కొత్త జోనర్‌లో ‘కోటబొమ్మాళి పి.ఎస్.
Kotabommali P.S. is a new zonar movie
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాజకీయ చిత్రాలు కొత్త కాదు. నాటి ‘రంగులరాట్నం’ ‘పెద్దమనుషులు’ నుంచి నిన్ను మొన్నటి ‘ప్రతినిధి’ ‘కెమెరామెన్ గంగతో..’ వరకు సామాజిక వర్గాలు, కులాల బెరీజులు, పదవులు, వీటి కోసం బలిదానాలు, తమ ‘కుల’ అభివృద్ధి కోసం అనుబంధాలు, ఆత్మీయతల మధ్య చిచ్చులు.. వంటి ‘కాన్సెప్ట్స్’ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ‘ప్రజారాజ్యం’ ‘ఈనాడు’ ‘మండలాధీశుడు’ వంటి చిత్రాలు తెలుగులో కొత్త కాదు. కానీ ఈ చిత్రాల కథలన్నీ ఎమోషన్ డ్రామా నేపథ్యంలో నడిచి చివరకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే సాధారణ కథాంశాలతో అతి సాధారణంగా చిత్రించిన విఫల చిత్రాలుగా మిగిలిపోయాయి. ‘రంగులరాట్నం’ ‘పెద్దమనుషులు’ వంటివి హ్యూమన్ డ్రామాను ఎలివేట్ చేసి సగటు ప్రేక్షకుడికి ఆలోచనలు కలిగిస్తాయి. ఇటువంటి చిత్రాలలో ‘వర్గ పోరు’ తక్కువ. కుల, మత విభేదాలు కూడా తక్కువే. కుటుంబ పరమైన బంధాలకు ‘పదవి, ఓటు’ వంటి సాధారణ అంశాలను జోడించి సినిమాలు తీసేవారు. జయాపజయాలు ప్రేక్షకులకు వదిలేసేవారు.
వాస్తవ కథను సినిమాగా..
మలయాళీ చిత్ర పరిశ్రమలలో సహజమైన భావోద్వేగాలకు కథనంలో ప్రాధాన్యమిస్తారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘2018’ సినిమా ఘన విజయం వెనుక ఏ ‘కమర్షియల్ పాయింట్స్’ ఉన్నాయో అందరికీ తెలిసిందే. జీవితంలో కథలుండవు. కేవలం జరుగుతున్న సహజమైన వాస్తవ సంఘటనలు మాత్రమే ఉంటాయి. వాటిని సినిమాగా ‘తెరపై’ చూపించడాన్ని బట్టే సినిమా ఫలితం ఉంటుంది. కొన్ని వాస్తవ కథలు ‘ఎమోషన్స్’ ‘డ్రామా’ హైడ్రామా’లను ప్రముఖంగా, మనసుకు పట్టే విధంగా చిత్రిస్తాయి. ఆ చిత్రాలు ఇటువంటి సామాజికాంశాలనున్న జీవితంలోని సహజమైన సంఘటనలను వ్యక్తులు తమ తమ మానసిక శక్తి సామర్థ్యాల, సహజపరమైన ‘తిరుగుబాటు’ లేదా ‘ప్రతిఘటనలను’ ఎలా పరిష్కరించుకున్నారనే వాస్తవ 'కథనం' 2011 సంవత్సరంలో కేరళలో జరిగింది. నలుగురు పోలీసులు ఓ పెళ్లికి వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోతారు. ప్రజల ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఆ పోలీసుల మీద ఎస్సీ / ఎస్టీ చట్టం కింద కేసు నమోదవుతుంది. నూరు రోజుల తర్వాత వారంతా బెయిల్ బయటకు వస్తారు. ఇంతవరకు కూడా (అనగా 12 సంవత్సరాల తర్వాత) కేసు తేలలేదు.
ఇలా వాస్తవ కథను చిత్రంగా తీసి ఒకపాటి విజయం సాధించారు దర్శకుడు మార్టిన్ ప్రకట్. కానీ.. ఈ చిత్రంలో సాధారణ ప్రేక్షకుడికి కావలసిన మసాలాలు లేవు. కానీ.. ఆర్థికపరమైన సూత్రాలు ఈ చిత్రంలో ఉండేటట్టు దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆ చిత్రమే ‘నాయాట్టు’ (వేట). ఈ చిత్రం రీమేక్ ‘కోటబొమ్మాళి పి.ఎస్.’. తెలుగు దర్శకుడు తేజ మార్ని గతంలో ‘జోహార్’ ‘అర్జునా ఫల్గుణా’ అనే చిత్రాలు తీశాడు. ఇవి అతనికి మిశ్రమ ఫలితాలనిచ్చాయి. ఈ అపజయాలు ఇచ్చిన ‘అనుభవంతో’ కొత్త జోనర్ కోసం ఎంచుకున్నారనిపిస్తుంది. మూల కథలో లేని కొన్ని అంశాలను ఈ చిత్రంలో అదనంగా చేర్చుకున్నారు. ‘నాయాట్టు’ కథలోని ప్రధానాంశాన్ని మార్చకుండా ‘యాక్సిడెంట్’ చేసి పారిపోయిన పోలీసులలో ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన వారిగా చూపించుకున్నారు. ఇక్కడే తెలుగు దర్శకుడు కథలో తనదైన ముద్రతో ఎటువంటి మాస్ ఫార్ములాకు తావివ్వకుండా ఉన్నది ఉన్నట్టు ‘రియలిస్టిక్’ జోనర్ లో తీశారు. దీంతో చిత్రం మూస సినిమాలకు భిన్నంగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది.
కథేంటంటే
ఈ సినిమాలో రవి రాహుల్ (విజయ్)కి పోలీసు ఉద్యోగం వస్తుంది. అతను చేరిన పి.ఎస్ లో కుమారి (శివాని రాజశేఖర్) కూడా కానిస్టేబుల్‌గా చేరుతుంది. ఎస్.ఐ గా (రామకృష్ణ) శ్రీకాంత్ ఉంటాడు. ఇతను గతంలో గ్రౌహాండ్స్ ఆపరేషన్ స్పెషలిస్ట్. ఈ కథకు అనుబంధంగా కానిస్టేబుల్ కుమారి సామాజిక వర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ కార్యకర్త మున్నా (పవన్ తేజ్) పోలీస్ స్టేషన్‌కి వచ్చి భీభత్సం సృష్టిస్తాడు. ఏ.ఎస్.ఐ రామకృష్ణ అతడిని జైల్లో వేస్తాడు. రాజకీయ ఫోన్లతో విడుదలై పోతాడు. వాళ్ళ పార్టీ వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఒక రోజు రామకృష్ణ, రవి ఓ పెళ్లికి పోలీస్ జీప్‌లో వెళ్తారు. జీపు డ్రైవర్ అతని మేనల్లుడు. కుమారి కూడా అదే జీపులో ఎక్కుతుంది. ఆ జీపుకి దారిలో ఆక్సిడెంట్ జరుగుతుంది. డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణ మేనల్లుడు పారిపోతాడు. ప్రమాదంలో ఓ కార్యకర్త చనిపోతాడు. ఆ పార్టీ ఆందోళన చెందుతుంది. పార్టీ కార్యకర్త సామాజిక (కుల)వర్గానికి ‘టెక్కలి’ నియోజకవర్గంలో 50 వేల ఓట్లు ఉంటాయి. అక్కడ ఉప ఎన్నిక ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన ఏపీ రాజకీయాలలో ‘నిప్పు’ రాజుకుంటుంది. ముగ్గురు పోలీసుల మీద కేసు నమోదవుతుంది. వారు పారిపోతారు. వీరిని వెతికే పని కోసం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా (వరలక్ష్మీ శరత్ కుమార్)ను నియమిస్తాడు. హోం మంత్రి జయరాం (మురళీ శర్మ). ఎన్నికల సమయంలో ఓట్లకు వేసే గాలంలా నిందితులను నలభై ఎనిమిదిగంటల్లో పట్టుకుంటామని హామీ ఇస్తాడు. ఎస్పీ వారిని పట్టుకుందా లేదా? వారు దొరికారా? కేసు నుంచి రామకృష్ణ తదితరులు ఎలా బయటపడ్డారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
