ఎన్నికల వరకు ఈ 'మంట' ఆగదు!

Manipur violence cannot stop up to 2024 election battle

Update: 2023-08-22 00:30 GMT

మణిపూర్ రాష్ట్రంలో మూడు నెలలుగా మంటలు మండుతూనే ఉన్నాయి. ఈశాన్య భారతం తెగలతో నిండి ఉండే సమాజం. ఎత్తైన కొండలు, లోయలు, దట్టమైన అరణ్యాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అన అనుకూలమైన భౌగోళిక పరిస్థితులతో నెలకొని ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు, ఆచార, సాంప్రదాయాలు మిగతా భారత్‌కు భిన్నంగా ఉంటాయి. తెగల మధ్య పోరాటాలు, వైషమ్యాలు సర్వసాధారణం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే మణిపూర్‌లో నేడు జరుగుతున్న సంఘర్షణల అంతరార్థం అర్థం అవుతుంది. ఇక్కడ నెలకొన్న సంఘర్షణలకు కారణాలను అన్వేషించేవారు సెలెక్టివ్ ఆమ్నీసియాను ప్రదర్శిస్తూ, వాస్తవాలను పక్క దోవ పట్టించే విధంగా, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో విశ్లేషణలు చేయడం విచారకరం. కేవలం మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, అభాసుపాలు చేయడమే లక్ష్యంగా మోడీ వ్యతిరేకులు, ఎన్జీవోలు మణిపూర్ ఘర్షణలను ఇష్టారాజ్యంగా సత్యాసత్య విచక్షణ లేకుండా వ్యాఖ్యానించడం క్షమార్హం కాదు.

మోడీ వ్యతిరేకుల జిమ్మిక్కులు..

వాస్తవంగా సహజ వనరుల పంపిణీలో విభేదాలు, ట్రైబల్ హోదాను మెయితీలకు ఇవ్వాలని మణిపూర్ హైకోర్టు తీర్పునివ్వడం ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని సమగ్రమైన కోణంలో విశ్లేషించకుండా, కుకీలు క్రైస్తవులు కాబట్టి హిందూ మతానికి చెందిన మైయితీలు కుకీ ప్రజల నివాస స్థావరాలపై దాడులు చేస్తూ, కుకీలను చంపుతూ, చర్చీలను కూలగొడుతూ, స్త్రీలను మానభంగం చేస్తూ, మణిపూర్‌ను అగ్నిగుండంగా మారుస్తున్నారని చేసే విష ప్రచారం అంతా ఇంతా కాదు. పోలీసులు కుకీల వద్ద నుండి ఆయుధాలు తీసుకుని, మెయితీలకు ఆయుధాలను అందిస్తున్నారని చేసే అబద్దపు ప్రచారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలకు కుకీల భూములను, ఖనిజ సంపదను కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం ఈ ఘర్షణలకు స్కెచ్ వేసిందని వామపక్షవాదులు చేసే గోబెల్స్ ప్రచారం జుగుప్సాకరంగా ఉంది. మణిపూర్ సంఘర్షణలను మొదలు పెట్టింది ఎవరు? మే 4వ తేదీన ఇద్దరు కుకీ స్త్రీల నగ్న ప్రదర్శనపై తీసిన వీడియో, సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ముందు వైరల్ కావడం అనేక అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా మోడీ వ్యతిరేకులు పార్లమెంటు సమావేశాల ముందు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేశారు.

మణిపూర్ మంటకి ఆజ్యం పోసి..

గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి పట్ల చొరవను చూపలేదు అనేది నిజం. మోడీ ప్రభుత్వం దేశ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈశాన్య ప్రాంతాలను మిగతా భారత దేశ ప్రాంతాలకు అనుసంధానం చేయడం, మౌలిక వసతులను వృద్ధి చేయడంతో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలకు, పార్టీలకు నచ్చలేదు. మోడీ ప్రభుత్వం మెజారిటీ హిందూ మత వాదంతో నడుస్తుందనే అపవాదు ఈశాన్య రాష్ట్రాలలో పని చేయలేదు. ఈ విషయంలో మోడీ వ్యతిరేకుల అహం దెబ్బతిన్నది. అందుకే మణిపూర్ సంఘర్షణల మంటలను పార్లమెంటు ఎన్నికలలో గెలుపోటములను నిర్ణయించేంతవరకు ఆరనివ్వరు. సహజంగా మణిపూర్ లోని కుకీ తెగల్లో చాలామంది బర్మా నుండి వచ్చిన అక్రమ వలసదారులే. ఈశాన్య రాష్ట్రాల్లో సొంత తెగ సంబంధాలను దేశ సరిహద్దులు, దేశ సమగ్రత, సమైక్యత అనే విషయాలను పక్కనపెట్టి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి చూస్తే మణిపూర్ మంటలకు ఆజ్యం పోసినవారు ఎవరో తెలుస్తుంది.

నాడూ నేడూ.. ఎంత తేడా!

అస్సాం, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో జాతుల మధ్య ఘర్షణలు సంవత్సరాల తరబడి కొనసాగలేదా? ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అనే నినాదాలతో ఈశాన్య భారతమంతా మార్మోగింది. అప్పుడు కేంద్రంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో కొనసాగుతూ ఉండేవి. నాడు కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు దేశ భద్రత, సమగ్రతల విషయంలో ఈశాన్య భారత ప్రజల ఆందోళనలను అర్థం చేసుకొని, ముందు చూపుతో వ్యవహరించాయి. దేశం భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఈశాన్య రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆనాడు ప్రతిపక్షాలు స్వాగతించాయి. చివరగా మణిపూర్ సంఘటనలను ఎక్కువగా రచ్చ చేస్తే నష్టపోయేది మోడీ వ్యతిరేక పార్టీల నాయకులే. మణిపూర్ విషయంలో వీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ దేశం నాది అనే భావించే ప్రజలు నమ్మరు. ఎందుకంటే మోడీకి దేశమే ప్రధానమైంది. మోడీ వ్యతిరేకులు దీనికి భిన్నం.

ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News