ఒంటరితనం నుంచి సహచర్యంలోకి...‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’

ఒంటరితనం నుంచి సహచర్యంలోకి...‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’... Kareeb Kareeb Single is an simple feel good movie says varala anand

Update: 2023-03-10 18:45 GMT

ర్తమాన సంక్షోభ కాల పరిస్థితుల్లో అన్ని మానవ సంబంధాలు అతలాకుతలమవుతున్నాయి. మానసిక ఒంటరితనాలు రాజ్యమేలుతున్నాయి. స్త్రీ పురుష సంబంధాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఒంటరితనం నుంచి సహచర్యంలోకి సాగే ఇద్దరు స్త్రీ పురుషుల జీవన దృశ్యమే ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’ సినిమా. 2017 లో వచ్చిన ఈ సినిమాకు తనుజ చంద్ర దర్శకత్వం వహించారు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’ రెండు ప్రధాన పాత్రలతో సాగి నగర జీవితాల్లో కనిపిస్తున్న అనేక అంశాలను చర్చిస్తుంది.

పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా రూపొందిన వెబ్‌సైట్ స్నేహాలూ, దానివల్ల ఒనగూడే విపరీత పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చిన్న పాయింట్ చుట్టూరా సాగినప్పటికీ స్క్రీన్‌ప్లే‌లో వున్న సాధికారికత బిగువుల వాళ్ళ ప్రేక్షకుల్ని ఇట్టే ఈ సినిమా కట్టిపడేస్తుంది. ఇక జయా శశిధరన్, యోగి పాత్రల్లో నటించిన పార్వతి, ఇర్ఫాన్‌ఖాన్‌ల నటన మొత్తం సినిమాకు ఆయువుపట్టు. ఇద్దరూ తమ పాత్రల్ని ఆలవోకగా సరదాగా నటిస్తూనే అన్ని ఎమోషన్స్‌ని ప్రకటిస్తారు. బహుముఖ ప్రతిభ గల ఇర్ఫాన్‌కు సమవుజ్జీగా ఒక్కో‌చోట ఆయన్ను అధిగమిస్తూ కూడా పార్వతి నటించిన తీరు బాగుంటుంది. మలయాళం సినిమా టేక్ ఆఫ్‌తో ప్రసిద్దమయిన పార్వతి ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’ లో మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. సినిమా మొత్తంగా ఎలాంటి డాంబికాలు లేకుండా వాస్తవ జీవితాన్ని దాటి పోకుండా, క్రైం హింస లేకుండా అట్లా సాఫీగా సాగిపోతుంది.

కథేంటంటే

ఇక సినిమా కథాంశానికి వస్తే పెళ్లయి సహచరుడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న 35 ఏళ్ళ జయాశశిధరన్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తూ వుంటుంది. ఒంటరితనానికి అలవాటు పడుతూనే రాత్రుళ్లు నిద్ర మాత్రలు మింగుతూ వుంటుంది. కానీ అనేక మంది మిత్రులు సహోద్యోగుల వెక్కిరింతలు, ప్రోద్బలంతో జీవితంలో కొంత వినోదం కావాలని తలపోస్తోంది అయిష్టంగానే ‘అబ్ తక్ సింగిల్.కాం’ అనే వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకొంటుంది. అయితే అక్కడ వెనువెంటనే వస్తున్న సందేశాలు చూసి ఆందోళనకు గురవుతుంది. చివరికి కవిత్వమే తన హాబీగా ప్రకటించుకున్న యోగి పేరుతో కవిత్వం రాసే యోగేంద్ర కుమార్ దేవేంద్రనాథ్ ప్రజాపతి‌ని ఆ వెబ్‌సైట్ ద్వారా కలుస్తుంది, తరచూ ఇద్దరూ మాట్లాడుకుని కలుసుకోవాలనుకుంటారు. యోగి సరదాగా ఉండే మంచి మనసున్న మనిషి. మొదట జయ యోగిని విశ్వసించదు. కానీ రెండు, మూడుసార్లు కలిసిన తర్వాత యోగి ఓపెన్‌నెస్ పట్ల ఆసక్తి కనబరుస్తుంది.