తెలుగు నేటివిటీకి పట్టం కట్టి
మూల కథ ‘నాయాట్టు’లో లేని విధంగా తెలుగులో నేటివిటీకి దగ్గరగా తీసిన ఈ చిత్రంలో నటీనటులు శ్రీకాంత్ 'రామకృష్ణ' పాత్రలో గొప్ప నటనను ప్రదర్శించాడు. రాజకీయాలకు బలైన పాత్రని అతడు ఎంతో సహజంగా నటించాడు. ఇక శ్రీకాంత్ పాత్రకు, హోం మినిష్టర్ పాత్రకు మధ్య కరుడుగట్టిన పోలీస్ బాస్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్‌ఫుల్‌గా పోషించారు. రాజకీయ చదరంగపు ఆట ఆడే హోమ్ మినిస్టర్ పాత్రలో మురళి శర్మ అక్కడక్కడ నవ్విస్తూనే సీరియస్‌గా సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగేటట్టు చేశారు. శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ బెనర్జీ తదితరులు పాత్ర పరిధి మేరకు తమ వంతు ‘పాత్ర’ను బాధ్యతగా, దర్శకుడి ‘సూచనల’కనుగుణంగా నటించారు. సాంకేతికంగా సినిమాను తనకు కావాల్సిన ‘రియలిస్టిక్ జోనర్’ లోనే తీర్చిదిద్దే ‘నిపుణులను’ నియమించుకొని తన ప్రతిభకును చాటుకున్నారు తేజమార్ని. కథ జరిగిన ప్రాంతం ఆంధ్ర - ఒరిస్సా బోర్డర్. ఈ ప్రాంతపు టోన్, లైటింగ్స్‌తో సన్నివేశాలకు నిండుతనం తెచ్చాడు కెమెరామెన్ జగదీష్. రంజన్ రాజ్ అందించిన సంగీతంలో ఒక పాట ఇప్పటికే బాగా హీట్ అయింది. నేపథ్య సంగీతంను కూడా కథకు ‘బలం’ చేకూర్చే విధంగా అందించాడు. నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, విద్యా కొప్పినీడి, సహనిర్మాతలు భాను కిరణ్ ప్రతాప్, రియాజ్‌లు దర్శకుడు ఎంచుకున్న కథకనుగుణమైన నిర్మాణ ‘విలువల’ను సంపూర్ణంగా అందించారనే విషయం ‘చిత్రం’ చూసిన ప్రేక్షకులకు తెలుస్తుంది. దర్శకుడిగా తేజమార్ని మళయాళి రీమేక్‌తో వచ్చినా, తనదైన సహజమైన ముద్రతో చిత్రాన్ని తీశారు. విజయం సాధించారు. యాక్షన్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, కళ ఇలా అన్నింటిని ఆయన సంపూర్ణంగా వాడుకున్నారు.
వర్తమానంలో రాజకీయాలు, పోలీసు వ్యవస్థ ఒకదానిపైన ఒకటి ఆధారపడుతున్న నాయకులు, పోలీసులు వాడుకునే విధానం గమనించాలి. ఈ నేపథ్యంలో బలయ్యే పోలీసులు, ఓటు బ్యాంకు, ఓటర్ల పాత్ర వంటి అంశాల్ని స్పృశిస్తూనే, చివర ఓ సందేశంతో మలయాళ ఒరిజినల్ని అనుసరించిన ‘తేజ’ ముగింపు ఇచ్చేశారు. తెలుగు చిత్రాలలో ఓ కొత్త జార్గాన్ కోసం ప్రయత్నించిన ‘కోటబొమ్మాళి’ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో, ఆలోచింపజేస్తుందో చూడాలి. ప్రస్తుత ఎన్నికల వాతావరణానికి చెందిన ఈ ఆలోచింపజేసే కథ కోసం ‘రీమేక్’ కన్నా ఒరిజినల్‌గా ఇంతకు మించిన నాటకీయ ఫక్కీ కథనాలు నేటి సమాజంలో జరుగుతున్నాయి. వాటిని కథలుగా మలుచుకోవచ్చు అనిపిస్తుంది. కానీ.. సినిమా అనేది నేడు వ్యాపారంగా మారింది. ‘మినిమం’ గ్యారెంటీ నిచ్చే ‘రీమేక్’లనే నిర్మాత, దర్శకులు ఇష్టపడుతున్నారు. ‘కోటబొమ్మాళి’ ఆ కోవకు చెందిన ప్రయత్నం.
(ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వీక్షించవచ్చు)
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395