రేషన్ కార్డు అనర్హులను తొలగించడం కత్తిమీద సామే..!
అర్హులందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందజేస్తామని, అలాగే అనర్హులకు రేషన్ కార్డులు తొలగిస్తామని ఇటీవల తెలంగాణ మంత్రి పొంగులేటి
అర్హులందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందజేస్తామని, అలాగే అనర్హులకు రేషన్ కార్డులు తొలగిస్తామని ఇటీవల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు కూడా రేషన్ కార్డే ఆధారమవుతుంది కాబట్టి రేషన్ కార్డులను ఎంత తక్కువగా తొలగించినా సరే అది ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతుంది. కాబట్టి అనర్హత పేరుతో ఎన్నికార్డులను తొలగించాలో నిర్ణయించడం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతుంది. అర్హులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ఆ మాత్రం ధైర్యం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు కసరత్తు ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పేరిట గ్రామ, పట్టణ, వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించి అభయహస్తం పేరిట దరఖాస్తులను స్వీకరించింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం సైతం దరఖాస్తులను తీసుకున్నది. ఇందులో సుమారు పది లక్షల మంది వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మరో ఐదు లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీంతో సుమారు 15 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. కొత్త వాటిని జారీ చేస్తే రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటే అవకాశముంది.
రేషన్ కార్డు ఎంతో ముఖ్యం
ఆరు గ్యారెంటీలైనా.. లేదా ఆరోగ్యశ్రీ లాంటి ఏ ఇతర సంక్షేమ పథకాలైనా వాటి ద్వారా లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆహార భద్రత కార్డులు కేవలం రేషన్ కోసమేనని చాలా సార్లు ప్రకటించినా.. ప్రతి పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబమని నిరూపించేందుకు రేషన్ కార్డే ట్రంప్ కార్డ్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మిలోని గ్యాస్ సిలిండర్ స్కీమ్స్‌కు రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి స్కీమ్స్ ప్రయోజనాలు సైతం రేషన్ కార్డు ఉంటేనే అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కూడా రేషన్‌కార్డు ఉన్నవారికే అందుతున్నాయి. దీంతో పాటు స్థానిక ధ్రువీకరణ, ఆదాయ ధ్రువపత్రం మంజూరు కూడా అధికారులు రేషన్‌కార్డు అడుగుతున్నారు. దీంతో రేషన్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రజలకు అర్థమైంది.
కొత్త కార్డులు ఇందుకే ఇవ్వలేదు..
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘360 డిగ్రీస్’ అనే సాఫ్ట్ వేర్‌ను తయారు చేయించింది. ఎన్‌ఐసీ, ఐటీ తదితర శాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆదాయపు పన్ను చెల్లించే వారు, ఉద్యోగులు.. ఇలా పౌరులకు సంబంధించి వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పొందుపరచింది. దీని ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆధార్ నంబర్ల ద్వారా జల్లెడ పట్టింది. ఒకవేళ ఈ సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తుదారుడి సమాచారం దొరికితే సదరు అప్లికేషన్‌ను తిరస్కరించాలని భావించింది. లేకపోతే సదరు దరఖాస్తును సంబంధిత జిల్లా అధికారులకు పంపేందుకు సిద్ధమైంది. అయితే ఎంతో మంది అర్హుల దరఖాస్తులు సైతం ఈ సాఫ్ట్‌వేర్ వల్ల రిజెక్ట్ అయ్యాయని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముందుకు సాగించలేదు.
గత ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదని గుర్తించింది. చాలా మంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడానికే మాత్రమే రేషన్ కార్డులను తీసుకున్నారని తేల్చింది. అందుకే ఈ ప్రభుత్వం అనర్హులని తొలగించింది. కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే లక్షకు పైగా కార్డులను రద్దు చేశారు.
‘బీపీఎల్’ ప్రమాణాలను పెంచాలి!
రాష్ట్రంలో ప్రస్తుతమున్న 90 లక్షల కార్డుల్లో ఇరవై శాతానికి పైగా అనర్హుల చేతుల్లోనే ఉన్నాయనే చర్చ ఉంది. కార్లు, పెద్దపెద్ద బంగ్లాలు కలిగి ఉండి నెలకు లక్షల రూపాయలు అద్దెల రూపంలో తీసుకుంటున్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న వారు సైతం రేషన్ కార్డు ద్వారా వివిధ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కోట్లాది రూపాయల ఇండ్లలో ఉంటూ గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి స్కీమ్స్‌ను తీసుకుంటున్నారు. అదే సమయంలో కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల వల్ల రేషన్ కార్డ్ పొందలేక అనేక రకాల స్కీమ్స్‌కు దూరమవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించి రేషన్ కార్డులు మంజూరు చేస్తేనే అర్హులకు లాభం జరిగే అవకాశముంది. ఇందుకోసం ముందుగా ‘బీపీఎల్’ ప్రమాణాలను మార్చాల్సిన అవసరముంది.
రిస్క్ తీసుకోక తప్పదు!
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా ప్రభుత్వం గుర్తిస్తున్నది. ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షలుగా పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్లో ప్లేట్ కార్లను మినహాయించి వైట్ ప్లేట్ కార్లు కలిగిన వారు, నివాస యోగ్యానికి అదనంగా ఉన్న స్థలాల్లో షట్టర్లు, మడిగీలు వేసి అద్దెలు పొందుతున్న వారు, రూ. 7 లక్షలకు పైగా సంపాదిస్తూ ఐటీ కడుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ 7 లక్షలకు పైగా సంపాదిస్తున్న వారి వద్ద రేషన్ కార్డులు ఉంటే వాటిని రద్దు చేసి.. అర్హులకు అందిస్తే బాగుంటుంది.
గతంలో రేషన్ కార్డు మంజూరు చేసినప్పుడు రూల్స్ సరిగా వర్తింపజేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనర్హులకు రేషన్ కార్డులు దక్కాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే విమర్శల భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డులను రద్దు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందా అనేది అనుమానంగా ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అర్హులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రిస్క్ తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. అర్హులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ఆ మాత్రం ధైర్యం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464