ఈ మధ్య కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటులో జాప్యం వల్ల యువత ఆత్మహత్య చేసుకున్నందుకు ‘సారీ’ చెప్పారు. దానికి బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఒంటికాలిపై లేచి, యువత చావుకు కారణం కాంగ్రెస్సేనని, ఆ పార్టీకి ఓటు వేయకండని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఐతే ఒక అడుగు ముందుకేసి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ‘కైలాసం ఆటలోని పెద్దపాము’తో పోల్చాడు.
ఈ జోలీ తీయరెందుకు?
అయితే అప్పుడేం జరిగిందో ఓ సారి ప్రస్తావిస్తే అసలు నిజాలు తెలుస్తాయి.. తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తమకే వస్తాయని నమ్మిన యువకులు, నాడు ఉద్యమంలో ఉప్పెనలా పాల్గొన్నారు. ఎప్పుడూ ఉండే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటుగా, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, మండలాలు వల్ల మరిన్ని ఎక్కువ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నియామక ప్రక్రియ మందకొడిగా, మొక్కుబడిగా జరిగింది. తద్వారా తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తోందన్నది నిజం కాదా? ఉద్యోగాలంటే కేవలం సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చేవి కాదు. తెలంగాణలో అందరూ కంప్యూటర్ కోర్సులు చదవలేదు కదా! కేవలం ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని కాదు వారు ఆత్మహత్యకు పాల్పడ్డది. అసలు వారి చదువుకు తగ్గట్టుగా చేయడానికి ఏ పనీ దొరకడం లేదని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరి ఉద్యోగాల కోసం కొట్లాడిన తెలంగాణలో ప్రభుత్వ అశ్రద్ధ వల్ల యువత ప్రాణాలు తీసుకుంటోంది. దీనికి ఎవరు బాధ్యులు? తెలంగాణ సర్కారు తన బిడ్డలను తనే చంపుతుందని అనవచ్చా? సరే, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించలేము. కనీసం ప్రైవేట్ రంగంలోనైనా సగం (50 శాతం) ఉద్యోగాలు తెలంగాణ వారికే ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపారా? అది చేసైనా నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారా? అదీ చేయలేదు. పోనీ నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి అయిన ఇచ్చారా? ఇప్పటివరకు ఎక్కువ మంది బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాల ముచ్చట గానీ, వారు గత ఎన్నికల్లో ఇస్తానన్న నిరుద్యోగ భృతి జోలిని గానీ ఎక్కడా తీస్తలేరు.
చదువుకున్న వారికి గుండుసున్నా..
కాంగ్రెస్ వారు ‘బంగారు పళ్ళెంలో పెట్టిచ్చిన తెలంగాణ’ను కేసీఆర్ తనకు నచ్చిన వారికి ‘ఎములాడ రాజన్న పలారం’ లెక్క పంచుతున్నాడు. తెలంగాణపై సినిమా తీసిన వారికి ఉచితంగా భూములిచ్చే, గజ్జెకట్టి ఆడి పాడిన వారికి కొత్త రకం సర్కారు కొలువులిచ్చే, కవులను, రచయితలను మండలికి సెలెక్ట్ చేసె, ఛోటా నేతలకు నామినేటెడ్ పోస్టులిచ్చే, మోటా లీడర్లను చట్ట సభలకు పంపె. ఇంకా, దళిత, గిరిజన, బీసీల కులవృత్తులను కాపాడే పేరుతో చేపపిల్లలు, బర్లు, గొర్లు, పనిముట్లు, యంత్రాలు, వాహనాలు ప్రభుత్వమే పంపిణీ చేసే, కానీ ఆ వర్గాల్లో చదువుకున్న వారికి మాత్రం గుండుసున్నా మిగిల్చే!
కుల సంఘాలకేమో ‘బంధు’ అయ్యిండు, నిరుద్యోగులకేమో ‘రాబందు’ అయ్యిండు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆరే ‘కైలాసం ఆటలో ఉండే పెద్దపాము’ అవతారం ఎత్తి బహుజన కులాలకు చెందిన నిరుద్యోగులను పాతాళానికి పంపిండు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆసరా పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులు ఖచ్చితంగా కారుకే ఓటు వేస్తారని బిర్రుమీదున్న కేసీఆర్, నిరుద్యోగుల ఓట్లతో, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లతో అసలు అక్కరలేదని వారిని ఖాతరు చేయడం లేదు.
ప్రకటనలతో మోసం చేస్తూ..
‘తెలంగాణ ఓటరు నాడీ’ కేసీఆర్‌కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే బీఆర్ఎస్ ఎన్నికల ప్రకటనలను.. తెలంగాణ పల్లె జనాలను ఎంతగానో అలరించిన ‘బలగం’ చిత్రంలో నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) టీంతో చేయించాడు. అలాగే, ‘గులాబీల జెండలే రామక్క’ అనే అచ్చమైన తెలంగాణ జానపద గేయాన్ని రూపొందించి, క్లాస్-మాస్ అని తేడా లేకుండా ఓటర్లందరినీ ఆకర్షించే వ్యూహం పన్నాడు. ఇంకా, ఈ మధ్య చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డి సీక్రెట్‌గా కలిసినట్టుగా, ఎన్నికలు అయిపోయాక మళ్ళీ తెలంగాణను ఆంధ్రలో కలపడానికి ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్తను సృష్టించి సర్క్యులేట్ చేసింది. బీఆర్ఎస్ ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన పనులను చెప్పకుండా, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇంకా తెలంగాణ సెంటిమెంటునే రగిలిస్తున్నది. ఈ ఫేక్ వార్తలను నమ్మి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే జనాలుండటం కొసమెరుపు.
శ్రీ జనార్ధన్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు