మానవత్వానికి అండగా ఉందాం

మతం ఇంటి గడపలోనే ఉండాలి. కులం మనం నివసించే వాడకట్టు వరకే ఉండాలి. ఊరి మధ్యలోకి వస్తే పౌరుడిగా ఉండాలి. మతం, కులం అనేవి వాటిని అనుసరించి, పాటించే ఆయా వర్గాల వారికి సంబంధించినవే.

Update: 2022-06-17 18:30 GMT

దేశంలో అసమానతలు, మత, కుల, విద్వేషాలు లేని పాలన అందించడానికి, దేశ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ సిద్దమవుతున్నారు. మతాల మధ్య చిచ్చుతో అధికారంలోకి రావాలనుకొనే బీజేపీ అసలు స్వరూపాన్ని గమనించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి చేయబోయే మరో యుద్ధంలో, మానవత్వానికి అండగా నిలబడాలి. కేసీఆర్ అడుగులో అడుగు వేసి దేశాన్ని మానవత్వంలోకి ఆదర్శంగా నిలపడానికి కృషి చేయాలి.

తం ఇంటి గడపలోనే ఉండాలి. కులం మనం నివసించే వాడకట్టు వరకే ఉండాలి. ఊరి మధ్యలోకి వస్తే పౌరుడిగా ఉండాలి. మతం, కులం అనేవి వాటిని అనుసరించి, పాటించే ఆయా వర్గాల వారికి సంబంధించినవే. భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, అనేక భాషలు కలిగి ఉన్నది. అయినా, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే గొప్ప దేశం మనది. ఏ మతం వారికి కూడా మరో మతం పట్ల భేదాభిప్రాయాలు లేవు. మతాలకు, కులాలకు అతీతంగా, చైతన్యంతో తెలంగాణ సమాజం ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ఎక్కడా మత ఘర్షణలు జరిగింది లేదు. ప్రస్తుతం తెలంగాణతోపాటు దేశమంతటా రాజకీయానికి మతాన్ని జోడిస్తున్నారు.

మతం పేరిట విద్వేషపూరిత కుట్రలకు తెరలేపి, రాజకీయ లబ్ధే ధ్యేయంగా బీజేపీ సర్కారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దమనకాండ సాగుతూనే ఉంది. గుజరాత్‌లో ఓ దళితుడు పెళ్లి తరువాత గుర్రం పై ఊరేగాడని దాడులకు తెగబడ్డారు. 'జై శ్రీరాం' అని నినదించలేదని ఓ ముస్లిం యువకుడిని చంపేశారు. ఇలా మత, కుల విద్వేష దాడులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఓ విద్యార్థి నాయకురాలి ఇంటిని జేసీబీతో కూలగొట్టారు. దేశంలో గుణాత్మక మార్పుకు, అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వమే మత ప్రాతిపదికన కుట్రలు చేస్తోంది.

కేసులు పెడుతూ, ఎత్తివేస్తూ

గతంలో గుజరాత్‌లో 'పటేల్ ఉద్యమాన్ని' నడిపిన హార్ధిక్ పటేల్ మీద కేంద్ర సర్కారు అనేక కేసులు బనాయించింది. ఆయన పటేల్ సామాజికవర్గం కోసం అనేక ఆందోళనలు చేశారు. అతడిని ఇటీవలే బీజేపీలో చేర్చుకున్నారు. ఇలా చేరారో లేదో అతనిపై ఉన్న ఒక్కో కేసులో క్లీన్ చీట్ ఇస్తున్నారు అంటే ఇది ఉద్దేశ్యపూర్వకమనేది స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ముస్లిం వర్గాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. 'మసీదులు తవ్వుదాం' అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దిగజారేలా, రెచ్చగొట్టేలా మాట్లాడడం బాధాకరం. కేసులు ఉన్నవారు బీజేపీలో చేరగానే పునీతులు అవుతున్నారు. దీంతో బీజేపీ రాజకీయాలలో నేర చరితులకు అవకాశం ఇస్తుందనే భావించవచ్చు. దేశంలో అవినీతి లేకుండా చేస్తామని చెప్పిన మోడీ తెచ్చిన నల్లధనం ఎంతో తెలవదు గానీ, నోట్ల రద్దు సమయంలో ఆగిన గుండెలు ఎన్నో. కొత్త నోట్లు తెచ్చిన తరువాత దొంగ నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయని ఆర్‌బీఐ స్వయంగా ప్రకటించింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని అబద్ధపు మాటలు గొప్పగా చెప్పిన మోదీ సర్కారు తరువాత మొండిచేయి చూపింది.

తెలంగాణ ఆదర్శం

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాలలో దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు చాచిన ముసలి అవ్వ వరకు కేసీఆర్ మానవత్వ దృక్పథంతో వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన పంజాబ్ రైతుల కుటుంబాలకు అండగా నిలిచారు. కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో పరిపాలనలో ప్రజల అభ్యున్నతి కోసం అంత మానవత్వంతో ఉంటారు.

80 వేల ఉద్యోగాలు నింపేందుకు తగు కసరత్తు జరుగుతున్నది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న సంగతి మరవొద్దు. రైతుబంధు, దళితబంధుతో రైతులు, దళితులకు భరోసా ఇస్తున్నారు. దేశంలో అసమానతలు, మత, కుల, విద్వేషాలు లేని పాలన అందించడానికి, దేశ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ సిద్దమవుతున్నారు. మతాల మధ్య చిచ్చుతో అధికారంలోకి రావాలనుకొనే బీజేపీ అసలు స్వరూపాన్ని గమనించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి చేయబోయే మరో యుద్ధంలో, మానవత్వానికి అండగా నిలబడాలి. కేసీఆర్ అడుగులో అడుగు వేసి దేశాన్ని మానవత్వంలోకి ఆదర్శంగా నిలపడానికి కృషి చేయాలి.

 సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516

Tags:    

Similar News