నేతల భాషలో సభ్యత ఉండొద్దా? - మేకిరి దామోదర్
నేతల భాషలో సభ్యత ఉండొద్దా అని మేకిరి దామోదర్ ప్రశ్నించారు...
మన రాష్ట్రలో ఎండల వేడి కంటే నేతల హాట్ హాట్ కామెంట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఎన్నికల తేదీ ఇంకా నెలకు పైగా ఉన్నప్పటికీ, నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంటోంది. దుర్భాషలు, దుందుడుకు మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వాగ్ధాటి తీవ్రమౌతోంది.. మా పార్టీలోకి చేరికల గేట్లు ఎత్తేస్తాం అని ఒక పార్టీ నేతలు.. కూల్చేస్తాం.. పడగొట్టేస్తాం, ఖాళీ చేస్తాం.. అంటూ మరోపార్టీ నేతలు... ఇలా నిత్యం నేతల కవ్యింపు మాటల్ని వినాల్సి వస్తుంది. పరస్పర నిందలే ధ్యేయంగా ఒకరిపై ఒకరు పోటీపడి దూషించుకుంటున్నారు. సోషల్ ఇంజనీర్లతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కామెంట్లతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
మన దేశంలో ప్రజా పాలకులను ఎన్నుకునే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలు చేరువలో ఉన్నాయి. దేశానికైన, రాష్ట్రానికైనా ఏలిక అంటే ప్రజలకు పాలకుడని అర్థం. పాలకులు సుఖంగా ఉంటే ప్రజలు సుఖంగా ఉన్నట్లు కానే కాదు. ప్రజల సుఖమే పాలకుల సుఖమని భావిస్తూ.. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రజారంజక పాలన అందించాలి. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా పాలకులు భావించాలి. అంతే కాదు ప్రజలను సంక్షేమ పథకాల ద్వారా ఆకట్టుకోడం కంటే. వారిలో శ్రమ శక్తిని పెంచి,శాశ్వతమైన ఆర్థిక పురోభివృద్ధికి మార్గం వేయాలి. ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చూడాలి తప్ప దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయరాదు. పాలకులు విద్య, వైద్యం, ఆరోగ్యం వ్యవసాయం, ఉపాధి-ఉద్యోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ఎంత కాలం పాలించారనే దానికంటే! ఎంత మంచిగా.. జన రంజక పాలనను అందించారనేది ప్రధానం.
నిందలతోనే కాలం గడిపితే..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధిక సీట్లతో తమ ఆధిపత్యం సాధించు కోవడానికి తెలంగాణలో మూడు పార్టీలు రాజకీయ విలువలు, నైతికత మరిచిపోయి రాజకీయ ప్రసంగాలు, చర్చలు, విశ్లేషణలు, పరస్పర నిందలే ధ్యేయంగా ఒకరిపై ఒకరు పోటీపడి దూషించుకుంటున్నారు. న్యాయకోవిదులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వీరు మాట్లాడే భాషను ఖండిస్తూ, అభిశంసిస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటున్నారు. రాజకీయ పరిభాషణం.. మనం వాడే భాష సభ్యతగా ఉండాలని, రాజకీయ నాయకులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, విద్యావంతులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. అలాగే వార్తా చానల్స్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు దుర్భాషలతో నిండిపోతున్న తీరు మారాలి. సామాన్య ప్రజలు, చదువుకునే పిల్లలపై వీటి ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతోంది సమాజం. సభ్యత, బాధ్యత గల పౌరులుగా ఈ అసభ్య భాషను మాట్లాడటం ఆక్షేపణీయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. పత్రికలు, ఛానల్, సామాజిక మాధ్యమాలు ఇటువంటి భాషను బహిష్కరించాలని విజ్ఞలు, మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రవర్తన తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇది సమంజసం కాదు..
సమస్యలపై చర్చ ఎక్కడ?
ఏ పార్టీ దేనితో మిలాఖత్ అవుతుంది అనేది అర్థం కాకుండా జనాన్ని అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలా మూడు రాజకీయ పార్టీలు విమర్శల సుడిగుండంలో ప్రజా సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు మొదలైన కీలకమైన అంశాలు మరుగున పడిపోతున్నాయి. వాటి చర్చే లేకుండా పోతోంది. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కొందరు, ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని ఇంకొందరు ఇలా మూడు ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై ఇంకొకరు రాజకీయ ఆధిక్యత కోసం హద్దు మీరిన పొలిటికల్ మైలేజ్ కోసం మైండ్ గేమ్‌తో ప్రజలు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. రాజకీయంగా పైస్థాయి సాధించి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు.
హీటెక్కించడంలోనే పోటీ
నిజంగానే రాజకీయ నేతలు ప్రజా సమస్యలు, విభజన హామీలు, తెలంగాణ పునర్నిర్మాణం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తదితర కీలక అంశాలను మరిచి మాటల యధ్ధంలో మునిగిపోయారు. విమర్శలతో రాజకీయ ఘర్షణ వాతావరణంలో హీటెక్కించడంలో పోటీ పడుతున్నారు. ఏ పార్టీ నాయకులు ఏరోజు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో! తెలియని అయోమయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. పొలిటికల్ పార్టీలు, పొలిటిషన్లు ఓట్ల వేటలో మీ ఎమ్మెల్యేలు మాకు టచ్‌లో ఉన్నారంటే!. లేదు మాకే టచ్‌లో ఉన్నారు.. అరే మీ మంత్రులే మాకు టచ్‌లో ఉన్నారు అంటున్న మూడు పార్టీల లీడర్ల మాటలు అంతరార్థమేమో గానీ! లీడర్ లారా.. అనైతిక పొలిటికల్ మైండ్ గేమ్ మాని మీరు ప్రజలకు టచ్ లోకి రండి. లేదంటే ప్రజలతో మీకు లింకు తెగిపోతుంది సుమా.. సార్వత్రిక ఎన్నికల ప్రచార వేళ, ప్రజలు నిజాయితీగా ఆలోచించుకోని ఆత్మ పరిశీలన చేసుకుని విచక్షణతో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిన తరుణమిది. విజ్ఞతతో ఓటర్లు ఇచ్చే తీర్పే ప్రజాస్వామ్యానికి ఊపిరి, దేశ భవితకు పునాది...
మేకిరి దామోదర్, వరంగల్
95736 66650