిపాదించింది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ 2004లో ప్రధాని అయ్యారు. ఆ తరువాత, గ్రామీణ ప్రాంతాలలో కూలీలు పనులు లేక వలస బాట పట్టకుండా ఉండడానికి కనీసం వంద రోజులపాటు పని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు యూపీఏ సర్కారు 2005లో ఉపాధి‌హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర గ్రామీణభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్థాయి.

ఈ చట్టం అమలుకు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రతిష్టాత్మక సామాజిక భద్రత, ప్రజా పనుల కార్యక్రమంగా గుర్తింపు పొందింది. దేశంలో 75 నుంచి 80 శాతం, తెలంగాణలో 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల వారికి కరువుకాటకాలలోనూ ఉపాధి హామీ పథకం అండగా నిలిచి గ్రామీణ వ్యవస్థకు జీవం పోసింది. లక్షలాది మంది కూలీలతో పాటు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతున్న అనేక మంది నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచింది.

దానిదే కీలక పాత్ర

గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకానిదే కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక పల్లెలను కూడా పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి. ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణం, హర్టికల్చర్ ప్లాంటేషన్లు ,చెరువులు, కుంటలలో పూడికతీత, నర్సరీలు, కంపోస్టు తయారీ, పంచాయతీ భవనాల నిర్మాణాలు, ధాన్యం ఆరబోసే కల్లాల ఏర్పాటుకు పూనుకున్నారు. 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి శాతానికి పెంచడానికి హరితహరంలో కోట్లాది మొక్కలు నాటి వాటి సంరక్షణకు ఉపాధి హామీ నిధులతోనే చర్యలు తీసుకుంటున్నారు.

రైతులు దుక్కి దున్నడానికి, విత్తనాలు నాటడానికి, కలుపు తీయడానికి, గట్లు ఎత్తడానికి, మొక్కలు నాటడానికి, రసాయనిక ఎరువులకు, చివరికి పంట చేతికి వచ్చే వరకు కూడా కూలీలు అవసరం. దీంతో రైతులకు పంట నుంచి వచ్చే ఆదాయం కంటే అప్పులే తడిసి మోపెడవుతున్నాయి. పంటకు మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్న సందర్భంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో ఈ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సింది పోయి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో 2018-19 లో రూ.132 కోట్లు, 2019-20లో రూ.217 కోట్లు, 2020-21 లో రూ.198 కోట్లు, 2021-22 నవంబర్‌నాటికి రూ.91 కోట్లు ఖర్చుకాకుండా మిగిలిపోయాయి. సరిపడా నిధులు ఉన్నప్పటికీ పారదర్శకంగా పథకం అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని స్పష్టంగా అర్థం అవుతోంది.

పర్యవేక్షణ లేక

ఈ పథకానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పుడు లెక్కలు చూపుతూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. సంవత్సరం క్రితం ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో దీక్షలకు దిగారు. దీంతో ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగించి, వీరి పనులను గ్రామకార్యదర్శులకు అప్పగించింది. పని భారం పెరిగి అనేక మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలిపెట్టారు. ఉన్నవారు పని భారం తగ్గించాలంటూ అధికారులకు, మంత్రులకు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులకు తీసుకుంది.

నూతన జిల్లాలు, మండలాలలో ఉపాధి హామీపథకంతో పాటు ఇతర అభివృద్ధి పథకాలను పర్యవేక్షించే ఏపీఓ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో పనుల మీద పర్యవేక్షణ లేక, వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. 2020-2021లో దేశవ్యాప్తంగా 974.87 కోట్ల నిధులు దుర్వినియోగమైతే అందులో తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 86.98 కోట్లు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపితే ఇది సుమారు 769.37 కోట్లుగా తేలింది. ఈ నాలుగు రాష్ట్రాలలోనే దాదాపు 80 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనలో వెల్లడైంది. 2021-2022లో ఏకంగా 150 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఉంది.

మాణిక్ డోంగ్రే

సామాజికవేత్త

99515 77876

Tags:    

Similar News