యోగి తాను కవిత్వం రాస్తానని ఒక సంకలనం కూడా సొంతంగా అచ్చువేశానని అది అంతగా అమ్ముడుపోలేదని మిత్రులకు పంచిపెట్టానని చెబుతాడు. వాళ్లు కూడా ఎవరూ పెద్దగా చదివి ప్రతిస్పందించలేదని అంటాడు. ఇంటర్నెట్‌లో రాయడం ద్వారా చాలా మందికి చేరవచ్చునని జయ చెబుతుంది. చదవడమే మరచిపోతున్న తరుణంలో ఇంటర్నెట్‌లో ఎవరు చదువుతారంటాడు యోగి. మాటల సందర్భంగా తనకు గతంలో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని చెబుతాడు యోగి. జయ కూడా తనకు పెళ్ళయిందని చెబుతుంది. యోగి తన పాత గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా తానంటే ఇష్టపడుతున్నానని అంటాడు. కానీ జయ అలా ఏం ఉండదని ఛాలెంజ్ చేస్తుంది. అయితే సరే వాళ్ళని కలుద్దామంటాడు. తన వెంట రమ్మని జయని అడుగుతాడు. మొదట కాదన్నప్పటికీ అయిష్టంగానే యోగితో బయలుదేరుతుంది జయ. తన దగ్గర చాలా డబ్బుందని ఒక్క లాడ్జి ఖర్చుని జయని పెట్టుకొమ్మని అంటాడు యోగి. ఆఫీస్‌లో సెలవుపెట్టి బయలుదేరుతుంది జయ. డెహ్రాడూన్‌లో వున్న యోగి స్నేహితురాలు రాధను కలవడానికి వెళ్దామని ఫ్లైట్ బుక్ చేస్తాడు. కానీ యోగి విమానం మిస్ అవుతాడు. జయ భయపడుతుంది కానీ డెహ్రాడూన్ చేరేసరికి నానా కష్టాలు పడి యోగి ఆమెను చేరుకుంటాడు. దాహంగా వుంది నీళ్లిమ్మంటాడు యోగి కానీ తాను వాటర్ బాటిల్ ఎవరితోనూ షేర్ చేసుకోనంటుంది జయ.

అలా ఇద్దరు ఒక ఆశ్రమంలో వుంటారు. గంగా హారతి చూసి రాధ కుటుంబాన్ని కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత రెండో మిత్రురాలిని కలవడానికి జైపూర్ బయలుదేరతారు. అక్కడ ఒక రాణీ వాసపు రైలులో బుక్ చేస్తాడు యోగి. క్రమంగా జయ యోగి సాన్నిహిత్యాన్ని ఆనందించడం మొదలు పెడుతుంది. తినడానికి తెస్తానని కిందికి దిగిన యోగి మరో రైలు ఎక్కి జయను మిస్ అవుతాడు. జయ లాప్‌టాప్ యోగి వెంట ఉండిపోతుంది. అంతా తీవ్రమయిన కంగారు, సున్నితమైన హాస్యం సరదాగా సాగుతుంది. జయ హోటల్‌కు చేరుకొని ఒక ఫారినర్‌తో కలిసి ఫారెస్ట్ టూర్‌కు వెళ్తుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న యోగిని కలవడానికి తన మిత్రురాలు అంజలి వస్తుంది. అంజలి కూడా యోగి పట్ల ఆసక్తిగానే వుంటుంది. అతనికి ముద్దు పెడుతుంది.

ఫీల్ గుడ్ మూవీ

అక్కడినుండి మూడో మిత్రురాలిని కలవడానికి గాంగ్‌టక్ బయలుదేరతారు. కానీ అక్కడ తాను యోగి వెంట రావడం లేదని తన పాత బాయ్ ఫ్రెండ్‌ను కలవడానికి వెళతానంటుంది. యోగి ఖిన్నుడవుతాడు. తన మిత్రురాలు గాంగ్‌టక్‌లో డాన్స్ టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమెని కలవకుండానే యోగి తిరిగి వస్తాడు. జయ తన స్నేహితున్ని అతని కుటుంబాన్ని కలిసి ఎంజాయ్ చేస్తుంది. యోగి తన తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంటాడు. జయ అతన్ని విమర్శిస్తుంది. స్వార్థపరుడవని దూషిస్తుంది. నీకు నువ్వే కానీ వేరే వాళ్ల కోసం ఏమీ చేయవు అంటుంది. నీ ముగ్గురు మాజీ గర్ల్స్ ఫ్రెండ్స్‌ని కలవడానికి నేనే తోడు వచ్చాను, కానీ నువ్వు మాత్రం అట్లా నాతో రాలేదంటుంది. హోటల్ గదిలో జయ లాప్‌ట్యాప్ తీసిచూసి అందులో తన కవిత్వం‌తో రూపొందించిన వెబ్‌పేజ్ చూస్తాడు యోగి. ఆమె పట్ల తనకున్న ప్రేమని తెలుసుకుంటాడు. తిరిగి జయ కోసం బయలుదేరి రోప్‌వే‌లో కలిసుకుంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఒకరిని ఒకరు తెలుసుకుంటారు. యోగి ఆమెను అడుగుతాడు నీళ్ళ బాటిల్ షేర్ చేస్తావా అని ఆమె నవ్వుకుంటూ నీళ్ళ సీసా ఇస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’ మొత్తం హాస్యం, సీరియస్‌నెస్, ఉద్వేగాలతో కూడి సీరియస్ అంశాల్ని చర్చిస్తూనే ఫీల్ గుడ్ మూవీగా ముగుస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’ నెట్‌ప్లిక్స్‌లో అందుబాటులో వుంది.

సినిమా: ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’, కథ: కామన చంద్ర, దర్శకత్వం: తనుజ చంద్ర, నటీ నటులు: ఇర్ఫాన్ ఖాన్, పార్వతి

వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News